
తాజా వార్తలు
మా కరోనా వ్యాక్సిన్ విభిన్నం.. కోడాజెనిక్స్
ముక్కు ద్వారా ఇచ్చే వ్యాక్సిన్ తయారీ ప్రారంభించిన ఎస్ఐఐ
దిల్లీ: ముక్కు ద్వారా ఇచ్చే కరోనా వైరస్ వ్యాక్సిన్ తయారీని భారత్లో సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్ఐఐ) ప్రారంభించింది. ‘సీడీఎక్స్ 005’ అనే ఈ వ్యాక్సిన్, ఇంజక్షన్ రూపంలో కాకుండా ముక్కు ద్వారా ఇచ్చేందుకు అనువుగా ఉంటుందని అమెరికన్ ఫార్మా సంస్థ కోడాజెనిక్స్ ప్రకటించింది. అంతేకాకుండా ఈ వ్యాక్సిన్ మానవ ప్రయోగాలు ఈ సంవత్సరాంతానికల్లా బ్రిటన్లో ప్రారంభం కానున్నట్టు సంస్థ వివరించింది.
ఈ ఔషధానికి సంబంధించి జంతువులపై జరిపిన ప్రీ క్లినికల్ దశ ప్రయోగాలు విజయవంతమైనట్టు కోడాజెనిక్స్ తెలిపింది. ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సిన్ తయారీదారైన సీరం ఇన్స్టిట్యూట్ ఆర్థిక, సాంకేతిక సహాయంతో.. వ్యాక్సిన్ తయారీలో 2020 సంవత్సరాంతం లోపే విజయం సాధిస్తామని కోడాజెనిక్స్ సీఈఓ రాబర్ట్ కోల్మన్ వివరించారు.
ఈ వ్యాక్సిన్ విభిన్నం..
సీడీఎక్స్ 005 వ్యాక్సిన్ తయారీకి తాము ఉపయోగించే లైవ్ ఎటెన్యుయేటెడ్ విధానం.. ఇతర వ్యాక్సిన్ల కంటే భిన్నమైనదని కోల్మన్ వివరించారు. ఆయా వ్యాక్సిన్లు స్పైక్ ప్రొటీన్పైనే దృష్టి కేంద్రీకరిస్తాయని ఆయన అన్నారు. మరింత ప్రభావవంతంగా పనిచేయటంతో పాటు.. ముక్కు ద్వారా ఉపయోగించే వీలుండటంతో తమ వ్యాక్సిన్ వినియోగించేందుకు అనువుగా ఉంటుందన్నారు.
ఇక ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం 150కి పైగా కొవిడ్-19 వ్యాక్సిన్ తయారీ ప్రయోగాలు జరుగుతుండగా.. వాటిలో 38 మానవ ప్రయోగాల దశలో ఉన్నాయి. కాగా, ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం రూపొందిస్తున్న ఆస్ట్రాజెనెకాతో సహా పలు కరోనా నిరోధక వ్యాక్సిన్ల తయారీకి సీఐఐ కృషి చేస్తోంది.