close

తాజా వార్తలు

Published : 26/09/2020 01:10 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

పెన్నా ప్రతాప్‌రెడ్డి దరఖాస్తును తేల్చండి

డీఆర్‌టీకి హైకోర్టు ఆదేశం

రూ.77.85 కోట్ల పూచీకత్తు సమర్పించడానికి గడువు

ఈనాడు, హైదరాబాద్‌: ఆన్‌రాక్‌ అల్యూమినియం లిమిటెడ్‌ రుణానికి సంబంధించి రూ.77.85 కోట్ల హామీ సమర్పించాలంటూ ఇచ్చిన ఆదేశాలపై పెన్నా ప్రతాప్‌రెడ్డి దాఖలు చేసే దరఖాస్తును సత్వరం పరిష్కరించాలంటూ రుణ వసూళ్ల ట్రైబ్యునల్‌-2 (డీఆర్‌టీ)కి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. 15 రోజుల్లోగా తమకు హామీ సమర్పించాలంటూ డీఆర్‌టీ ఇచ్చిన గడువును అక్టోబరు 5 వరకు పొడిగించింది. ఆన్‌రాక్‌కు ఇచ్చిన రుణం వసూళ్లలో భాగంగా అస్సెట్‌ కేర్‌ అండ్‌ రీకన్‌స్ట్రక్షన్‌ ఎంటర్‌ప్రైజెస్‌ (ఎసీఆర్‌ఈ) దాఖలు చేసిన దరఖాస్తుపై విచారించిన డీఆర్‌టీ రుణానికి 15 రోజుల్లో హామీ ఇవ్వాలంటూ వ్యక్తిగత హామీదారు అయిన ప్రతాప్‌రెడ్డికి ఆదేశాలు జారీ చేసింది. లేనిపక్షంలో తాకట్టులోని 1.35 లక్షల పెన్నా సిమెంట్స్‌ ఈక్విటీ వాటాలను జప్తు చేయాల్సి ఉంటుందని ఉత్తర్వులిచ్చింది. వీటిని సవాలు చేస్తూ పి.ప్రతాప్‌రెడ్డి హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్‌ ఎం.ఎస్‌.రామచంద్రరావు, జస్టిస్‌ టి.అమర్‌నాథ్‌గౌడ్‌ల ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్‌ తరఫు న్యాయవాది విక్రమ్‌ పూసర్ల వాదనలు వినిపిస్తూ ఆన్‌రాక్‌ కంపెనీ రుణానికి పిటిషనర్‌ వ్యక్తిగత హామీ ఇచ్చారన్నారు. రుణానికి సంబంధించి ఓటీఎస్‌ (ఏకకాలంలో పరిష్కారం) ఎస్‌బీఐతో కూడిన బ్యాంకుల కన్సార్టియం అంగీకరించిందన్నారు. రూ.1275 కోట్ల ఓటీఎస్‌కు 94.80 శాతం వాటా ఉన్న రుణదాతలు అంగీకరించారన్నారు. ఇందులో భాగంగా రూ.400 కోట్లను చెల్లించిందని, కొవిడ్‌ నేపథ్యంలో మిగిలిన మొత్తాన్ని చెల్లించడానికి గడువు కోరినట్లు తెలిపారు. దీంతో ఎస్‌బీఐ దివాలా ప్రక్రియ నిమిత్తం ఎన్‌సీఎల్‌టీలో దాఖలు చేసిన దరఖాస్తును ఉపసంహరించుకుందన్నారు. లక్ష్మీ విలాస్‌ బ్యాంకు నుంచి ఆన్‌రాక్‌ రుణం తీసుకుందని, ఈ రుణాన్ని ఎసీఆర్‌ఈ స్వీకరించి ప్రస్తుతం డీఆర్‌టీని ఆశ్రయించిందన్నారు. ఈ ఏడాది జూన్‌ 15న జరిగిన రుణదాతల సమావేశంలో ఇది కూడా పాల్గొందని, ఓటీఎస్‌కు రుణదాతలు అంగీకరించిన విషయం కూడా తెలుసన్నారు. ఓటీఎస్‌ విషయాన్ని తొక్కిపెట్టి డీఆర్‌టీని ఆశ్రయించిందన్నారు. వాదనలను విన్న ధర్మాసనం ఈ వివాదాన్ని డీఆర్‌టీలోనే తేల్చుకోవాలంది. 15 రోజుల్లో హామీ ఇవ్వాలన్న ఉత్తర్వులను తొలగించాలంటూ పిటిషనర్‌ దాఖలు చేసే దరఖాస్తును అక్టోబరు 5లోగా పరిష్కరించాలంటూ డీఆర్‌టీని ఆదేశిస్తూ పిటిషన్‌పై విచారణను ముగించింది.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని