
తాజా వార్తలు
రషీద్‌ఖాన్.. నీ బ్యాలెన్స్‌కు సలాం..!
ఇంటర్నెట్‌డెస్క్: అఫ్గానిస్థాన్ స్పిన్నర్ రషీద్‌ఖాన్ తాజాగా పట్టిన ఓ క్యాచ్ క్రికెట్ ప్రేమికుల్ని ఔరా అనిపించింది. బౌండరీ లైన్ వద్ద అతడు ప్రదర్శించిన బ్యాలెన్సింగ్ తీరు ఆటపై తనకున్న అంకిత భావాన్ని తెలియజేసింది. ఓ బ్యాట్స్‌మన్ ఆడిన బంతి సిక్సర్‌గా మారే క్రమంలో అతడు అద్భుతమైన రీతిలో క్యాచ్ అందుకున్నాడు. అది కూడా వెనక్కి పరుగెడుతూ క్యాచ్ పట్టడంతో తన శరీరం అదుపు తప్పింది. అలాంటి స్థితిలో ఒక్క కాలితోనే బౌండరీ లైన్‌కు ఇంచ్ దూరంలో పలుమార్లు పట్టు కోల్పోయాడు. అయినా చివరికి బంతిని గాల్లోకి వదిలేసి బౌండరీ దాటి మళ్లీ తిరిగొచ్చి దాన్ని ఒడిసిపట్టాడు. ఇది చూసిన నెటిజన్లు రషీద్‌ఖాన్ ఫీల్డింగ్‌ను మెచ్చుకుంటున్నారు. ఈ వీడియో ప్రస్తుతం ఆన్లైన్లో చక్కర్లు కొడుతుండగా.. ఆ విశేషాలేంటో తెలుసుకుందాం.
ప్రస్తుతం ఆస్ట్రేలియాలో ప్రతిష్ఠాత్మక బిగ్‌బాష్ లీగ్ జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆదివారం అడిలైడ్ స్ట్రైకర్స్, హోబార్ట్ హరీకేన్స్ తలపడ్డాయి. అడిలైడ్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న రషీద్.. హోబార్ట్ టీమ్ తొలి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేస్తుండగా 16వ ఓవర్లో లాంగ్‌ఆన్‌లో ఫీల్డింగ్ చేస్తున్నాడు. అదే సమయంలో హోబార్ట్ బ్యాట్స్‌మన్ ఇన్‌గ్రామ్(25) పరుగుల వద్ద బ్యాటింగ్ చేస్తుండగా ఐదో బంతికి భారీ షాట్ ఆడాడు. అది లాంగ్ఆన్ దిశగా సిక్సర్ వెళ్లే క్రమంలో రషీద్ బౌండరీ వద్ద అద్భుత క్యాచ్ అందుకున్నాడు. రెప్పపాటులో బంతి బౌండరీ దాటుతుందనుకునే వేళ వెనక్కి పరుగెడుతూ క్యాచ్ పట్టాడు. అయితే, అప్పటికే అతడి శరీరం అదుపు తప్పడంతో బౌండరీకి ఇంచ్ దూరంలో పలుమార్లు బ్యాలెన్స్ తప్పాడు. అయినా, బంతిని అలాగే పట్టుకొని ఉన్నాడు. చివరికి శరీరం పూర్తిగా అదుపుతప్పడంతో బంతిని గాల్లోకి వదిలి బౌండరీ దాటి మళ్లీ వచ్చి బంతిని అందుకున్నాడు. దీంతో ఇన్‌గ్రామ్ ఔటయ్యాడు. ఆ వీడియోను క్రికెట్.కామ్.ఏయూ అనే ఆస్ట్రేలియా క్రికెట్ వెబ్సైట్ ట్విటర్లో పోస్టు చేసింది. అదిప్పుడు నెటిజన్లను ఆకట్టుకుంటోంది.
ఇక ఈ మ్యాచ్‌లో ఫీల్డింగ్‌తో శభాష్ అనిపించుకున్న రషీద్ తర్వాత బౌలింగ్, బ్యాటింగ్ విభాగాల్లో విఫలమయ్యాడు. హోబార్ట్ తొలుత 174/5 స్కోర్ చేయగా, ఛేదనలో అడిలైడ్ 163/9కు పరిమితమైంది. దీంతో రషీద్ టీమ్ 11 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.
ఇవీ చదవండి..