close

తాజా వార్తలు

Published : 09/11/2020 22:20 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

రోహిత్‌ను అధిగమించిన శిఖర్‌ ధావన్‌

అత్యధిక పరుగుల జాబితాలో నాలుగో స్థానం..

ఇంటర్నెట్‌డెస్క్‌: యూఏఈలో జరుగుతున్న టీ20 మెగా క్రికెట్‌ లీగ్‌ ఆఖరి దశకు చేరుకుంది. గతరాత్రి దిల్లీ, హైదరాబాద్‌ తలపడిన మ్యాచ్‌లో శ్రేయస్‌ టీమ్‌ 17 పరుగుల తేడాతో గెలుపొందడమే కాకుండా టోర్నీ చరిత్రలో తొలిసారి ఫైనల్స్‌కు చేరింది. ఈ నేపథ్యంలోనే మంగళవారం డిఫెండింగ్‌ ఛాంపియన్స్‌ ముంబయితో పోటీపడేందుకు ఆ జట్టు ఆసక్తిగా ఎదురుచూస్తోంది. అయితే, అబుదాబి వేదికగా ఆదివారం జరిగిన మ్యాచ్‌లో దిల్లీ ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ (78) పరుగులతో రాణించడమే కాకుండా ఈ సీజన్‌లో నాలుగో అర్ధశతకాన్ని నమోదు చేశాడు. అలాగే ఈ అర్ధ శతకంతోనే గబ్బర్‌ ఈ మెగా టోర్నీలో మొత్తం 5,182 పరుగులు చేశాడు. దాంతో అత్యధిక పరుగుల జాబితాలో ముంబయి కెప్టెన్‌ రోహిత్‌ శర్మను అధిగమించాడు.  

ఈ మ్యాచ్‌ కన్నా ముందు రోహిత్‌(5,162) పరుగులతో నాలుగో స్థానంలో కొనసాగుతుండగా, ధావన్‌ (5,104) పరుగులతో ఐదో స్థానంలో నిలిచాడు. హైదరాబాద్‌పై రెచ్చిపోవడంతో ధావన్‌.. హిట్‌మ్యాన్‌ను వెనక్కినెట్టి నాలుగో స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. మరోవైపు ఈ ఇద్దరు బ్యాట్స్‌మెన్‌ తుదిపోరులో బరిలోకి దిగుతుండడంతో ఎవరు పైచేయి సాధిస్తారనే విషయం ఆసక్తిగా మారింది. వీరికన్నా ముందు కోహ్లీ (5,878) అగ్రస్థానంలో కొనసాగుతుండగా, సురేశ్‌ రైనా (5,368), డేవిడ్‌ వార్నర్‌ (5,254) పరుగులతో రెండు, మూడులో నిలిచారు. ఇదిలా ఉండగా, ధావన్‌ ఈ సీజన్‌లో అద్భుతంగా రాణించాడనే సంగతి తెలిసిందే. మొత్తం 16 మ్యాచ్‌లు ఆడిన అతడు 46.38 సగటుతో 603 పరుగులు చేశాడు. అందులో రెండు శతకాలుండటం విశేషం. ఇలా ఒక సీజన్‌లో 600 మార్కును దాటడం కూడా అతడికిదే తొలిసారి.



Tags :

స్పోర్ట్స్

జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని