close

తాజా వార్తలు

‘ఫొటోలు వైరల్‌ చేస్తానన్నాడు..అందుకే వెళ్లా’

  పోలీసు విచారణలో యువతి వెల్లడి
న్యూస్‌టుడే, నారాయణగూడ

హిమాయత్‌నగర్‌లోని ఓ హాస్టల్‌లో ఉంటూ చదువుకుంటున్న ఓ యువతి ట్యాంక్‌బండ్‌లో దూకి ఆత్మహత్య చేసుకుంటానని లేఖ వదిలి వెళ్లిన ఘటన నారాయణగూడ పోలీసులకు ఉరుకులు పరుగులు పెట్టించిన విషయం విదితమే. ఆ యువతిని, ఆమెతో పాటు ఓ అబ్బాయిని గుంటూరులో అదుపులో తీసుకుని సోమవారం హైదరాబాద్‌కు తీసుకొచ్చి విచారించారు. ఈ సందర్భంగా ఆమె ఆసక్తికరమైన విషయాలు వెల్లడించినట్లు తెలిసింది.

ప్రేమించి.. విడిపోయి..
ఇరువురుది నిజామాబాద్‌ జిల్లా నవీపేట గ్రామం. ఆ అబ్బాయితో  యువతికి బాల్యం నుంచే పరిచయం ఉంది. ఇద్దరూ ప్రేమించుకున్నారు. కలిసి తిరిగారు. ఆ సందర్భంలో ఫొటోలు కూడా దిగారు. కొంతకాలానికి విడిపోయారు. ఉన్నత చదువుల నిమిత్తం ఆ యువతి హైదరాబాద్‌కు వచ్చి హాస్టల్‌లో ఉంటూ నారాయణగూడలోని ఓ కళాశాలలో ఇంజినీరింగ్‌ చదువుకుంటోంది. ఆ అబ్బాయి కూడా హోటల్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సు చేయడానికి నగరానికి వచ్చాడు. ఆ అమ్మాయి ఇక్కడే ఉందని తెలుసుకొని ఆమెకు తరచూ ఆమెకు ఫోన్లు చేయడం మొదలుపెట్టాడు. ఈ అమ్మాయి మాట్లాడేందుకు నిరాకరిస్తే కళాశాలకు, హాస్టల్‌కు వెళ్లి పెట్రోల్‌ పోసి తగులబెడతానని, తానూ చచ్చిపోతానని బెదిరింపులకు దిగేవాడని పోలీసులతో యువతి చెప్పిందని తెలుస్తోంది. తన దగ్గరున్న ఫొటోలను వైరల్‌ చేస్తానని బెదిరించాడు. అతన్ని వదిలించుకునేందుకు ఆమె సెల్‌ఫోన్‌ నెంబరు మార్చింది. దీంతో ఆమె రూమ్‌మేట్‌కు ఫోన్‌ చేసి తనను పెళ్లి చేసుకోవాలని, తన గదికి రావాలని బెదిరించాడు. ఫొటోలు వైరల్‌ చేస్తే కుటుంబమంతా వీధినపడుతుందని.. చావే తన సమస్యకు పరిష్కారంగా భావించానని పోలీసుల ముందు ఆ యువతి వాపోయిందని సమాచారం.

‘వాకర్స్‌ అడ్డుకున్నారు’
ట్యాంక్‌బండ్‌లో దూకి చచ్చిపోదామని నిర్ణయించుకుని లేఖ రాసింది. తమ ఊరిలోని మరో బాల్య స్నేహితుడికి వీడియోకాల్‌ చేసి చనిపోతున్నానని కూడా చెప్పింది. ట్యాంక్‌బండ్‌పై ఉన్న వాకర్స్‌ ఆమె ఆత్మహత్యాయత్నాన్ని అడ్డుకున్నట్లు ఆమె చెప్పినట్లు సమాచారం. ఆ అబ్బాయి ఫోన్‌ చేయడంతో బేగంపేట్‌లోని ఆ అబ్బాయి గదికి వెళ్లింది. అతని సెల్‌ఫోన్‌లో ఉన్న తన ఫొటోలను డిలీట్‌ చేసింది. మరో ఫోన్‌లో కూడా ఫొటోలు ఉన్నాయని.. తనను పెళ్లి చేసుకోకపోతే చచ్చిపోతానంటూ గదిలో ఉన్న రసాయనం తాగేశాడు. బ్లేడ్‌తో చేయి కూడా కోసుకున్నాడని ఆమె చెప్పినట్లుగా సమాచారం. గత్యంతరం లేక అతడితో కలిసి గుంటూరులో ఉంటున్న అతని బావమరిది దగ్గరకు వెళ్లారు. ఇద్దరికి పెళ్లి చేసేందుకు అతడు ఏర్పాట్లు చేశాడు. యువతికి స్థానికంగా ఓ మహిళా హాస్టల్‌లో వసతి కల్పించారు. ఆ లోపు అబిడ్స్‌ ఏసీపీ భిక్షంరెడ్డి సారథ్యంలో నారాయణగూడ ఇన్‌స్పెక్టర్‌ రమేశ్‌కుమార్‌ ఆధ్వర్యంలో ఎస్సై నారాయణ తన బృందంతో గుంటూరు చేరుకుని పట్టుకోవడంతో ఆమె కథ సుఖాంతమైంది. సోమవారం ఉదయం నగరానికి తీసుకువచ్చి వారిని వేర్వేరుగా విచారించారు. ఆ యువతిని వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి పంపించారు. అనంతరం భరోసా కేంద్రానికి తరలించారు. ఈ విషయమై నారాయణగూడ పోలీసులను వివరణ కోరగా.. విచారణ కొనసాగుతోందని, అప్పుడే తామేమీ చెప్పలేమన్నారు.



Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.