close

తాజా వార్తలు

Published : 27/11/2020 01:05 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఆయన మరణంతో కన్నీరు పెట్టిన రతన్‌ టాటా!

ఉగ్రదాడిపై ఉద్వేగంగా స్పందించిన టాటా

 

ముంబయి: దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో వరస బాంబు పేలుళ్లు జరిగి నేటికి 12 ఏళ్లు. ఆనాటి మారణహోమాన్ని గుర్తు చేసుకుంటూ టాటా సన్స్ గౌరవ ఛైర్మన్ రతన్‌ టాటా ఇన్‌స్టాగ్రాం వేదికగా ఉద్వేగంతో స్పందించారు. ఆ విధ్వంసాన్ని ఎన్నటికీ మర్చిపోలేమని, ముంబయి వాసుల ఐక్యతను కొనియాడారు.  

‘12 ఏళ్ల క్రితం జరిగిన ఆ విధ్వంసాన్ని ఎన్నిటికీ మర్చిపోలేము. అయితే, విభిన్న వర్గాలకు చెందిన ముంబయి ప్రజలు విభేదాలను పక్కనపెట్టి ఈ మారణహోమాన్ని అధిగమించడానికి ఒకచోట చేరడం చిరస్మరణీయం. మనం కోల్పోయిన వారి కోసం దుఃఖించగలం, శత్రువును జయించేందుకు ధైర్యసాహసాలతో పోరాడిన వారి త్యాగాలను గుర్తు చేసుకోగలం. కానీ వాటన్నింటికంటే..ఐక్యత, దయ, సున్నితత్వంతో కూడిన తీరును ఆదరించాలి. ఇది రాబోయే రోజుల్లో కూడా ప్రకాశిస్తూనే ఉంటుంది’ అంటూ తాజ్‌ హోటల్ పెయింట్‌ను షేర్ చేశారు. దానిపై ‘మాకు గుర్తుంది’ అని రాసుకొచ్చారు.

ఉగ్రదాడి అనంతరం రతన్ టాటా స్పందన..

 నవంబర్ 26న ఉగ్రదాడి అనంతరం డిసెంబర్ 21న తాజ్‌ హోటల్‌ను తిరిగి ప్రారంభించిన తరవాత రతన్‌టాటా అక్కడ పనిచేసే ప్రతి ఒక్కరితో సమావేశమయ్యారు. సిబ్బంది ధైర్యసాహసాలను కొనియాడటంతో పాటు, వారి సేవా దృక్పథంపై ప్రశంసలు కురిపించారు. అయితే ఈ దాడి సమయంలో 54 మంది అతిథులను రక్షించిన కెప్టెన్‌ థామస్ జార్జి చివరి నిమిషంలో నేలకొరగడంతో చలించిన టాటా భోరున ఏడ్చారట. థామస్ భార్య పిల్లలకు ఏమిచ్చి రుణం తీర్చుకోగలనని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారట. అలాగే ఈ విధ్వంసంలో విగతజీవులుగా మారిన ఉద్యోగులు చివరిసారి అందుకున్న జీతాన్ని వారి కుటుంబ సభ్యులకు జీవితాంతం ఇవ్వడానికి నిర్ణయం తీసుకోవడం ఆయన ఉదారస్వభావానికి నిదర్శనంగా నిలిచింది. ప్రాణాలు కోల్పోయిన వారి అంత్యక్రియలకు మూడు రోజుల పాటు తన సీనియర్‌ మేనేజర్లతో సహా ఆయన కూడా హాజరవడం సిబ్బందికి ఇచ్చే విలువను వెల్లడిచేసింది. అలాగే, దాడిలో ధ్వంసమై హోటల్‌ మూతపడగా..సిబ్బందికి మనీ ఆర్డర్ ద్వారా ప్రతి నెల జీతాలు అందించారు... అయితే, ఆ మారణహోమం తరవాత రతన్‌ టాటా చూపిన మానవతకు ఇవి మచ్చుతునకలు మాత్రమే.Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

చిత్ర వార్తలు

సినిమా
మరిన్ని

దేవతార్చన