ఉరి వేసుకుంటూ సెల్ఫీ వీడియో
close

తాజా వార్తలు

Updated : 12/07/2020 11:21 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఉరి వేసుకుంటూ సెల్ఫీ వీడియో

ప్రేమ వ్యవహారం వల్లే యువతి ఆత్మహత్య!

నెల్లూరు (వీఆర్సీ సెంటరు), న్యూస్‌టుడే : శివ.. ఒక్కసారి మాట్లాడరా.. ప్లీజ్‌.. నువ్వు మాట్లాడకపోతే చనిపోతా..’ అంటూ యువతి తన సెల్‌ఫోన్లో పంపిన సందేశాలు కేసును మలుపుతిప్పాయి. నగరంలోని బీవీ నగర్‌లో రమ్య (21) అనే విద్యార్థిని శుక్రవారం ఆత్మహత్య చేసుకున్న సంఘటన తెలిసిందే. ఉరివేసుకుంటూ దిగిన సెల్ఫీ వీడియో కారణంగా ప్రేమ వ్యవహారంతోనే రమ్య బలవన్మరణానికి పాల్పడిందని పోలీసులు గుర్తించారు. బీవీ నగర్‌లోని రాజు కాంప్లెక్స్‌లో ఉండే వెంకటరాజు, సుబ్బమ్మ దంపతులకు లక్ష్మణరాజు, రమ్య పిల్లలు ఉన్నారు. రమ్య నగరంలోని ఓ డిగ్రీ కళాశాలలో బీసీఏ ద్వితీయ సంవత్సరం చదువుతోంది.

ఫోనుతో ప్రేమ వ్యవహారం వెలుగులోకి..

దర్యాప్తు చేపట్టిన పోలీసులు రమ్య ఫోనును పరిశీలించారు. అందులో ఉదయం 11.12 గంటల నుంచి 12.22 గంటల వరకు శివభార్గవ్‌ అనే యువకుడికి పంపిన సందేశాలు, సెల్ఫీలు, ఆత్మహత్య చేసుకుంటున్న వీడియోలు లభ్యమయ్యాయి. తనతో మాట్లాడమని పంపిన సందేశాలు అనేకమున్నాయి. దాంతో రమ్య స్నేహితులను పోలీసులు విచారించగా కల్యాణ్‌నగర్‌కు చెందిన శివభార్గవ్‌తో ఉన్న ప్రేమ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. వివాహం చేసుకోమంటే చేసుకోనని చెప్పాడని, దాంతో రమ్య చచ్చిపోతానని చెప్పగా.. చచ్చిపోవాలని శివ చెప్పినట్లు, అందుకే ఆమె మృతి చెందిందని పోలీసుల దర్యాప్తులో తేలింది. ఆమె కుటుంబ సభ్యులు సెల్ఫీ వీడియోలు, సందేశాలు శుక్రవారం అర్ధరాత్రి జిల్లా ఎస్పీ భాస్కర్‌భూషణ్‌కు పంపించి న్యాయం చేయాలని కోరారు. తమ కుమార్త్తె చావుకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని మృతురాలి తల్లి కె.సుబ్బమ్మ శనివారం వేదాయపాలెం పోలీసులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. దాంతో పోలీసులు కేసులో సెక్షన్లను మార్చి దర్యాప్తు చేపట్టారు. శివభార్గవ్‌ ప్రస్తుతం పరారీలో ఉండటంతో అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు. అతనితో సన్నిహితంగా ఉన్న ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని