
తాజా వార్తలు
సినిమాను తలపించే ఛేజ్.. వైరల్ వీడియో
ఇంటర్నెట్ డెస్క్: సినిమాల్లో చూసినట్లు దొంగలను వెంటాడి మరీ పట్టుకున్న ఓ పోలీసు అధికారి సాహసం పలువురి ప్రశంసలందుకుంటోంది. చెన్నైలోని మాధవవరం ప్రాంతంలో చోటుచేసుకున్న ఈ సంఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. దీనిని గ్రేటర్ చెన్నై పోలీసు శాఖ, ఆ నగర పోలీస్ కమిషనర్ మహేశ్ కుమార్ అగర్వాల్‌తో సహా పలువురు పోలీసు అధికారులు సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశారు.
‘‘ఇది ఏదో సినిమాలోని సీన్ కాదు. నిజజీవితంలో హీరో అయిన ఎస్సై యాంటిలిన్ రమేష్ ఒక్కరే.. చోరీ చేసిన బైక్‌పై మొబైల్ ఫోన్లను దొంగిలించే దుండగులను వెంటాడి మరీ పట్టుకున్నారు.’’ అనే వ్యాఖ్యను కమిషనర్ దీనికి జతచేశారు. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు నెంబర్ ప్లేట్ లేకుండా, ఫ్యుయల్ టాంక్ మూత తెరిచి ఉన్న ద్విచక్ర వాహనాన్ని నడపటాన్ని ఎస్సై రమేశ్ గమనించారు. అది దొంగిలించిందనే నిర్ధారణకు వచ్చిన ఆయన.. వారిని వెంటాడి అదుపులోకి తీసుకున్నారు. కాగా, అరెస్టు చేసిన వారిలో ఒకరు పేరుమోసిన నేరస్తుల ముఠా సభ్యుడని తేలినట్టు ఉన్నతాధికారులు వెల్లడించారు.
సమయ స్ఫూర్తి, ధైర్య సాహసాలను ప్రదర్శించిన రమేశ్ కుమార్‌ను నగర పోలీస్ కమిషనర్ ప్రశంసా పత్రం, మెడల్ బహూకరించి సత్కరించారు. మరి ఎస్సై యాంటిలిన్ రమేష్ ధైర్యసాహసాలను ఈ వీడియోలో మీరూ చూసేయండి!