Oxygen Shortage: ఆస్పత్రుల్లో మృత్యుఘోష
close

తాజా వార్తలు

Updated : 02/05/2021 09:08 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Oxygen Shortage: ఆస్పత్రుల్లో మృత్యుఘోష

దిల్లీలో ప్రాణవాయువు కొరతతో 12 మంది మృతి
వారిలో ఒకరు వైద్యుడు
గుజరాత్‌ అగ్నిప్రమాదంలో 18 మంది దుర్మరణం

దిల్లీ, భరూచ్‌: ఆసుపత్రులే మృత్యువేదికలయ్యాయి. ప్రాణవాయువు కొరతతో ఒకచోట, అగ్నిప్రమాదంతో మరోచోట కరోనా రోగులు అసువులు బాశారు. ఒక దగ్గర ఊపిరితీసేందుకు అవకాశమే లేకపోగా, ఇంకోదగ్గర పొగ కారణంగా ఉక్కిరిబిక్కిరయి శ్వాస తీసుకోలేకపోయారు. మొత్తంగా 30 మంది ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోయాయి. ఇలా కన్నుమూసిన వారిలో ఒక వైద్యుడు, ఇద్దరు నర్సులు ఉండడం విషాదకరం. దేశ రాజధానిలో ఆక్సిజన్‌ కొరతతో వైద్యుడు సహా 12 మంది కరోనా రోగులు మరణించగా, గుజరాత్‌లోని భరూచ్‌లోని ఆసుపత్రిలో అగ్నిప్రమాదం జరిగి ఇద్దరు నర్సులు సహా 18 మంది మృతి చెందారు. దిల్లీలోని దారుణం శనివారం పగలు 12.30 గంటల సమయంలో జరగగా, గుజరాత్‌లో అర్ధరాత్రి ఒంటిగంట(తెల్లవారితే శనివారం)కు చోటు చేసుకుంది. రాజధానిలోని బాత్రా హాస్పిటల్‌లో విషాదం, భరూచ్‌లోని పటేల్‌ వెల్ఫేర్‌ హాస్పిటల్‌లో ప్రమాదం సంభవించాయి.
80 నిమిషాల పాటు ఆక్సిజన్‌ లేక...
ప్రాణవాయువు కొరత దిల్లీని పీడిస్తూనే ఉంది. నిల్వలు లేక దాదాపు 80నిమిషాల పాటు ఆక్సిజన్‌ అందించలేకపోవడంతో బాత్రా ఆసుపత్రిలో 12 మంది కరోనా రోగులు మరణించారు.  కరోనా సోకి 15 రోజులుగా చికిత్స పొందుతున్న అదే ఆసుపత్రి గ్యాస్ట్రోఎంట్రాలజీ విభాగం అధిపతి డాక్టర్‌ ఆర్‌.కె.హిమ్‌థానీ కూడా ఆక్సిజన్‌ అందక కన్నుమూశారు. ఆక్సిజన్‌ నిల్వలు తగ్గుతున్నట్టు గుర్తించిన ఆసుపత్రి యాజమాన్యం శనివారం ఉదయమే అధికారులకు ‘ఎస్‌ఓఎస్‌’ (సేవ్‌ అవర్‌సోల్స్‌ - మా ప్రాణాలు కాపాడండి) సందేశాన్ని పంపించింది. 2,500 లీటర్ల ఆక్సిజన్‌ ఉన్నప్పుడే పరిస్థితిని గమనించి అధికార్లకు సమాచారం ఇచ్చింది. 12.30గంటల సమయంలో నిల్వలు పూర్తిగా తరిగిపోయి పరిస్థితి చేయిదాటిపోయింది. మధ్యాహ్నం 1.35 గంటలకు ఆక్సిజన్‌ ట్యాంకర్‌ వచ్చింది.
మరికొన్ని ఆసుపత్రుల ‘ఎస్‌ఓఎస్‌’..
ఆక్సిజన్‌ నిల్వలు లేకపోవడంతో రోగులను చేర్చుకోవడం లేదని వసంత్‌కుంజ్‌లోని ఫోర్టిస్‌ ఆసుపత్రి ప్రకటించింది. అక్కడ ప్రస్తుతం 106మంది రోగులు చికిత్స పొందుతున్నారు. తక్షణమే ఆక్సిజన్‌ పంపించాలంటూ మీరాబాగ్‌లోని సెహగల్‌ నియో ఆసుపత్రి ‘ఎస్‌ఓఎస్‌’ పంపించింది. అక్కడ మొత్తం 90మందికి ఆక్సిజన్‌ ఎక్కిస్తున్నారు. మరో 13మంది ఐసీయూలో ఉన్నారు. ఆక్సిజన్‌లేక గత 8రోజుల్లో మొత్తం 57 మంది మరణించారు.

పడకలపైనే సజీవ దహనం
భరూచ్‌లో ఓ స్వచ్ఛంద సంస్థ నిర్వహిస్తున్న ‘పటేల్‌ వెల్ఫేర్‌ హాస్పిటల్‌’లో అగ్ని ప్రమాదం జరిగి 18 మంది మరణించారు. వీరిలో 16 మంది కొవిడ్‌ రోగులుకాగా మిగిలిన ఇద్దరు నర్సులు. విద్యుత్తు షార్ట్‌సర్య్కూటే ప్రమాదానికి కారణమని గుర్తించారు. నాలుగు అంతస్తులు ఉన్న ఈ భవనంలో 50 మంది చికిత్స పొందుతున్నారు. అర్ధరాత్రి ఒంటిగంటకు ఐసీయూలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ దుర్ఘటనపై న్యాయ విచారణకు గుజరాత్‌ ప్రభుత్వం ఆదేశించింది.



Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని