close

తాజా వార్తలు

Updated : 30/11/2020 06:55 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

అందరి చూపు.. తలైవా వైపు

మళ్లీ మొదలైన రజనీ రాజకీయ అరంగేట్రం చర్చ
నేడు ఆర్‌ఎంఎం నిర్వాహకులతో సమావేశం

చెన్నై, న్యూస్‌టుడే: శాసనసభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఆర్‌ఎంఎం(రజనీ మక్కళ్‌ మండ్రం) నిర్వాహకులతో రజనీకాంత్‌ సోమవారం సమావేశంకానున్నారు. రాజకీయ అరంగేట్రం గురించి చర్చించడానికే ఈ సమావేశం ఏర్పాటు చేశారనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. శాసనసభ ఎన్నికలకు సన్నాహాలు మొదలుపెట్టిన అధికార, ప్రతిపక్షాలు ఈ సమావేశంపై దృష్టి పెట్టాయి. దీంతో సరికొత్త అంచనాలు, విశ్లేషణలు మళ్లీ తెరపైకి వచ్చాయి. రజనీకాంత్‌ రాజకీయ ప్రవేశం వ్యవహారం సుమారు పాతికేళ్లుగా నలుగుతున్న విషయం తెలిసిందే. ఆయన రాజకీయాల్లోకి వస్తారా? లేదా? అనే విషయమై 1996వ ఏడాది నుంచి చర్చ జరుగుతుండగా.. మూడేళ్ల క్రితం రజనీ ఆ ఉత్కంఠకు తెర దించారు. రాజకీయాల్లోకి వస్తానంటూ ప్రకటించారు. అయినా ఇప్పటివరకు పార్టీ ప్రారంభించలేదు. క్రియాశీలక రాజకీయాలకు కూడా దూరంగానే ఉన్నారు. దీంతో ఆయన రాజకీయ అరంగేట్రం రాష్ట్ర రాజకీయాల్లో చర్చలకే పరిమితమైంది. అదే సమయంలో మక్కళ్‌ మండ్రం బలోపేతానికి రజనీకాంత్‌ చర్యలు చేపట్టారు. జిల్లాలవారీగా నిర్వాహకులతో తరచూ సమావేశాలు, ఆన్‌లైన్‌ ద్వారా సభ్యత్వ నమోదు తదితర కార్యక్రమాలు నిర్వహించారు. రాజకీయ పార్టీ ప్రారంభానికి బలమైన పునాదులు వేస్తున్నారనే విశ్లేషణలు వినిపించాయి. రజనీ రాజకీయ అరంగేట్రం ప్రకటన తర్వాత.. ప్రముఖ నటుడు కమల్‌హాసన్‌ మక్కళ్‌ నీది మయ్యం పార్టీని ప్రారంభించడం, లోక్‌సభ ఎన్నికల్లో అభ్యర్థులను బరిలోకి దించి ప్రధాన పార్టీలకు దీటైన పోటీని ఇవ్వడం కూడా జరిగిపోయాయి. రజనీకాంత్‌ మాత్రం 2021 శాసనసభ ఎన్నికలే తమ లక్ష్యమని వెల్లడించారు. ప్రస్తుతం శాసనసభకు ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో అందరి దృష్టి రజనీకాంత్‌పై నిలిచింది. ఆయన ప్రతి కదలికను రాజకీయ పార్టీలు నిశితంగా పరిశీలిస్తున్నాయి.
అనూహ్యంగా సమావేశానికి పిలుపు
రజనీ రాజకీయ ప్రవేశంపై ఇప్పటికే పలుమార్లు ప్రచారం జరిగింది. ప్రస్తుతం ఆయన పుట్టినరోజునాడు డిసెంబరు 12న ప్రకటన వెలువడొచ్చనే ప్రచారం ఊపందుకుంది. అంతలో మక్కళ్‌ మండ్రం జిల్లా కార్యదర్శులతో సోమవారం సమావేశానికి ఏర్పాట్లు చేయడంతో మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. మక్కళ్‌ మండ్రం జిల్లా కార్యదర్శులతో చర్చించిన తర్వాత కొన్ని నిర్ణయాలు ఖరారు చేస్తారని, వాటినే బహిరంగంగా ప్రకటిస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. 2021 శాసనసభ ఎన్నికలు గురించి కూడా కీలక అంశాలను చర్చిస్తారనే అభిప్రాయాలు ఉన్నాయి. సమావేశంలో పాల్గొనాలని మాత్రమే తమకు వర్తమానం అందిందని, ఇతర వివరాలేవీ తెలియవని జిల్లాల కార్యదర్శులు కొందరు వెల్లడించారు. ప్రస్తుత సమావేశంలో ‘తలైవా’ అంతరంగం బయటపడే అవకాశం ఉందంటున్నారు. ‘రాజకీయ మార్పు, అధికార మార్పు ఇప్పుడు కాకుంటే ఇంకెప్పుడూ లేదు’ అంటూ గతంలో రజనీ వ్యాఖ్యానించడంతో రాబోయే శాసనసభ ఎన్నికల్లో ఆయన కచ్చితంగా పోటీ చేస్తారని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అందుకు ప్రస్తుత సమావేశం నాంది పలకవచ్చని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కరోనా ప్రభావ కాలంలోనూ ఇలా సమావేశం ఏర్పాటు చేశారంటే అది కచ్చితంగా ప్రాధాన్యం కలిగిందేనని, అది ఆయన రాజకీయ అరంగేట్రం గురించేనని కొందరు అభిప్రాయపడుతున్నారు. రాజకీయ ప్రవేశంపై రజనీకాంత్‌ సోమవారం నిర్ణయం తీసుకుంటారని ఆయన అభిమానులు భావిస్తున్నారు. దీంతో
#RajinikanthPoliticalEntry అనే హ్యాష్‌ట్యాగ్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.
ఆసక్తికర విశ్లేషణలు.. విమర్శలు
రాజకీయ అరంగేట్రం గురించి సమావేశంలో రజనీకాంత్‌ మాట్లాడితే?.. తామెలా స్పందించాలనే విషయంపై రాజకీయపార్టీలు ఆలోచిస్తున్నాయి. తిరుచ్చి ఎంపీ తిరునావుక్కరసర్‌ వంటి పలువురు కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు రజనీకి సన్నిహితులు కావడంతో ఆయన్ను ప్రసన్నం చేసుకోవాలని యత్నిస్తున్నట్లు సమాచారం. ఇటీవల చెన్నై వచ్చిన సందర్భంగా రజనీకాంత్‌కు కేంద్ర మంత్రి అమిత్‌షా రాయబారం పంపారని, తర్వాతే ప్రస్తుత సమావేశం జరుగుతుందనే వార్తలూ వినిపిస్తున్నాయి. దీంతో భాజపా, రజనీకాంత్‌ రాజకీయ బంధం కోణంలోనూ ప్రచారం జరుగుతోంది. మరోవైపు రాజకీయ అరంగేట్రం గురించి రజనీ నుంచి ఎలాంటి ప్రకటన ఉండబోదనే విమర్శలూ ఉన్నాయి. రాజకీయాల్లోకి వస్తున్నట్టు 2017 డిసెంబరు 31న ప్రకటించిన తర్వాత ఆ విషయంలో ఎలాంటి పురోగతి లేదని, ఇకపై కూడా ఇంతేనని నెటిజన్లు విమర్శిస్తున్నారు.


Tags :

రాజకీయం

జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని