close
Array ( [0] => stdClass Object ( [video_news_id] => 120034645 [video_srlno] => 1 [video_type] => 1 [video_link] => aSAmI9sQWZE [video_short_link] => aSAmI9sQWZE [created_by] => [created_date] => [modified_by] => 963258741 [modified_date] => 2020-03-12 19:02:28.31782 [display_status] => 1 [video_isdeleted] => ) ) 1

తాజా వార్తలు

Updated : 12/03/2020 19:02 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

కరోనా భయంతో దడదడలాడిన దలాల్‌స్ట్రీట్‌

దేశీయ స్టాక్‌ మార్కెట్లను కరోనా భయాలు కుదిపేశాయి. పతనాల్లో కొత్త రికార్డులను సృష్టించాయి. సూచీలన్నీ పతనానికి పర్యాయ పదంలా మారాయి. ఆరంభం నుంచి ముగిసే వరకూ నష్టపోవడం మాత్రమే తెలుసున్న రీతిలో షేర్లు కదలాడాయి. మార్కెట్‌ ఎప్పుడు అయిపోతుందా? అని ప్రతి మదుపరి బహుశా ఆశగా ఎదురు చూసి ఉంటాడేమో. ఆ స్థాయిలో సూచీలు నష్టాలను మూటగట్టుకున్నాయి. అలా చివరకు బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 2,919 పాయింట్ల నష్టంతో 32,778కు పడిపోయింది. నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ నిఫ్టీ 868.25 పాయింట్ల నష్టంతో 10వేల మార్కును దిగి, 9,590 వద్ద బతుకు జీవుడా అంటూ స్థిరపడింది.

ఆరంభం నుంచి నష్టపోవడమే..

గురువారం ఉదయం దేశీయ స్టాక్‌మార్కెట్లు భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఆరంభంలో సెన్సెక్స్‌ ఏకంగా 1,821 పాయింట్లు నష్టపోగా, నిఫ్టీ 470 పాయింట్ల నష్టంతో ట్రేడింగ్‌ను కొనసాగించాయి. ఆ తర్వాత ఏ పరిస్థితుల్లోనూ సూచీలు కోలుకోలేదు. కరోనా(కోవిడ్‌-19)ను మహ్మమ్మారిగా డబ్ల్యూహెచ్‌వో ప్రకటించడం మార్కెట్లపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. దీనికి తోడు కరోనా వైరస్‌ను అడ్డుకునేందుకు వచ్చే 30 రోజులపాటు యూకేతో సహా అన్ని యూరప్‌ దేశాలకు రాకపోకలను నిలిపివేస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ప్రకటించడం విదేశీ మదుపరులను భయాందోళనకు గురి చేసింది. అన్ని రంగాల షేర్లు నష్టాలను చవి చూశాయి. ముఖ్యంగా బీపీసీఎల్‌, యూపీఎల్‌, యెస్‌ బ్యాంకు, వేదాంత, గెయిల్‌ షేర్లు భారీ నష్టాలను మూటగట్టుకున్నాయి. మొత్తం స్టాక్‌మార్కెట్‌లోని షేర్లలో 217 షేర్లు కాస్త లాభపడగా, 2203షేర్లు నష్టాలను చవిచూశాయి. 102షేర్ల ధరలో ఎలాంటి మార్పూ లేదు. 

789 షేర్లు 52వారాల అత్యల్పానికి..!

మార్కెట్లు ఎంతగా పతనం అయ్యాయంటే 783 కంపెనీలు తమ 52వారాల అత్యల్ప స్థాయిలో ట్రేడ్‌ అయ్యాయి. వీటిల్లో రిలయన్స్‌, టీసీఎస్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, బజాజ్‌ ఆటో, హెచ్‌పీసీఎల్‌, ఐటీసీ, ఎల్‌అండ్‌టీ, స్పైస్‌జెట్‌, ఏబీబీ, హీరో మోటో, ఏసీసీ, బీఈఎంఎల్‌,గెయిల్‌,గిల్లెట్‌, గ్లెన్‌మార్క్‌ వంటి దిగ్గజ షేర్లు ఉన్నాయి. 

కరోనావైరస్‌ ప్రభావం

కరోనావైరస్‌ను మహమ్మారిగా ప్రకటించడంతో ఆ ప్రభావం మార్కెట్లపై తీవ్రంగా పడింది. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థలపై ఈ మహమ్మారి ప్రభావం చూపనుంది. ఇప్పటికే 100కు పైగా దేశాల్లో ఇది విజృంభించడంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ నిన్న ఈ ప్రకటన చేసింది.  చాలా దేశాలు స్వీయ నిర్బంధాలు విధించుకోవడం.. ప్రయాణ ఆంక్షలు పెరిగిపోవడం కూడా మార్కెట్లపై ప్రతికూల ప్రభావం చూపిస్తోంది. ముఖ్యంగా సప్లైఛైన్‌ మరింతగా దెబ్బతినే ప్రమాదం ఉండటంతో మార్కెట్లు భయపడిపోయాయి.

అమెరికాలో మార్కెట్లు బేరిష్‌గా మారడం..

అమెరికా సూచీల ప్రభావం మార్కెట్లపై బలంగా పనిచేస్తోంది. నిన్నటి ట్రేడింగ్‌లో డోజోన్స్‌ ఏకంగా 5.8శాతం కుంగి 1,464 పాయింట్లు నష్టపోయింది. ఇక నాస్‌డాక్‌ 4.7శాతం, ఎస్‌అండ్‌పీ500 సూచీ 4శాతానికి పైగా పడిపోయాయి. అమెరికా మార్కెట్లు బేరిష్‌గా మారడం ప్రపంచ మార్కెట్లకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ యూరప్‌కు ప్రయాణాలపై నిషేధం విధించడంతో మార్కెట్లు బెంబేలెత్తిపోయాయి. కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టడానికి అమెరికా సర్కార్‌ ఈ చర్యలు తీసుకొంది. ఇప్పటికే చైనాతో వాణిజ్యం తగ్గగా.. ఇప్పుడు యూరప్‌తో వాణిజ్య సంబంధాలు తగ్గే అవకాశం ఉండటం కూడా అక్కడి మదుపరులను భయపెట్టింది. ఆసియా మార్కెట్లు కూడా నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఒక్క సూచీ కూడా లాభాల్లో లేకపోవడం గమనార్హం.

చమురు ధరల ప్రభావం..

సౌదీ, రష్యా మధ్య నెలకొన్న చమురు యుద్ధంతో ఉత్పత్తి పెంపు కొనసాగిస్తామని ఆరామ్‌కో నిన్న ప్రకటించడం కూడా  చమురు శుద్ధి పరిశ్రమల షేర్లను కుంగదీసింది. అంతర్జాతీయ మార్కెట్లలో చమురు ధరలు 6.36శాతానికి పైగా కుంగాయి. దీంతో ముఖ్యంగా రిలయన్స్‌ షేరు 7శాతానికి పైగా పడిపోయింది. ఇది సూచీలో రెండో అత్యంత కీలకమైన షేర్‌ కావడంతో  మార్కెట్లు పతనం వైపు పరుగులు తీశాయి. ఓఎన్‌జీసీ షేరు ఏకంగా 12శాతానికి పైగా పతనమైంది. ధరలు తగ్గే కొద్దీ చమురు కంపెనీల లాభాలు ఆవిరికానుండటంతో ఈ కౌంటర్లలో భారీగా అమ్మకాలు చోటు చేసుకుంటున్నాయి.

రూపాయి పతనం..

నేడు మార్కెట్లలో రూపాయి పరిస్థితి కూడా ఏమాత్రం బాగోలేదు. ఉదయం ట్రేడింగ్‌లో డాలర్‌తో పోలిస్తే 82పైసలు కోల్పోయి రూపాయి విలువ   74.50గా పడిపోయింది. ఆ తర్వాత కాస్త కోలుకుని 74.18 వద్ద ట్రేడవుతోంది. 

కమ్మేసిన భయాలు..

సూచీల పరిస్థితి ఏమాత్రం బాగోకపోవడంతో ఎఫ్‌ఐఐలు కూడా మార్కెట్లను వీడుతున్నారు. ఈ క్రమంలో షేర్లు మరింత పతనం అయి భయాలను ఎగదోస్తున్నాయి. నిఫ్టీ 10వేల మార్కు కిందకు రావడం, 868 పాయింట్లకు పైగా పతనం కావడం మదుపరుల సెంటిమెంట్‌ను భారీగా దెబ్బతీసింది. ఇదంతా ఒక గొలుసుకట్టు వ్యవస్థలా పనిచేసి మార్కెట్లలో ఆందోళనకర పరిస్థితి నెలకొంది. భారీ షేర్లు ఏవీ లాభాల్లో ట్రేడ్‌ కావట్లేదంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.



Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.