రూ.లక్షకోట్ల గ్రాంటు ఇవ్వండి: గహ్లోత్‌
close

తాజా వార్తలు

Updated : 29/03/2020 04:14 IST

రూ.లక్షకోట్ల గ్రాంటు ఇవ్వండి: గహ్లోత్‌

జైపూర్‌: కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు రాష్ట్రాలకు రూ.లక్ష కోట్ల గ్రాంట్‌ను ఇవ్వాలని రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్‌ పేర్కొన్నారు. ఈ మేరకు గహ్లోత్‌ ప్రధాని మోదీకి శనివారం లేఖ రాశారు. రాష్ట్రాల జనాభా ఆధారంగా మొదటి విడత గ్రాంటును వెంటనే అందజేయాలని లేఖలో ఆయన కోరారు. మిగతా గ్రాంట్‌ మొత్తాన్ని కరోనా ప్రభావం అధికంగా ఉన్న రాష్ట్రాలకు అంచనా వేసి ఎక్కువ మొత్తంలో కేటాయించాలన్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ విపత్తును ఎదుర్కోవడానికి రూ. 1.70 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీని ప్రకటించినందుకు ఈ సందర్భంగా గహ్లోత్‌ ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. కరోనాను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఎదుర్కోవాలని పేర్కొన్నారు. ఏప్రిల్‌ నుంచి 11 నెలల పాటు రాష్ట్రాలకు వడ్డీలేని ముందస్తు రుణాన్ని ఆర్బీఐ ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని మోదీని కోరారు. కరోనా వ్యాప్తి రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థలపై ప్రభావం చూపిందని గహ్లోత్‌ అన్నారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాలకు వచ్చే పన్ను, పన్నేతర ఆదాయం గణనీయంగా తగ్గిన నేపథ్యంలో అదనంగా 2శాతం క్రెడిట్‌లిమిట్‌కు అనుమతి ఇవ్వాలని కోరారు. అలాగే రాజస్థాన్‌లో లాక్‌డౌన్‌ కారణంగా ప్రజలకు నిత్యావసరాల కొరత ఏర్పడకుండా తగిన చర్యలు తీసుకుంటున్నామన్నారు. పేదవర్గాలు ఇబ్బంది పడకుండా నగదు పంపిణీ కార్యక్రమం కూడా చేపట్టామన్నారు. ప్రజల వైద్యానికి సంబంధించి అత్యధిక నిధులు వెచ్చించి కరోనా వైరస్‌ నుంచి ప్రజలను కాపాడేందుకు శక్తిమేర ప్రయత్నిస్తున్నామన్నారు. కొన్ని పరిమితుల వల్ల మరిన్ని నిధులను సమకూర్చుకోవడానికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. ఇప్పటివరకు రాజస్థాన్‌లో 36 కరోనా కేసులు నమోదు అయ్యాయి. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని