Covid దెబ్బకు రెస్టారెంట్ల విలవిల
close

తాజా వార్తలు

Updated : 03/05/2021 09:00 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Covid దెబ్బకు రెస్టారెంట్ల విలవిల

కూర్చుని తినడం కంటే పార్శిళ్లకే జనం మొగ్గు
 రాత్రి కర్ఫ్యూతో తీవ్ర ప్రభావం

ఈనాడు - హైదరాబాద్‌ : కరోనా కల్లోలంలో రెస్టారెంట్లు, హోటళ్లు విలవిల్లాడుతున్నాయి. అల్పాహారం, భోజనం కోసం వచ్చేవారి సంఖ్య భారీగా తగ్గుతోంది. ప్రజలు రెస్టారెంట్లలో కూర్చుని తినడానికి ఆసక్తి చూపడం లేదని, పార్శిళ్లు మాత్రం తీసుకెళ్తున్నారని యజమానులు అంటున్నారు. రాష్ట్రంలో అమల్లోకి వచ్చిన రాత్రి కర్ఫ్యూ నిబంధనలతో తీవ్రంగా నష్టపోతున్నట్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 50-80 శాతం వరకు గిరాకీ తగ్గినట్లు యజమానులు చెబుతున్నారు. నిర్వహణ ఖర్చులు భరించలేక కొందరు తాత్కాలికంగా రెస్టారెంట్లను మూసేందుకు సిద్ధమవుతున్నారు. రాజధానితో పాటు జిల్లాల్లోని హోటళ్లపైనా కొవిడ్‌ రెండోదశ గట్టిగానే ప్రభావం చూపుతోంది. మరోవైపు రానున్న రోజుల్లో పరిస్థితులు ఎలా ఉంటాయోనని హోటళ్లు, రెస్టారెంట్ల సిబ్బంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

డిస్పోజబుల్‌ మెనూ కార్డులు!

వినియోగదారుల భయాన్ని పొగొట్టేందుకు కొన్ని హోటళ్లు ప్రత్యేక చర్యలు చేపడుతున్నాయి. హైదరాబాద్‌ హిమాయత్‌నగర్‌లోని మినర్వా హోటల్‌లో సిబ్బంది మాస్క్‌లతో పాటు ఫేస్‌షీల్డులు, చేతులకు గ్లౌజులు ధరిస్తున్నారు. వినియోగదారుల ఆరోగ్యానికి ప్రాధాన్యమిస్తూ ఈ జాగ్రత్తలన్నీ తీసుకుంటున్నామని, భౌతిక దూరం పాటించేలా సీటింగ్‌ సామర్యాన్ని సగానికి తగ్గించామని, డిస్పోజబుల్‌ మెనూ కార్డులను ఏర్పాటుచేశామని హోటల్‌ మేనేజర్‌ యాదగిరిరెడ్డి తెలిపారు. మరికొన్ని హోటళ్లు, రెస్టారెంట్లు ప్రస్తుత పరిస్థితులకు తగ్గట్లుగా మార్పులు చేసుకుంటున్నాయి.

ఉపాధిని దెబ్బతీస్తున్న కరోనా

సిద్దిపేట నర్సింహసాయి హోటల్‌కు గతంలో రోజూ 250 మంది వచ్చేవారు. 100 పార్శిళ్లు వెళ్లేవి. ఇప్పుడు మొత్తం కలిపినా 50 మంది రావట్లేదు. ఇలా నడపడం వల్ల ఉపయోగం లేదని..నాలుగైదు రోజులు చూసి మూసేస్తానని ఆ హోటల్‌ యజమాని చెబుతున్నారు. ‘ఈ నెలలో 50 శాతం విక్రయాలు తగ్గాయి. హైదరాబాద్‌ పెద్దఅంబర్‌పేటలో, ఏపీలోని కాకినాడలో మాకు హోటళ్లున్నాయి. రెండుచోట్లా అదే పరిస్థితి’ అని తాజా టిఫిన్స్‌ యజమాని రాజేశ్‌రెడ్డి చెప్పారు. రాత్రి కర్ఫ్యూతో బాగా నష్టపోతున్నామని రామగుండంలోని ‘ఐకింగ్‌ ఫ్యామిలీ రెస్టారెంట్‌’ యజమాని సురేష్‌ తెలిపారు. రాత్రి 8-11 వరకు వ్యాపారం బాగా జరిగేదని, ఇప్పుడు 80 శాతం వ్యాపారం పడిపోయిందన్నారు. నిర్వహణ ఖర్చులూ రావడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. 


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని