close

తాజా వార్తలు

Published : 18/09/2020 17:12 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

వ్యవసాయ బిల్లుపై రాజకీయ రగడ

అయోమయంలో పడిన జేజేపీ

చండీఘర్: కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన వ్యవసాయ రంగ బిల్లుపై వివాదం చెలరేగుతోంది. బిల్లును వ్యతిరేకిస్తూ కేంద్ర మంత్రి హర్‌‌సిమ్రత్‌ కౌర్‌ బాదల్‌ రాజీనామా చేసిన నేపథ్యంలో... ప్రతిపక్షాలు దీనిని ఆయుధంగా వాడుకుంటున్నాయి. తాజాగా ఈ బిల్లు సెగ పంజాబ్‌తోపాటు వ్యవసాయ ఆధారిత రాష్ట్రం హరియాణాకు కూడా సోకింది. అక్కడ భాజపాతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన జన్నాయక్‌ జనతా పార్టీ (జేజీపీ)పై ప్రతిపక్ష కాంగ్రెస్‌ విమర్శనాస్త్రాలు సంధిస్తోంది. బిల్లును వ్యతిరేకిస్తూ హర్‌సిమ్రత్‌ కేంద్ర మంత్రి పదవికే రాజీనామా చేసినప్పుడు జేజీపీ అధ్యక్షుడు దుష్యంత్‌ చౌటాలా డిప్యూటీ సీఎం పదవికి రాజీనామా చేయలేరా? అని కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి రణ్‌దీప్‌ సింగ్‌ సూర్జేవాలా ప్రశ్నించారు. ‘‘దుష్యంత్‌ జీ.. హర్‌సిమ్రత్‌ కౌర్‌ను ఆదర్శంగా తీసుకొని మీరు డిప్యూటీ సీఎం పదవికి రాజీనామా చేయాలి. రైతుల కంటే కుర్చీకే మీరు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు’’ అంటూ ఘాటుగా ట్వీట్‌ చేశారు. ఈ నేపథ్యంలో భాజపాతో కలిసి అడుగులేయాలా? లేదా చిరకాల మిత్రపార్టీ అకాలీదళ్‌కు మద్దతివ్వాలన్నదానిపై జేజేపీ ఎటూ తేల్చుకోలేని పరిస్థితి ఏర్పడింది.

పార్లమెంట్‌లో ప్రాతినిధ్యం లేనప్పటికీ భాజపాకు మిత్రపక్షమైన జేజేపీ కూడా అకాలీదళ్‌తోపాటు వ్యవసాయ రంగ బిల్లును వ్యతిరేకిస్తోంది. అయితే ఈ విషయాన్ని అధికారింగా ప్రకటించలేదు. రాష్ట్రాలు వేరైనా అకాలీదళ్‌కు, జేజేపీకి సత్సబంధాలు ఉన్నాయి. పార్లమెంట్‌లో సుఖ్‌బీర్‌ సింగ్‌ బాదల్‌ బిల్లును వ్యతిరేకిస్తూ మాట్లాడినప్పుడు కూడా దుష్యంత్‌ చౌటాలా తాత దివంగత దేవీ లాల్‌ పేరును ప్రస్తావించారు. ఆయనను రైతు పక్షపాతిగా అభివర్ణించారు. గతంలో హరియాణాలో భాజపా, జేజేపీ మధ్య సంబంధాలు ఏర్పరచడానికి సుఖ్‌బీర్‌ కృషి చేశారు. దీనిని బట్టి ఇరుపార్టీల మధ్య స్నేహాన్ని అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుత పరిస్థితుల్లో జేజేపీ ఏదో ఒక వైపు కొమ్ముకాయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే గతంలో వ్యవసాయ బిల్లులకు సంబంధించిన ఆర్డినెన్స్‌లకు జేజేపీ మద్దతు తెలిపింది. బిల్లులో కొన్ని లోపాలు ఉన్నాయని అందుకే తాజాగా వ్యతిరేకించామని ప్రతిపక్షాల విమర్శలకు సమాధానం చెప్పుకునే అవకాశముంది.

పార్టీ నుంచి వ్యతిరేకత

గత సెప్టెంబర్‌ 10న కురుక్షేత్రలో రైతులపై జరిగిన లాఠీచార్జీ కూడా జేజేపీకి కొత్త తలనొప్పులు తెచ్చిపెట్టింది. చాలా మంది రైతులు తీవ్రంగా గాయపడ్డారు. దీనిని ప్రతిపక్ష కాంగ్రెస్‌ సొమ్ము చేసుకోవాలని చూస్తోంది. ప్రజల గొంతును నొక్కేశారంటూ విమర్శనాస్త్రాలు సంధిస్తోంది.అయితే, ర్యాలీ నిర్వహించుకోవడానికి మొదట్లో అనుమతులు లేవని, అందువల్ల పోలీసులు అడ్డుకున్నారని, తర్వాత అధికారులు అనుమతించారని జేజేపీ వివరణ ఇచ్చే ప్రయత్నం చేసింది. కానీ, దీనిని ఎవరూ నమ్మినట్లు కనిపించలేదు. మరోవైపు దుష్యంత్‌ చౌటాలకు సొంత పార్టీ నుంచే వ్యతిరేకత ఏర్పడుతోంది. పార్టీ ఎమ్మెల్యేలే ఆయన నాయకత్వంపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మొత్తం 90 సీట్లకుగాను 10 స్థానాల్లో జేజేపీ ప్రాతినిధ్యం వహిస్తోంది. వీరంతా పార్టీకి వ్యతిరేకంగా ఉన్నారని, నాయకత్వ మార్పిడి కోసం డిమాండ్‌ చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఎటువైపు వెళ్దాం?

కురుక్షేత్రలో రైతులపై లాఠీ ఛార్జీ రాజకీయంగా పార్టీని అప్రతిష్ఠపాలు చేస్తుండటంతో.. జేజేపీ నష్ట నివారణ చర్యలను చేపట్టింది. రైతులందరికీ క్షమాపణ చెబుతున్నట్లు ప్రకటన విడుదల చేసింది. ‘‘లాఠీఛార్జీ జరగడాన్ని జేజేపీ తీవ్రంగా పరిగణించింది. రైతులందరికీ క్షమాపణలు చెబుతోంది. పార్టీ ఎల్లప్పుడూ రైతులతోనే ఉంటుంది. రైతులే పార్టీకి సుప్రీం’’ అని దుష్యంత్‌ చౌటాలా సోదరుడు దిగ్విజయ్‌ చౌటాలా పార్టీ తరఫున ప్రకటన విడుదల చేశారు. ఓ వైపు పార్టీలో అంతర్గత అసహనం రేగుతోంది, మరోవైపు చిరకాల మిత్రపక్షమైన అకాలీదళ్‌ భాజపాకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటోంది. ఈ నేపథ్యంలో జేజేపీ ఎటు మొగ్గు చూపుతుందన్నదానిపై ఆసక్తి నెలకొంది.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.