close
Array ( ) 1

తాజా వార్తలు

Published : 25/05/2020 10:23 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఓహ్‌..! ఆ భావోద్వేగం ఇప్పుడెలా?

ఆట.. అభిమానులు.. ఆటగాళ్లది అవినాభావ సంబంధం

ఖాళీ స్టేడియాల్లో అరుపులు, కేరింతల కోసం వినూత్న ప్రయత్నాలు

విరాట్‌ కోహ్లీ క్రీజులోంచి ఎడమకాలిని ముందుకేసి తన ట్రేడ్‌మార్క్‌ కవర్‌డ్రైవ్‌తో బంతిని అంతర్‌వృత్తంలోని ఇద్దరు ఫీల్డర్ల మధ్యలోంచి బౌండరీకి పంపిస్తే అభిమానులు పరవశానికి లోనవుతారు. రొనాల్డొ గాల్లోకి ఎగిరి భూమికి సమాంతరంగా ఉండి బైసైకిల్‌ కిక్‌తో బంతిని గోల్‌పోస్ట్‌లోకి పంపిస్తే అభిమానుల అరుపులతో స్టేడియం దద్దరిల్లిపోతుంది. ఎందుకంటే ఆట.. ఆటగాళ్లు.. అభిమానుల మధ్య ఉండే భావోద్వేగం అలాంటిది. 

కరోనా వైరస్‌ ముప్పుతో ప్రస్తుతం స్టేడియాల్లోకి అభిమానులను అనుమతించడం లేదు. ఇన్నేళ్లూ అభిమానుల అరుపులు, కేరింతల మధ్య ఆడేందుకే ఆటగాళ్లు అలవాటు పడ్డారు. వారితో కలిగే ఉత్కంఠ, ఉద్వేగమే వేరు. ఇప్పుడు బోసిపోయిన కుర్చీలను చూస్తూ ఆడాలంటే ఎవరికైనా ఇబ్బందే. అందుకే ఆ ఫీలింగ్‌ను పోగొట్టేందుకు నిర్వాహకులు చేస్తున్న ప్రయోగాలేంటో తెలుసుకుందామా!!


‘చిట్టి’ ది డ్రమ్మర్‌

స్టేడియంలో మ్యాచులు జరుగుతోంటే సంగీతకారులు మంచి మంచి బీట్స్‌తో అభిమానులను అలరిస్తారు. ఆట చూస్తూ, సంగీతాన్ని ఆస్వాదిస్తూ వారు ఆటను వీక్షిస్తారు. ఐపీఎల్‌లోనూ స్థానిక భాషల్లో పాటలు వినిపించే సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఇలాంటి అవకాశం లేకపోవడంతో నిర్వాహకులు కొత్తగా ఆలోచించారు. రోబో డ్రమ్మర్స్‌ను ఏర్పాటు చేశారు. గత నెల్లో తైవాన్‌ బేస్‌బాల్‌ లీగులో ‘చిట్టి’ వాద్యకారులు హవా సృష్టించారంటే నమ్మండి!


అభిమానుల సొంత చిత్రాలతో

ఖాళీ సీట్లలో కటౌట్లు ఉంచడం మామూలే. జర్మన్‌ ఫుట్‌బాల్‌‌ క్లబ్‌ బొరసియా మొయిన్‌చెంగ్లద్‌బాక్‌ దానికి మరో స్థాయికి తీసుకెళ్లింది. స్టాండ్స్‌లో అభిమానుల నిజమైన బొమ్మలతో కటౌట్లు ఉంచేలా ఏర్పాటు చేసింది. ఈ ఆలోచనకు యువత ఫిదా అయింది. వేలాది మంది అభిమానులు ఒక్కో చిత్రానికి 19 యూరోలు చెల్లించి స్టేడియంలో తమ కటౌట్లను పెట్టించారు. వారి నుంచి విపరీతమైన స్పందన రావడంతో నిర్వాహకులు సంతోషం వ్యక్తం చేశారు.


నినాదాలు మార్మోగేలా

మైదానంలో అద్భుతమైన ఘటన ఏదైనా జరిగితే చాలు అభిమానుల అరుపులు, కేకలతో స్టేడియం హోరెత్తిపోతుంది. సచిన్‌.. సచిన్‌’, ‘కోహ్లీ.. కోహ్లీ’ వంటి నినాదాలు మనకు నిత్యం వినిపిస్తూనే ఉంటాయి. ఖాళీ ఫుట్‌బాల్‌ స్టేడియాల్లో  ఈ తరహా నినాదాలు వినిపించేలా దక్షిణ కొరియా కే-లీగ్‌ నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. 2002 ప్రపంచకప్‌ పోటీల నినాదాలనూ వినిపిస్తున్నారు. వచ్చే నెలలో ఆరంభమయ్యే క్రీడల కోసం ఆస్ట్రేలియా రూల్స్‌ ఫుట్‌బాల్‌ నిర్వాహకులూ ఇదే బాటలో పయనిస్తున్నారు. గతంలో అభిమానుల అరుపులు, కేరింతల పుటేజీల్లోంచి శబ్దాలను వేరుచేసి మైకుల్లో ప్రసారం చేయనున్నారు. ఇప్పటికే సినిమా నిపుణులను సంప్రదించి ట్రయల్స్‌ చేయడం గమనార్హం.


ఇంట్లో చప్పట్లు స్టేడియాల్లో వినిపించేలా

ఉద్యోగులు ఇంటి నుంచి పనిచేయడం ఎప్పట్నుంచో ఉన్నదే. ఇదే సూత్రాన్ని అన్వయించుకొని కొందరు సాఫ్ట్‌వేర్‌ డెవలపర్లు ‘మైఅప్లాజ్‌’ యాప్‌ను రూపొందించారు. అభిమానులు ఇంట్లోనే ఉండి మ్యాచు చూస్తుంటారు. ఏదైనా జరిగితే చప్పట్లు కొట్టడమో, అరవడమో, కేరింతలు పెట్టడమో చేస్తారు కదా! ఆ శబ్దాలను యాప్‌ నుంచి స్టేడియంలోని భారీ లౌడ్‌స్పీకర్ల ద్వారా ప్రసారం చేస్తారు. ఇంట్లోనూ ఇవి వినిపిస్తాయి. దక్షిణ కొరియా బేస్‌బాల్‌ నిర్వాహకులు సైతం ఇలాంటి మార్గమే ఎంచుకున్నారు. ఆన్‌లైన్‌లో మ్యాచు చూస్తున్న అభిమానుల చిత్రాలను స్టేడియంలోని తెరలపై ప్రదర్శిస్తారు.


ఫ్యాన్స్‌కు టచ్‌లో ఉల్లాసినులు 

తైవాన్‌లోని ఉల్లాసినులు స్టేడియం నుంచి లైవ్‌లో అభిమానులను అలరిస్తున్నారు. వారితో ఛాటింగ్‌ చేస్తున్నారు. మొబైల్‌ ఫోన్లలో తమ నృత్యాలు చూపిస్తున్నారు. లైవ్‌లో ఒక ఉల్లాసిని స్టాండ్స్‌లో కూర్చొని బార్బెక్యూలో వండుకొని ఆరగించింది. ఇక దక్షిణ కొరియాలోని ఎఫ్‌సీ సియోల్‌ క్లబ్‌ సెక్స్‌ డాల్స్‌ను ఉపయోగించడం కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. మానిక్వీన్స్‌ అనుకొని ఈ టాయ్స్‌ను ఉపయోగించారు. దీంతో నిర్వాహకులు 81వేల డాలర్ల భారీ జరిమానా విధించారు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.