
తాజా వార్తలు
రాహుల్ గాంధీలో స్థిరత్వం తక్కువే: శరద్ పవార్
కాంగ్రెస్ నేతపై ఒబామా వ్యాఖ్యలను తప్పుబట్టిన ఎన్సీపీ అధ్యక్షుడు
దిల్లీ: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని ఈ దేశం నాయకుడిగా అంగీకరించేందుకు కావాల్సినంత స్థిరత్వం ఆయనలో కనిపించడం లేదని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ అన్నారు. మహారాష్ట్రకు చెందిన ఓ మీడియా సంస్థ నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. రాహుల్‌పై అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా చేసిన వ్యాఖ్యలను ఖండించారు. మహారాష్ట్రలో సంకీర్ణ ప్రభుత్వాన్ని నడపడంలో పవార్ కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే.
కాగా, భారత్ రాహుల్ గాంధీని నాయకుడిగా అంగీకరించేందుకు సిద్ధంగా ఉందా? అని ఈ కార్యక్రమంలో శరద్ పవార్‌ను ప్రశ్నించగా..‘ఈ విషయం కాస్త ప్రశ్నార్థకంగానే ఉంది. ఆయనలో తక్కువ స్థిరత్వం ఉన్నట్లు కనిపిస్తోంది’ అని అభిప్రాయపడ్డారు. తన ఉపాధ్యాయుడిని మెప్పించాలనే ఆతృతతో ఉన్న విద్యార్థిలా రాహుల్ కనిపించాడే తప్ప నేర్చుకోవాలనే తపన కనిపించలేదంటూ ఇటీవల ఒబామా తన పుస్తకంలో రాహుల్‌పై చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా పవార్ తప్పుపట్టారు. ‘మన దేశంలోని నాయకుల గురించి నేను ఏదైనా మాట్లాడగలను. ఇతర దేశాల నాయకత్వం గురించి నేను మాట్లాడను. మనం ఆ పరిమితిని గుర్తించాలి. ఒబామా దాన్ని పాటించలేదని నేను భావిస్తున్నాను’ అని ఆయన అన్నారు. ఇంతకుముందు శివసేన కూడా ఒబామా తీరుపై మండిపడింది.
అలాగే, కాంగ్రెస్ భవితవ్యం, రాహుల్ కాంగ్రెస్ పార్టీకి అడ్డంకి అవుతున్నారా? అనే విషయాలపై ప్రశ్నించగా..పార్టీలో ఉన్న మద్దతు ప్రకారమే నాయకత్వం ఎంపిక ఆధారపడి ఉంటుందన్నారు. ఇప్పటికీ కాంగ్రెస్ కార్యకర్తలకు గాంధీ, నెహ్రూ కుటుంబంపై అభిమానం ఉందన్నారు. ఇదిలా ఉండగా..2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పరాజయాన్ని చవిచూడటంతో ఓటమికి బాధ్యత వహిస్తూ రాహుల్ గాంధీ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి సోనియాగాంధీనే పార్టీ బాధ్యతలను నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాభవాన్ని మూటగట్టుకోవడంతో అసమ్మతి గళం గట్టిగానే వినిపించింది. వరస ఓటములను ఎత్తి చూపుతూ విమర్శకులు పార్టీ ఉనికినే ప్రశ్నిస్తుండటం గమనార్హం.