close

తాజా వార్తలు

Published : 01/04/2020 01:08 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

మరిన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాలి: రేవంత్‌

హైదరాబాద్‌: కరోనా వైరస్‌ వల్ల తెలంగాణలో ఆరుగురు చనిపోవడం ఎంతగానో కలవరపెట్టిందని కాంగ్రెస్‌ ఎంపీ రేవంత్‌రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరికొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. కరోనా నేపథ్యంలో ప్రభుత్వం తీసుకుంటున్న కొన్ని చర్యలు ప్రజలకు ఇబ్బంది కలిగించే విధంగా ఉన్నప్పటికీ ఇది సరైన సమయం కాదని ఎత్తిచూపడం లేదన్నారు. ఈ మేరకు రేవంత్‌ రెడ్డి సీఎం కేసీఆర్‌కు బహిరంగ లేఖ రాశారు.

‘‘సామాజిక దూరం పాటించమని చెబుతూనే మరోపక్క ఫార్మాసిటీ భూసేకరణకు రంగారెడ్డి జిల్లా మేడిపల్లి నానక్‌రాంగూడ గ్రామ పరిధిలో రెవెన్యూ అధికారులు నోటీసులు జారీ చేసినట్లు లేఖలో పేర్కొన్నారు. ఏప్రిల్ 3న ప్రజాభిప్రాయ సేకరణ సభ నిర్వహించబోతున్నట్లు నోటీసులో అధికారులు పేర్కొన్నారు. అధికారికంగా ఏప్రిల్ 14 వరకు లాక్ డౌన్ ప్రకటించి 3న సభ నిర్వహించడం సరైన నిర్ణయం కాదు. సభలు, సమావేశాలు నిర్వహిస్తే ప్రజలు గుంపుగా ఒక దగ్గరకు చేరే ప్రమాదం ఉంది. ఈ సమయంలో ఇలాంటి చర్య సరైంది కాదు’ అని రేవంత్‌ రెడ్డి తన లేఖలో పేర్కొన్నారు. ప్రజా ప్రతినిధులు, అఖిల భారత సర్వీసుల అధికారులు, ఉన్నతోద్యోగుల జీతాల్లో కోత విధించడాన్ని స్వాగతిస్తున్నామని, కానీ చిరుద్యోగులు, నాలుగో తరగతి ఉద్యోగులు, ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగుల జీతాల్లో కోత విధించడం సరైంది కాదని రేవంత్‌ తెలిపారు. ‘‘వైద్య, పారామెడికల్ సిబ్బంది ప్రాణాలకు తెగించి విధులు నిర్వహిస్తున్నారు. వారికి ప్రోత్సాహకాలు ఇవ్వాల్సింది పోయి జీతాల్లో కోత పెట్టడం వారి నిబద్ధతను తక్కువ చేయడమే అవుతుంది. ప్రజలను ఆర్థిక ఇబ్బందులకు గురిచేసే విధంగా తీసుకున్న నిర్ణయాలపై మరోసారి సమీక్షించాలని కోరుతున్నాను" అని రేవంత్‌ రెడ్డి లేఖలో వివరించారు.


Tags :

రాజకీయం

జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని