
తాజా వార్తలు
గుండె జబ్బు ఉంది.. టర్మ్ పాలసీ ఇస్తారా?
1. నా వయసు 43 ఏళ్లు. ఇటీవలే గుండెకు శస్త్రచికిత్స జరిగింది. ఇప్పటి వరకూ జీవిత బీమా పాలసీని తీసుకోలేదు. ఇప్పుడు టర్మ్ పాలసీ తీసుకోవాలంటే సాధ్యమవుతుందా? రూ.50లక్షల పాలసీకి ఎంత ప్రీమియం చెల్లించాల్సి వస్తుంది?
- మహేందర్ రెడ్డి
* మనం ఆరోగ్యంగా ఉన్నప్పుడే జీవిత, ఆరోగ్య బీమా పాలసీలను తీసుకోవడం మంచిది. మీకు ఇటీవలే శస్త్రచికిత్స జరిగింది కాబట్టి, కొంతకాలం వేచి ఉండే సమయం ఉంటుంది. సాధారణంగా ఇది ఏడాదిపాటు ఉంటుంది. ఈ లోపు మీరు పాలసీ తీసుకునేందుకు దరఖాస్తు చేసినా.. దాన్ని తిరస్కరించే అవకాశం ఎక్కువ. కాబట్టి, కొన్నాళ్లు ఆగి, టర్మ్ పాలసీకి దరఖాస్తు చేయండి. పాలసీ తీసుకునే ముందు మీ ఆరోగ్య వివరాలన్నీ వెల్లడించండి. ఆరోగ్య పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంది. పాలసీని ఇచ్చినా కొన్నిసార్లు ప్రీమియంపై లోడింగ్ ఉండే అవకాశం ఉంది. సాధారణ వ్యక్తులకు రూ.50లక్షల పాలసీ, 20 ఏళ్ల వ్యవధికి ఆన్లైన్లో తీసుకుంటే.. రూ.8వేల నుంచి రూ.12 వేల మధ్యలో ప్రీమియం ఉంటుంది. మీకు కాస్త అధిక ప్రీమియం వర్తించే అవకాశం ఉంది.
2. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం నుంచి పదవీ విరమణ పొందాను. ప్రస్తుతం నా వయసు 62 ఏళ్లు. పింఛను వస్తోంది. నా దగ్గరున్న కొంత మొత్తాన్ని ప్రధానమంత్రి వయ వందన యోజనలో మదుపు చేయాలనుకుంటున్నాను. ఇది మంచి పథకమేనా?
- సంజీవ
* మీరు ప్రధాన మంత్రి వయ వందన యోజనలో నిరభ్యంతరంగా పెట్టుబడి పెట్టవచ్చు. ప్రస్తుతం ఇందులో 7.4శాతం వడ్డీ రేటు ఉంది. ఇది ఏటా మారే అవకాశం ఉంది. కనీసం 10 ఏళ్ల వరకూ కొనసాగవచ్చు. వచ్చిన వడ్డీని మీ మొత్తం ఆదాయంతో కలిపి చూపించి, వర్తించే శ్లాబు ప్రకారం పన్ను చెల్లించాలి. మూడేళ్ల తర్వాత పెట్టిన పెట్టుబడిలో 75 శాతం వరకూ రుణం తీసుకోవచ్చు. అత్యవసర పరిస్థితుల్లో మొత్తం పెట్టుబడిని ఉపసంహరించుకోవచ్చు. కానీ, 2 శాతం అపరాధ రుసుముగా మినహాయించుకుంటారు. బ్యాంకు ఫిక్స్డ్ డిపాజిట్లతో పోలిస్తే.. ఇది కాస్త మంచి మార్గమే. ఒకవేళ 5 ఏళ్లకు మదుపు చేయాలనుకుంటే.. సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీంను పరిశీలించవచ్చు.
3. ఆదాయపు పన్ను మినహాయింపు కోసం ఈక్విటీ ఆధారిత పొదుపు పథకాల్లో మదుపు చేయాలనుకుంటున్నాను. రూ.1,50,000 ఇందులో పెట్టుబడి పెట్టడం మంచిదేనా? లేకపోతే వేర్వేరు పథకాలను ఎంచుకోవాలా?
- హరిత
* ఆదాయపు పన్ను మినహాయింపు గురించి వేర్వేరు పథకాలు అందుబాటులో ఉన్నాయి. ఇందులో గృహరుణం అసలు, జీవిత బీమా పాలసీల ప్రీమియం, పోస్టాఫీసులో ఎన్ఎస్సీ, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, ట్యాక్స్ సేవింగ్ ఫిక్స్డ్ డిపాజిట్లు, ఈక్విటీ ఆధారిత పొదుపు పథకాలు.. (ఈఎల్ఎస్ఎస్)లు అందుబాటులో ఉన్నాయి. మీరు పెట్టాలనుకుంటున్న మొత్తంలో రూ.75 వేలను ఈఎల్ఎస్ఎస్లకు కేటాయించండి. ఇందులో మూడేళ్ల లాకిన్ పీరియడ్ ఉంటుంది. మిగతా మొత్తాన్ని పీపీఎఫ్కు మళ్లించండి. దీనిలో పెట్టుబడిని కనీసం 15 ఏళ్లపాటు కొనసాగించాలి.
4. నేను గత మూడేళ్లుగా నెలకు రూ.5వేల చొప్పున బ్యాంకులో రికరింగ్ డిపాజిట్ చేస్తున్నాను. ఇప్పుడు దీన్ని ఆపేసి, డెట్ ఫండ్లలో సిప్ చేస్తే మంచిదేనా? నష్టభయం తక్కువగా ఉండాలి. మరో 4 ఏళ్ల వరకూ పెట్టుబడి పెట్టగలను. కాస్త అధిక రాబడి వచ్చే మార్గాన్ని సూచించండి?
- రవి కుమార్
* ప్రస్తుతం మన దేశంలో వడ్డీ రేట్లు గణనీయంగా తగ్గాయి. దీని ప్రభావం ఫిక్స్డ్ డిపాజిట్లు, రికరింగ్ డిపాజిట్లు, డెట్ మ్యూచువల్ ఫండ్లు, బాండ్లు, ఇతర డెట్ ఫథకాలన్నింటిపైనా పడింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మీకు ఆర్డీకన్నా డెట్ మ్యూచువల్ ఫండ్లలో అర శాతం నుంచి 1శాతం వరకూ వడ్డీ అధికంగా రావచ్చు. కానీ, ఆర్డీతో పోలిస్తే డెట్ ఫండ్లలో నష్టభయం ఉంటుంది. కాబట్టి, మీరు రికరింగ్ డిపాజిట్లోనే పెట్టుబడిని కొనసాగించండి. ప్రత్యామ్నాయంగా రూ.3 వేలను ఆర్డీలో కొనసాగిస్తూ.. రూ.2 వేలను బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్లలో మదుపు చేసుకోవచ్చు.
5. నేను ప్రైవేటు ఉద్యోగిని. వయసు 48 ఏళ్లు. ఈపీఎఫ్ ఉంది. దీంతోపాటు నెలకు రూ.8వేలను ఎన్పీఎస్లో పెట్టుబడి పెట్టాలనుకుంటున్నాను. దీనికన్నా వీపీఎఫ్ మేలంటున్నారు? ఈ రెండింటిలో ఏది ఎంచుకోవాలి?
- శ్రీధర్
* ఈపీఎఫ్, వీపీఎఫ్ రెండూ ఒకటే. వీటిలో 2019-20 ఆర్థిక సంవత్సరానికి 8.5శాతం వడ్డీ చెల్లించారు. ఇతర అన్ని సురక్షిత పథకాలతో పోలిస్తే.. ఇదే గరిష్ఠ వడ్డీని అందిస్తోంది. ఇది పూర్తిగా సురక్షితమైన పథకం. మీ పెట్టుబడి సురక్షతంగా ఉండాలనుకుంటే.. వీపీఎఫ్లోనే మదుపు చేయండి. కాస్త అధిక రాబడి రావాలనుకుంటే ఎన్పీఎస్ను ఎంచుకోవచ్చు. దీన్ని ఎంచుకున్నప్పుడు అధిక శాతం ఈక్విటీ పెట్టుబడులు ఉండేలా చూసుకోండి. ఫండ్ సంస్థల పనితీరునూ బేరీజు వేసుకోండి. అయితే, కాస్త నష్టభయం ఉంటుందన్న సంగతి మర్చిపోవద్దు.
6. మూడేళ్లలో సొంత ఇల్లు కొనాలన్నది ఆలోచన. దీనికోసం గృహరుణం తీసుకోవాలనుకుంటున్నాం. అప్పటి వరకూ నెలకు రూ.30వేల వరకూ ఏదైనా అధిక రాబడినిచ్చే పథకాల్లో మదుపు చేయాలని అనుకుంటున్నాం. పెట్టుబడికి నష్టం రాకుండా ఉండాలంటే ఏ పథకాలను ఎంచుకోవాలి?
- చంద్రశేఖర్
* మీరు పెట్టుబడి పెట్టాలనుకుంటున్న సమయం మూడేళ్లే కాబట్టి, మీ పెట్టుబడికి నష్టం లేకుండా చూసుకోవాలి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో డబ్బు సురక్షితంగా ఉంటూ.. అధిక రాబడి రావాలంటే కుదరదు. మీరు పెట్టాలనుకుంటున్న డబ్బును బ్యాంకు రికరింగ్ డిపాజిట్లోగానీ, మంచి క్రెడిట్ క్వాలిటీ ఉన్న షార్ట్ టర్మ్ ఫండ్లలో పెట్టుబడి పెట్టుకోవచ్చు. డెట్ మ్యూచువల్ ఫండ్లలో కాస్త నష్టభయం ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉన్న వడ్డీ రేట్ల ప్రకారం 5-6శాతం వరకూ రాబడిని ఆశించవచ్చు.
- తుమ్మ బాల్రాజ్