close

తాజా వార్తలు

Updated : 01/08/2020 16:18 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

దేశానికి ఏమైందని అనిపించింది..!

ఆ వీడియో చూసి చలించిపోయా
వారంలో యాప్‌ వస్తుంది
ఇంటర్వ్యూలో రియల్‌ హీరో సోనూ సూద్‌

ఇంటర్నెట్‌ డెస్క్‌: సమస్యలు ఉంటే ఆయన నేనున్నాను అంటారు. సాటివారి కష్టాలను చూసి వెంటనే స్పందిస్తారు. లాక్‌డౌన్‌ సమయంలో వలస కార్మికుల వెతలను చూసి చలించిపోయారు. సొంతూళ్లకు వెళ్లేందుకు వారికి దారిచూపి పెద్దన్నగా నిలిచారు. తాజాగా చిత్తూరు జిల్లా రైతు ఇంటికి ట్రాక్టర్‌ పంపి తన సేవా హృదయానికి  హద్దులు లేవంటూ అందరినీ ఆశ్చర్యపరిచారు. అందుకే తన సేవా తత్పరత, ఉదార స్వభావంతో అందరినీ ఆలోచింపజేస్తున్న సినీ విలన్‌, రియల్‌ హీరో సోనూసూద్‌ అంతరంగాన్ని ‘ఈటీవీ భారత్’‌ తెరచి చూసే ప్రయత్నం చేసింది. సోనూసూద్‌ సేవకు స్ఫూర్తి ఎవరు? చిత్తూరు రైతుకు ఆయన ట్రాక్టర్‌ పంపడానికి గల కారణాలేంటి? కరోనా కాలంలో ఆయనేం చేస్తున్నారు? సోనూ నటించే కొత్త సినిమాలేంటి? ఇలాంటి ఆసక్తికర విషయాలను సోనూ సూద్‌తో ఇంటర్వ్యూలో చూద్దాం!

బ్రజ్‌ మోహన్‌: మూడు, నాలుగు నెలలుగా పొలాల్లోకి వెళ్తున్నారు. రహదారులపై తిరుగుతున్నారు. ఎక్కడైనా వాలిపోతున్నారు. దీనివెనుక స్ఫూర్తి ఏంటి?

సోనూసూద్‌:  చాలా మంది వలస కార్మికులు దుర్భర పరిస్థితుల్లో ఉన్నారు. ఏదోవిధంగా వారికి సాయం అందించాలి.అలాంటి వారి ఇళ్లకు వెళ్లమని నా అంతరాత్మ చెప్పింది. అందుకే వెళ్లాను. ఎన్నో కుటుంబాల ఆశీర్వాదం నాకు ఉంది. తల్లిదండ్రులు చదివించే స్థోమత లేని వారికి కూడా అడిగితే చాలు.. సాయం చేస్తున్నాం. ఈ దిశలో సరైన పథంలో సాగుతున్నాం. ప్రజలకు సహకారం అందేలా కృషిచేస్తున్నాం. 

ప్రశ్న: ఒకరకంగా మీరు పేదల పాలిట మెస్సయ్యగా మారిపోయారు. ఫేస్‌బుక్‌, ట్విటర్‌లో తలుచుకున్నా గంటలోనే వారి సమక్షంలో వాలిపోతున్నారు?

సోనూ సూద్‌: ఆపదలో విన్నపం చేసుకున్నప్పుడు వారికి పరిష్కారం చూపడం అత్యవసరం. చాలా ఆపేక్షతో వారు సంప్రదిస్తారు. వస్తారు, సాయం చేస్తారనే విశ్వాసంతో ఉంటారు. అలాంటి వారిని చేరుకోవడానికి ప్రయత్నిస్తాను. కొందరిని కలవచ్చు. మరికొందరి వద్దకు వెళ్లడం సాధ్యంకాకపోవచ్చు. చాలా వరకు ఇళ్లకు వెళ్లి ఏయే సమస్యలు ఉన్నాయో పరిష్కరిస్తాను. భగవంతుడి ఆశీస్సులతో ఇలా ముందుకెళ్లగలుగుతున్నా. 

ప్రశ్న: మీరు పంజాబ్‌ నుంచి వచ్చారు. మీ నాన్న గారు అక్కడ సామూహిక ఉచిత భోజనశాల నిర్వహించారు. ప్రజలకు సేవ చేయాలనే తలంపులో పంజాబీలు ఉంటారు. తాము కష్టాల్లో ఉన్నా ప్రజలకు సేవ చేయాలన్నది వారి అభిమతం?

సోనూ సూద్‌: కచ్చితంగా.. మా నాన్న గారు బట్టల దుకాణం నడిపేవారు.అది ఇప్పటికీ ఊళ్లో ఉంది. ఆయన ఇప్పుడు లేరు. అనేకమందికి ఆయన ఉచిత భోజన వితరణ చేసేవారు. ఆపన్నులను ఆదుకోవాలని చిన్నతనంలో తల్లిదండ్రులు నేర్పారు. తల్లిదండ్రుల పెంపకమే నన్ను ఈ పనికి పురిగొల్పింది.

ప్రశ్న: ఏపీలో ఇద్దరు అమ్మాయిలు నాగలి లాగే పరిస్థితి చూశారు. ఇదంతా చూస్తే దేశంలో ఏం జరుగుతోందని అనిపిస్తోంది? మీరు ముందు ఎద్దులు ఇస్తామనీ.. తర్వాత ట్రాక్టరే ఇచ్చారు. దేశానికి ఎలాంటి సందేశం ఇవ్వాలన్నది మీ ఉద్దేశం?

సోనూ సూద్‌: నేను ఆ వీడియో చూసి చలించిపోయాను ఆలోచిస్తే బాధ కలిగింది. దేశానికి ఏమైందని అనిపించింది. దీని గురించే రాత్రి 10గంటలకు నాగేశ్వరరావుకు ఫోన్‌ చేశాను. చిత్తూరు జిల్లాలో మారుమూల ప్రాంతానికి చెందిన వ్యక్తిగా తెలిసింది. రేపటికల్లా మీ పొలానికి ట్రాక్టర్‌ వస్తుందని చెప్పాను. మీ బిడ్డలను ట్రాక్టర్‌పై కూర్చోబెట్టి తిప్పుతూ వ్యవసాయం చేయమన్నాను. ఊళ్లలో ఎవరికి అవసరం ఉన్నా ట్రాక్టర్‌ ఇవ్వమన్నాను. మనం ఆలోచించడం సులువు. రోజూ వీడియోలు చూస్తాం.. విచారిస్తాం. చర్చిస్తాం. తర్వాత జీవితంలో తీరికలేకుండా అయిపోతుంది. అవసరమైతే మన పనిని విడిచిపెట్టి ఇలాంటి పరిస్థితిని మార్చాలన్నదే బహుశా నా సందేశం.  

ప్రశ్న: వలస కార్మికుల ఉపాధి కోసం మీరు రూపొందించిన యాప్‌ ఏవిధంగా పని చేస్తుంది?

సోనూ సూద్‌: ఆ యాప్‌ రావడానికి ఇంకా ఒక వారం సమయం పడుతుంది. నంబర్‌కి ఫోన్‌ చేస్తే సహాయకులు మీతో మాట్లాడతారు. మీరు వడ్రంగా? ప్లంబరా? ఎలక్ట్రీషియనా? ఎలాంటి పని కావాలి? ఏ నగరంలో ఉంటారు? ఏ నగరానికి వెళ్లాలనుకుంటున్నారు? ఏ రకమైన ఉద్యోగం ఆశిస్తున్నారు వంటి వివరాలు తీసుకుంటారు.  ఎన్జీవోలు, కార్పొరేట్‌కంపెనీలు, సంస్థలతో కలిసి ఉపాధి కల్పిస్తాం. ముంబయిలో ఉన్న వ్యక్తికి పనిచేసేందుకు కార్మికులు అవసరమవుతారు.  వారిని వెతికి, వాళ్లకు పని కల్పిస్తాం. అలాంటి కార్మికుడు ఒడిశాలో ఉన్నా.. ఆంధ్రాలో ఉన్నా, తెలంగాణలో ఉన్నా.. అలాంటి వారికి నైపుణ్య శిక్షణ అందిస్తాం. ఉద్యోగులు, యజమానులు ఒకేవేదికపై యాప్‌లో అందుబాటులో ఉంటారు. నంబర్‌ డయల్‌ చేస్తే మీకు అవసరమైన పనివారు దొరుకుతారు.  

ప్రశ్న: ట్విటర్‌లో మీకు వ్యతిరేకంగా పనిచేసే సేన ఉంది. మీరు ఏమి పెట్టినా వాళ్లు వ్యతిరేకంగా రాస్తారు. మేం మంచి పని చేస్తుంటే మీరెందుకు చెడగొడుతున్నారని ఎప్పుడైనా అలాంటి వారితో మాట్లాడారా?

సోనూసూద్‌: నేను అవేమీ పట్టించుకోను. మనం రణక్షేత్రంలో ఉన్నప్పుడు తుపాకీ గుళ్లు ఎటువైపు నుంచి వస్తాయో అని ఆలోచించకూడదు. వాటిని కాచుకొని యుద్ధంలో గెలవాలి. మనం ఒక పనిచేసేటప్పుడు రాళ్లు విసిరేవాళ్లు ఎప్పుడూ ఉంటారని చరిత్రలో చూస్తూనే ఉన్నాం. ఈర్శ్య పడేవాళ్లు పెరుగుతుంటే మీరు బాగా పనిచేస్తున్నట్టు. అసూయపరులే కనిపించకపోతే మీరు ఏ పనీ చేయనట్టు. నేను ఇది నమ్మి ముందుకెళ్తాను.

ప్రశ్న: ఈ లాక్‌డౌన్‌ పరిస్థితుల్లో ఏ విధమైన సినిమాలు వస్తున్నాయి. ఏయే సినిమాలు చేస్తున్నారు? లాక్‌డౌన్‌ కార్యకలాపాలు స్తంభించాయి కదా..?

సోనూసూద్‌:  సినిమా చిత్రీకరణలు జరగడంలేదు. యాడ్‌ షూటింగ్‌లు జరుగుతున్నాయి. సినిమా ప్రణాళిక రచన సాగుతోంది. స్క్రిప్టులు చదువుతున్నాను. ప్రొడక్షన్‌కు సిద్ధమవుతున్నారు.  సెప్టెంబర్‌, అక్టోబరుల్లో షూటింగ్‌లు మొదలు కావొచ్చని అంటున్నారు. త్వరలోనే అంతా సాధారణ స్థితికి వస్తుందని భావిస్తున్నారు. అంతా చక్కబడిన తర్వాత మేం పనిలో పడతాం. లైట్‌బాయ్‌లు, జూనియర్‌ ఆర్టిస్టులు.. ఇలా ఇతర సిబ్బందికీ తిరిగి ఉపాధి లభిస్తుంది. 

ప్రశ్న: మీరు పనిచేస్తూ నిర్మాణ దశలో ఉండి ఆగిన పెద్ద బ్యానర్‌ చిత్రాలేవి?

సోనూసూద్‌: యశ్‌రాజ్‌ ఫిల్స్మ్‌ వారి సినిమా ఆఖరి దశలో ఉంది. తెలుగులో చిరంజీవి గారితో ‘ఆచార్య’ సినిమా మొదలైంది. కందిరీగ ఫేమ్‌ సంతోష్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో బెల్లంకొండ సురేష్‌ నిర్మాణ సారథ్యంలో ఒక సినిమా చేస్తున్నాను. చాలా కొత్త సినిమాలు కూడా చేస్తున్నా.. స్క్రిప్టులు చదవడానికి సమయం దొరకడంలేదు. భిన్నమైన పాత్రలు వస్తున్నాయి.

ప్రశ్న: కరోనా కాలంలో మీ కసరత్తులు, పిల్లల చదువులు ఎలా సాగుతున్నాయి?

సోనూసూద్‌: పిల్లలకు ఆన్‌లైన్‌ క్లాసులు నడుస్తున్నాయి. నేను వ్యాయామాలు కొనసాగిస్తున్నాను. ఎక్కువ సమయం బయటకు వెళ్లినా కసరత్తులు ఆపను. 

ప్రశ్న: పిల్లల చదువులో సాయం చేస్తున్నారా?

సోనూసూద్‌: ఈరోజుల్లో పిల్లలు చాలా తెలివిగా ఉంటున్నారు. ఆన్‌లైన్‌ తరగతుల్లో ఉపాధ్యాయులతో మాట్లాడుతుంటారు.  ఏం చేయాలో అది చేస్తుంటారు. నన్ను అడిగితే సహకరిస్తుంటాను. 

కరోనా విపత్కర సమయంలో ప్రజలకు ఎలాంటి సందేశం ఇస్తారు?

సోనూసూద్‌: కాలం మనల్ని రాటుదేల్చుతుంది. ఏమవుతుందో తెలియడంలేదు.. ప్రపంచం ఏమైపోతుందోనని కొందరంటారు. ఏమీ కాదు. ఈ ప్రపంచం ఇంకా బలపడుతుంది. కొన్ని నెలలుగా పనిలేక ఇబ్బందులు పడుతున్న వారికి కొత్త జోష్‌ వస్తుంది.  అన్నింటి నుంచి బయటపడగలుగుతారు. కొంచెం ధైర్యంగా ఉండండి. మీకే కాదు ప్రపంచంలో అందరికీ ఇది కష్టకాలమే.అద్దెల సమస్య, ఉపాధి సమస్య ఇలా అనేక ఇబ్బందులు ఉన్నాయి. జీవితంలో ఇప్పటివరకు చేయనివి చేయడానికి ప్రయత్నించండి. మీరు ఉద్యోగం వదిలేస్తే ఆన్‌లైన్‌లో కోర్సులు నేర్చుకోండి. కొత్త విషయాలు తెలుసుకోండి. ఖర్చులు తగ్గించుకోండి. ఇలా ఏదో ఒకటి చేస్తే తర్వాత పరిస్థితులు సజావుగా మారతాయి. అన్నీ కుదుటపడ్డాక.. మీకు ముందు కంటే మంచికాలం లభిస్తుందని భరోసా ఇస్తున్నాను. Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.