
తాజా వార్తలు
తన ఎమ్మెల్యేలతో వీడియో విడుదల చేసిన సచిన్ పైలట్
జైపుర్: రాజస్థాన్‌లో సొంత ప్రభుత్వంపై తిరుగుబావుటా ఎగరేసిన ఉప ముఖ్యమంత్రి సచిన్‌పైలట్ తాజాగా తన వర్గం ఎమ్మెల్యేలతో కూడిన ఓ వీడియోను విడుదల చేశారు. తద్వారా ఆయన తన బలాన్ని చూపేందుకు ప్రయత్నం చేసినట్లు అర్థమవుతోంది. దాదాపు 15 మంది ఎమ్మెల్యేలు ఉన్నట్లు ఆ వీడియో ద్వారా తెలుస్తోంది. అయితే, వీరిలో సచిన్ పైలట్ కానరాకపోవడం గమనార్హం. ప్రస్తుతం వీరంతా హరియాణాలోని మానేసర్‌లో ఉన్న ఓ రిసార్టులో మకాం వేసినట్లు సమాచారం. ఈ వీడియోను పైలట్ కార్యాలయం విడుదల చేసినట్లు ప్రముఖ వార్తా సంస్థ ఏఎన్ఐ పేర్కొంది. గహ్లోత్‌తో కలిసి పనిచేయడానికి విముఖత వ్యక్తం చేస్తున్న ఆయన తనవైపు 30 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని చెప్పుకున్న విషయం తెలిసిందే.
మరోవైపు నిన్న జరిగిన సీఎల్పీ సమావేశం తర్వాత తమ పక్షాన 109 మంది ఎమ్మెల్యేలు ఉన్నట్లు గహ్లోత్ వర్గం ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం వీరంతా జైపుర్ శివారుల్లోని ఓ రిసార్టులో మకాం వేశారు. నేడు అక్కడే మరోసారి సీఎల్పీ సమావేశం జరగనుంది. నిన్న జరిగిన భేటీకి గైర్హాజరైన పైలట్, తన వర్గ ఎమ్మెల్యేలు నేటి సమావేశానికి కూడా డుమ్మా కొట్టే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఇదీ చదవండి..