
తాజా వార్తలు
4,000mAh బ్యాటరీ 20 నిమిషాల్లో ఫుల్!
ఇంటర్నెట్డెస్క్: ప్రముఖ మొబైల్ తయారీ కంపెనీ రియల్మీ కొత్త ఫాస్ట్ ఛార్జింగ్ సాంకేతికతను తీసుకొచ్చింది. 125w ఫాస్ట్ఛార్జింగ్ సదుపాయాన్ని పరిచయం చేసింది. దీనికి అల్ట్రాడార్ట్ ఫ్లాష్ ఛార్జింగ్ టెక్నాలజీ అని పేరు పెట్టింది. దీని ద్వారా 4,000 ఎంఏహెచ్ బ్యాటరీని కేవలం 20 నిమిషాల్లో ఛార్జ్ చేయొచ్చని రియల్మీ చెబుతోంది. 33 శాతం శాతం ఛార్జ్ కేవలం మూడు నిమిషాల్లోనే అవుతుందని పేర్కొంది. ఫాస్ట్ ఛార్జింగ్ వల్ల ఫోన్ కూడా హీట్ అవ్వదని, ఫోన్ ఉష్ణోగ్రత 40 డిగ్రీలు మించదని హామీ ఇస్తోంది.
సాధారణంగా 13 నిమిషాల్లోనే 100 శాతం ఛార్జ్ పూర్తవుతుందని, 5జీ ఫోన్లలో 20 నిమిషాల సమయం పడుతుందని రియల్మీ చెబుతోంది. గేమ్స్ ఆడుతూ కూడా ఛార్జింగ్ పెట్టుకోవచ్చని అంటోంది. గ్లోబల్గా ఈ టెక్నాలజీని గురువారం ఆవిష్కరించిన రియల్మీ.. దీని అందుబాటు గురించి మాత్రం ఎలాంటి ప్రకటనా చేయలేదు. ఈ ఏడాది ఫిబ్రవరిలో రియల్మీ తీసుకొచ్చిన రియల్మీ ఎక్స్50 ప్రో 5జీ ఫోన్లో 65w సూపర్డార్ట్ ఫాస్ట్ ఛార్జింగ్ సదుపాయాన్ని కల్పించింది. ఒప్పో సైతం 125w ఫ్లాష్ఛార్జింగ్ని బుధవారం తీసుకొచ్చింది.