
తాజా వార్తలు
దేశంలో వంద మందిపై రష్యా వ్యాక్సిన్ ప్రయోగం..
దిల్లీ: రష్యా అభివృద్థి చేసిన కరోనా వైరస్ నిరోధక వ్యాక్సిన్ ‘స్పుత్నిక్ వీ’ని భారత్‌లో వంద మంది వాలంటీర్లపై ప్రయోగించనున్నారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ సంస్థ డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) రష్యన్ న్యూస్ ఏజెన్సీ స్పుత్నిక్‌కు వెల్లడించినట్లు సమాచారం. పరీక్షల నిర్వహణ కోసం ఫార్మా దిగ్గజం డాక్టర్ రెడ్డీస్ ల్యాబోరేటరీస్‌కు అనుమతులు మంజూరు చేసినట్టు డీసీజీఐ ప్రకటించింది. పరీక్షల నిర్వహణ తేదీలను ఇంకా వెల్లడించాల్సి ఉన్నప్పటికీ.. మూడో దశ క్లినికల్ ట్రయల్స్ ప్రారంభానికి ముందే ఈ పరీక్షలు ఉంటాయని ఫార్మా సంస్థ తెలిసింది. ఇక మూడో దశలో 1400 మందిపై వ్యాక్సిన్ పరీక్షలు నిర్వహించనున్నట్టు రెడ్డీస్ ల్యాబ్స్ తెలిపింది.
రష్యాకు చెందిన రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ (ఆర్డీఐఎఫ్), గమాలెయా సంస్థలు సంయుక్తంగా తయారుచేసిన స్పుత్నిక్ వీ.. ప్రపంచంలోనే తొలి కరోనా వ్యాక్సిన్‌గా ఆగస్టు 11న చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. కాగా, ఆర్డీఐఎఫ్తో హైదరాబాద్‌కు చెందిన డాక్టర్ రెడ్డీస్ సంస్థ కొవిడ్-19 వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ నిర్వహణ, పంపిణీకి ఒప్పందం కుదుర్చుకుంది. దీనిలో భాగంగా ప్రయోగాలు విజయవంతం అయిన అనంతరం రష్యా సంస్థ డాక్టర్ రెడ్డీస్‌కు 100 మిలియన్ డోసుల కొవిడ్ వ్యాక్సిన్‌ను అందజేస్తుంది. కాగా స్పుత్నిక్‌కు సంబధించి రెండు, మూడు దశల క్లినికల్ ట్రయల్స్ నిర్వహించేందుకు అనుమతి కోరుతూ రెడ్డీస్ సంస్థ అక్టోబర్ 13న మరోసారి డీసీజీఐకి దరఖాస్తు చేసుకున్న విషయం తెలిసిందే.