close
Array ( ) 1

తాజా వార్తలు

Updated : 23/03/2020 16:41 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

స్టాక్‌మార్కెట్‌: పతనాల్లో ‘మహా’ పతనం!

ముంబయి: ‘స్టాక్‌మార్కెట్లు భారీ పతనం’ ప్రపంచాన్ని కరోనా కమ్మేసిన నాటి నుంచి ఈ మాట సాధారణం అయిపోయింది. మరీ ముఖ్యంగా భారత్‌లో కరోనా వ్యాప్తి చెందుతున్న నాటి నుంచి అయితే, మార్కెట్లకు ఇదే నిత్యమంత్రం అయిపోయింది. కరోనా దెబ్బకు నేడు స్టాక్‌మార్కెట్లు మరో బ్లాక్‌ మండేను చూడాల్సి వచ్చింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఒకరోజు ట్రేడింగ్‌లో అత్యధిక పాయింట్ల నష్టాన్ని చవిచూసింది. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ ఏకంగా 3,934 పాయింట్ల కోల్పోయి, 25,981కు చేరింది. నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ నిఫ్టీ 1,135 పాయింట్ల పతనంతో 7,610 పాయింట్ల వద్ద స్థిరపడింది. ఒక రోజులో అటు పర్సంటేజీల పరంగా, ఇటు అంకెల పరంగా అతి పెద్ద పతనం ఇదే.

దేశంలోని 7 రాష్ట్రాలు పూర్తిగా లాక్‌డౌన్‌ ప్రకటించడంతో మార్కెట్లు కూడా భారీగా పతనం అయ్యాయి. దేశంలో కొవిడ్‌-19 రెండో దశకు చేరడం.. ఆదివారం ఒక్క రోజే ముగ్గురు చనిపోవడంతో ఇక సమస్య తీవ్రమవుతోందనే సంకేతాలు మదుపరులను భయపెట్టాయి. దీంతో ఆరంభ ట్రేడింగ్‌లోనే మార్కెట్‌ భారీగా నష్టపోయింది. సెన్సెక్స్‌ ట్రేడింగ్‌ మొదలైన కొద్దిసేపటికే 2,991 పాయింట్లు పతనమై 26,924 పాయింట్లకు, నిఫ్టీ 842 పాయింట్లు పతనమై 7,903కు చేరాయి. సెన్సెక్స్‌ 10శాతం పతనం కావడంతో ట్రేడింగ్‌ను నిలిపివేశారు. ఆ తర్వాత మార్కెట్లు మొదలైనా ఏ దశలోనూ కోలుకోలేదు. చివరకు మార్కెట్లు మహాపతనాన్ని చవిచూశాయి.

లాక్‌డౌన్‌ కింద భారత్‌..

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, పంజాబ్‌, ఉత్తరాఖండ్‌, ఝార్ఖండ్‌, జమ్మూ-కశ్మీర్‌, చండీగఢ్‌లు మార్చి31వరకు పూర్తిగా లాక్‌డౌన్‌ను ప్రకటించాయి. మారుతీ సుజుకీ, మహీంద్రాలు ప్లాంట్లలో కార్యకలాపాలను నిలిపివేశాయి. హీరోమోటోకార్ప్‌  కూడా ఇదే బాటలో పయనించింది. మరోపక్క ఎల్‌జీ కూడా భారత్‌లోని రెండు ప్లాంట్లను మూసివేస్తున్నట్లు ప్రకటించింది. 

పెరుగుతున్న కరోనా కేసులు..

కరోనా వైరస్‌ తీవ్రత భారత్‌లో నానాటికీ పెరుగుతోంది. సోమవారం ఉదయానికి దేశవ్యాప్తంగా కొవిడ్‌-19 కేసుల సంఖ్య 415కు చేరినట్లు భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్‌) తాజాగా ప్రకటించింది. దేశవ్యాప్తంగా 17,493 మంది వ్యక్తుల నుంచి 18,383 శాంపిల్స్‌ సేకరించి కరోనా పరీక్షలు నిర్వహించామని వెల్లడించింది. ఈ వైరస్‌పై పరిశోధనలు ముమ్మరం చేసిన ఐసీఎంఆర్‌, ఇప్పటి వరకు దేశంలో కరోనా వైరస్‌ రెండో దశలోనే ఉందని పలుమార్లు స్పష్టం చేసింది. అయితే, ఈ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండడంతో రెండో దశపై మరికొన్ని రోజుల్లో ఐసీఎంఆర్‌ కీలక ప్రకటన చేసే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. మరోవైపు కొవిడ్‌-19 బారినపడిన 68ఏళ్ల వ్యక్తి కోలుకున్న అనంతరం చనిపోయిన ఘటన ముంబయిలో చోటుచేసుకుంది. 

అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం..

జపాన్‌ మార్కెట్‌ మినహా మిగిలిన ఆసియా మార్కెట్లు భారీ నష్టాల్లో ట్రేడవుతుండటంతో ఆ ప్రభావం కూడా మార్కెట్లపై పడింది. దక్షిణ కొరియా మార్కెట్లది కూడా ఇదే పరిస్థితి నెలకొంది.  అమెరికాలో  డొజోన్స్‌ ఫ్యూచర్స్‌ పతనమైంది. ఆ ప్రభావం దేశీయమార్కెట్లపై పడింది. 

అమెరికా బెయిలౌట్‌ ప్యాకేజీపై సందిగ్ధత..

అమెరికాకు ట్రిలియన్‌ డాలర్ల ఉద్దీపన ప్యాకేజీ ఆమోదంపై తీవ్రమైన ఉత్కంఠ నెలకొనడంతో అక్కడి ఫ్యూచర్‌ మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. అక్కడ వైద్యసేవలకు నిధులు అవసరమైన సమయంలో జాప్యం చేయకుండా మంజూరు చేయాలనే డిమాండ్లు నెలకొన్నాయి. కీలకమైన ఓట్లను ఇది ఇంకా సాధించలేదనే ప్రచారంతో అక్కడ ఆందోళన నెలకొంది. 

రూపాయి పతనం..

డాలర్‌తో పోల్చుకొంటూ రూపాయి విలువ పతనమైంది. ఒక్క డాలర్‌కు రూ.76.09 వద్దకు చేరుకోవడంతో ఎఫ్‌ఐఐల విక్రయాలపై ఆందోళనలు నెలకొన్నాయి. ఇప్పటికే ఎఫ్‌పీఐలు కూడా రూ.50వేల కోట్ల మేరకు స్టాక్స్‌ విక్రయించారు. 

పూర్తిగా ప్రభావం చూపని సెబీ నిబంధనలు

ఇటీవల సెబీ ఆదేశాల వల్ల ఎఫ్‌ఐఐలు, డీఐఐలకు ప్రస్తుతం షార్ట్‌సెల్లింగ్‌కు అవకాశం లేకుండా పోయింది. కాబట్టి మార్కెట్‌ హెచ్చుతగ్గులపై ప్రభావం చూపుతోందే కానీ.. మార్కెట్‌ ట్రెండ్‌ను మార్చలేకపోయింది. ఇప్పటి వరకు సెబీ ఆశించినట్లుగా హెచ్చుతగ్గులైతే పరిమితంగానే ఉన్నాయి. విక్రయించే ట్రెండింగ్‌లో మార్పులేదు.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.