
తాజా వార్తలు
ధోనీ కనురెప్ప వేయకుండా ఓకే అన్నాడు
పాకిస్థాన్‌తో బౌలౌట్ చేస్తానంటే: రాబిన్ ఉతప్ప
ఇంటర్నెట్‌డెస్క్: 2007 తొలి టీ20 ప్రపంచకప్ ఉత్కంఠ పోరు ఫైనల్ మ్యాచ్‌లో టీమ్ఇండియా పాకిస్థాన్‌పై విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే, అంతకన్నా ముందే చిరకాల ప్రత్యర్థితో లీగ్స్టేజ్లోనే ధోనీసేన తలపడింది. అప్పుడు మ్యాచ్ టైగా మారడంతో అంపైర్లు బౌలౌట్ విధానాన్ని అవలంభించి టీమ్ఇండియాను విజేతగా ప్రకటించారు. కాగా, ఆ మ్యాచ్ కన్నా ముందే నాటి బౌలింగ్ కోచ్, మాజీ పేసర్ వెంకటేశ్ ప్రసాద్ తమ ఆటగాళ్లకు బౌలౌట్ విధానాన్ని ప్రాక్టీస్ చేయించాడని వెటరన్ బ్యాట్స్‌మన్ రాబిన్ ఉతప్ప వెల్లడించాడు. తాజాగా అతడు స్టార్‌స్పోర్ట్స్ క్రికెట్ కనెక్టెడ్ కార్యక్రమంలో మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలు పేర్కొన్నాడు.
‘రోజూ మేం ప్రాక్టీస్ చేసేటప్పుడు వెంకీ మమ్మల్ని ఫుట్‌బాల్ ఆడనీయకుండా బౌలౌట్ చేయించేవాడు. బ్యాట్స్‌మెన్‌లో నేనూ, సెహ్వాగ్, రోహిత్ నేరుగా స్టంప్స్‌కు విసిరేవాళ్లం. ఆ క్రమంలోనే పాకిస్థాన్‌తో ఆడిన తొలి టీ20 టైగా మారింది. అప్పుడు మేమెంతో ఆసక్తితో ఎదురుచూశాం. ఎందుకంటే ఆ మ్యాచ్‌లో భారత్ ఓడిపోయే పరిస్థితికి చేరుకుంది. చివర్లో శ్రీశాంత్ అద్భుతంగా బౌలింగ్ చేయడంతో మ్యాచ్‌ను టైగా మలుచుకున్నాం. తర్వాత పూర్తి ఆత్మవిశ్వాసంతో బౌలౌట్ విధానానికి సిద్ధపడ్డాం. నేను బౌలౌట్‌కు వెళతానని అనగానే కెప్టెన్ ధోనీ ఒప్పేసుకున్నాడు. ఈ విషయంలో అతడికి క్రెడిటివ్వాలి. అసలు బౌలరే కాని ఒక ఆటగాడు నేరుగా కెప్టెన్ వద్దకెళ్లి బౌలౌట్ చేస్తానంటే ఎవరైనా ఒప్పుకుంటారా? కానీ, ఒట్టేసి చెబుతున్నా.. ధోనీ కనురెప్ప కూడా వేయకుండా ఓకే అన్నాడు’ అని ఉతప్ప తన అనుభవాన్ని గుర్తుచేసుకున్నాడు.
ఆ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమ్ఇండియా 20 ఓవర్లలో 141/9 స్కోరు మాత్రమే చేసింది. ఉతప్ప(50;39 బంతుల్లో 4x4, 2x6) అర్ధశతకంతో ఆదుకున్నాడు. అనంతరం ఛేదనలో పాక్ ఏడు వికెట్లు కోల్పోయి అన్నే పరుగులు చేసింది. మిస్బాఉల్ హక్(53; 35 బంతుల్లో 7x4, 1x6) కీలక ఇన్నింగ్స్ ఆడినా కీలక సమయంలో రనౌటయ్యాడు. చివరికి మ్యాచ్ టైగా మారడంతో అంపైర్లు బౌలౌట్ విధానానికి వెళ్లారు. అప్పటికి సూపర్ ఓవర్ పద్ధతి లేదు. ఇక భారత్ తరఫున వీరేందర్ సెహ్వాగ్, రాబిన్ ఉతప్ప, హర్భజన్ సింగ్ బంతులేసి ముగ్గురూ వికెట్లకు తాకించారు. పాక్ తరఫున అరాఫత్, ఉమర్ గుల్, షాహిద్ అఫ్రిది ముగ్గురూ విఫలమయ్యారు. దాంతో భారత్ విజేతగా నిలిచింది.