
తాజా వార్తలు
సల్మాన్ కోసం సైకిల్‌పై 600 కి.మీ
భాయ్‌ని కలిసేందుకు అభిమాని ఏం చేశాడంటే
ముంబయి: తమ అభిమాన నటీనటులను నేరుగా చూసేందుకు, వారితో కలిసి ఫొటోలు దిగేందుకు అభిమానులు ఎంతో ఆసక్తి కనబరుస్తుంటారు. తాజాగా బాలీవుడ్ నటుడు సల్మాన్‌ఖాన్‌పై ఉన్న ఇష్టాన్ని ఓ అభిమాని వినూత్న రీతిలో ప్రదర్శించాడు. భాయ్‌ని కలిసేందుకు 600 కి.మీ. సైకిల్‌పై ప్రయాణించాడు. అస్సోంలోని తిన్సుకియా ప్రాంతానికి చెందిన 52 ఏళ్ల భూపెన్ లిక్సన్కు సల్మాన్ అంటే ఎంతో అభిమానం. అయితే ఫిబ్రవరి 15న గువహటిలో ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవం జరగనుంది.
ఈ కార్యక్రమంలో సల్మాన్‌తోపాటు బాలీవుడ్ తారలు పాల్గొననున్నారు. దీంతో సల్మాన్‌ను కలిసేందుకు భూపెన్ తన ప్రాంతం తిన్సుకియా నుంచి ఫిబ్రవరి 8న సైకిల్‌పై ప్రయాణం ప్రారంభించి ఫిబ్రవరి 13 నాటికి 600 కి.మీ దూరంలో ఉన్న గువహటికి చేరుకున్నారు. ప్రస్తుతం భూపెన్కు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పటికే భూపెన్.. 48 కి.మీ దూరాన్ని 60 నిమిషాల్లో ప్రయాణించి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం దక్కించుకున్నారు.