
తాజా వార్తలు
భారీ భద్రత మధ్య సచివాలయానికి జగన్
అమరావతి: ఏపీ సీఎం జగన్ అధ్యక్షతన వెలగపూడిలోని సచివాలయంలో సమావేశమైన రాష్ట్ర మంత్రివర్గం భారీ వర్షాలు, నివర్ తుపానుపై చర్చించింది. నష్ట పరిహారం అంచనాలను డిసెంబరు 15 నాటికి పూర్తి చేయాలని ఈ సందర్భంగా సీఎం ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలకు అనుగుణంగా పరిహారం అందించాలని సీఎం సూచించారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 40వేల హెక్టార్లలో పంట నష్టం వాటిల్లిందని ప్రాథమికంగా అంచనావేసినట్టు అధికారులు సీఎంకు వివరించారు. జనవరి 2021 నాటికి పరిహారం చెల్లించాలని సీఎం ఆదేశించారు. అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టే వివిధ ముసాయిదా బిల్లులకు ఆమోదంపై కేబినెట్లో చర్చించినట్టు సమాచారం.
మంత్రి మండలి సమావేశంలో పాల్గొనేందుకు సీఎం జగన్ సచివాలయానికి వెళ్తుండగా.. మందడంలో రైతులు జై అమరావతి అంటూ నినాదాలు చేశారు. మంత్రివర్గ సమావేశం నేపథ్యంలో మందడంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. దీక్షా శిబిరం నుంచి రైతులు బయటకు రాకుండా రెండంచెల భద్రత ఏర్పాటు చేశారు. భారీ భద్రత నడుమ సీఎం సచివాలయానికి చేరుకున్నారు. పోలీసుల తీరును నిరసిస్తూ రైతులు జై అమరావతి అంటూ నినాదాలు చేశారు. ఏ ముఖ్యమంత్రి రైతులకు భయపడి ఇంత భద్రత మధ్య సచివాలయానికి వెళ్లలేదని ఈ సందర్భంగా రైతులు ఆరోపించారు.