
తాజా వార్తలు
ఫైనల్కు ముందు ముంబయికి సచిన్ సందేశం
ఇంటర్నెట్డెస్క్: టీ20 మెగా క్రికెట్ లీగ్ 13వ సీజన్ ముగింపు దశకు చేరుకుంది. మంగళవారం ఫైనల్లో ముంబయి, దిల్లీ తలపడనున్నాయి. ముచ్చటగా ఐదోసారి కప్పును ఎగరేసుకుపోవాలని రోహిత్ సేన.. తొలిసారే ఫైనల్ చేరినా టైటిల్ గెలవాలని శ్రేయస్ టీమ్ పట్టుదలగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో క్రికెట్ దిగ్గజం, ముంబయి మాజీ సారథి సచిన్ తెందూల్కర్ సోమవారం ఆ జట్టుకు ఓ సందేశం ఇచ్చాడు. ఆటగాళ్లలో స్ఫూర్తి నింపేందుకు ఓ వీడియోలో మాట్లాడాడు. దాన్ని ముంబయి టీమ్ ట్విటర్లో పంచుకుంది. ఆ జట్టు తరఫున ఆడటానికి బరిలోకి దిగినప్పుడు వ్యక్తిగతంగా ఒక్కొక్కరు మాత్రమే ఆడరని, అందరి వెనుక బలమైన శక్తి ఉందని పేర్కొన్నాడు. ఇక అన్నిటికంటే ముఖ్యమైన విషయం ముంబయి జట్టంతా ఒక కుటుంబమని, కష్ట సుఖాల్లో ఆటగాళ్లంతా కలిసే ఉంటారని చెప్పాడు.
‘జీవితంలో ఎలాగైతే ఒడుదొడుకులు ఉంటాయో ఆటలోనూ అలాగే సవాళ్లు ఉంటాయి. ముఖ్యంగా ఈ టీ20 లీగ్లో కీలక దశకు చేరుకున్నాక అలాంటి పరిస్థితులు ఎదురవుతాయి. ఒక జట్టుగా అందరూ కలిసి ఉండటం ఎంతో అవసరం. అలాంటప్పుడే విజయాలు సాధిస్తాం’ అని సచిన్ పేర్కొన్నాడు. జట్టు యాజమాన్యం, సహాయక సిబ్బంది ప్రతీ ఒక్కరూ ఆటగాళ్లను ప్రోత్సహిస్తారని, ముంబయి జట్టుకు ఆడేటప్పుడు ఎవరూ వ్యక్తిగతంగా ఒక్కరు కాదనే విషయం తెలుస్తుందని చెప్పాడు. జట్టు మొత్తం తమ వెంటే ఉందని, బాగా ఆడేందుకు వాళ్లంతా నిరంతరం కృషి చేస్తారని వివరించాడు. దాంతో ప్రతీ ఒక్కరూ అత్యుత్తమ ప్రదర్శన చేసేలా తోడ్పాటు అందిస్తారని లిటిల్ మాస్టర్ అభిప్రాయపడ్డాడు.
ఇదిలా ఉండగా, మంగళవారం కచ్చితంగా గెలవాలని ముంబయి ఆటగాళ్లు పట్టుదలతో ఉన్నారు. ఇప్పటికే తమ ఫిట్నెస్ కాపాడుకుంటూ జిమ్, మైదానంలో బాగా కష్టపడుతున్నారు. అందుకు సంబంధించిన వీడియోను కూడా ముంబయి ట్విటర్లో పంచుకోవడం విశేషం.