
తాజా వార్తలు
వచ్చే ఏడాది చెన్నై పగ్గాలు డుప్లెసిస్‌కి..
అతడి సారథ్యంలో ధోనీ ఆడతాడు: సంజయ్ బంగర్
ఇంటర్నెట్‌డెస్క్: వచ్చే ఏడాది ఐపీఎల్లో చెన్నై కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ జట్టు పగ్గాలు ఫా డుప్లెసిస్‌కు అప్పగించి అతడి సారథ్యంలో కొనసాగుతాడని టీమ్ఇండియా బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్ అభిప్రాయపడ్డాడు. తాజాగా ఇర్ఫాన్ పఠాన్‌తో కలిసి ‘క్రికెట్ కనెక్టెడ్’ కార్యక్రమంలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశాడు. తర్వాతి సీజన్లో ధోనీ కెప్టెన్సీ బాధ్యతలు ఎవరికైనా అప్పగిస్తాడా అని అడిగిన ప్రశ్నకు బంగర్ ఇలా స్పందించాడు. అంతకుముందు పఠాన్ స్పందిస్తూ ఇప్పటికైతే తానేమీ అలాంటివి ఊహించడం లేదని స్పష్టం చేశాడు.
‘నాకైతే అలాంటి ఆటగాళ్లెవరూ కనిపించడం లేదు. తర్వాతి సీజన్‌కు మరికొద్ది నెలల సమయమే ఉండడంతో ధోనీ పూర్తిస్థాయి ఫిట్నెస్తో తిరిగొస్తాడని భావిస్తున్నా. ఐపీఎల్ కన్నా ముందే పలు మ్యాచ్‌లు ఆడుతాడని ఆశిస్తున్నా. ఎందుకంటే ఏ ఆటగాడికైనా అదెంతో అవసరం. ధోనీ గొప్ప ఆటగాడు కాబట్టి అతడిని మళ్లీ చూడాలనుకుంటున్నా’ అని ఇర్ఫాన్ అన్నాడు. ఆపై బంగర్ మాట్లాడుతూ 2011 తర్వాత టీమ్ఇండియా కెప్టెన్‌గా దిగిపోవాలని కూడా ధోనీ భావించి ఉంటాడని, అప్పుడు సరైన వ్యక్తి లేకపోవడంతోనే కొన్నేళ్ల పాటు కొనసాగాడని చెప్పాడు. సరైన సమయంలో కోహ్లీకి అప్పగించాక అతడి సారథ్యంలో ఆడినట్లు గుర్తుచేశాడు. ఈ నేపథ్యంలో ఐపీఎల్‌లోనూ వచ్చే ఏడాది డుప్లెసిస్‌కు బాధ్యతలు అప్పగించి సాధరణ ఆటగాడిగా కొనసాగుతాడని అభిప్రాయపడ్డాడు. ఇదిలా ఉండగా, ఈ సీజన్లో ధోనీసేన ఎన్నడూ లేని విధంగా ఘోర పరాభావాలు చవిచూసింది. దీంతో లీగ్ దశ నుంచే నిష్క్రమించిన సంగతి తెలిసిందే. ఐపీఎల్లో ప్లేఆఫ్స్ చేరకుండా వైదొలగడం చెన్నై జట్టుకు ఇదే తొలిసారి.