
తాజా వార్తలు
సింధుకు సులువు.. సైనాకు కఠినం
దిల్లీ: థాయ్‌లాండ్‌లో జనవరిలో జరుగనున్న బ్యాడ్మింటన్ టోర్నీల్లో పీవీ సింధుకు సులువైన డ్రా లభించింది. మరో సీనియర్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్‌కు కఠిన సవాళ్లు ఎదురయ్యాయి. కొవిడ్-19 వల్ల పది నెలలు ఆగిపోయిన బ్యాడ్మింటన్ మళ్లీ మొదలవుతున్న సంగతి తెలిసిందే. మధ్యలో డెన్మార్క్ ఓపెన్, సార్లోర్లక్స్ ఓపెనర్లు జరిగినా వీరిద్దరూ అందులో పాల్గొనలేదు.
బ్యాడ్మింటన్ ఆరంభం అవుతుండటంతో అందరి చూపూ థాయ్‌లాండ్‌లో జరుగుతున్న రెండు సూపర్ 1000 టోర్నీలపై పడింది. జనవరి 12-17 వరకు యోనెక్స్ థాయ్‌లాండ్ ఓపెన్, 19-24 వరకు టొయాటొ థాయ్‌లాండ్ ఓపెన్ జరుగుతున్న సంగతి తెలిసిందే. మొదటి ఓపెన్‌లో ఆరో సీడ్‌గా బరిలోకి దిగుతున్న సింధు తొలిపోరులో డెన్మార్క్ అమ్మాయి మియా బ్లిచ్‌ఫెల్ట్‌తో తలపడనుంది. సైనా తొలిరౌండ్లో నొజొమి ఒకుహర (జపాన్)తో పోటీపడనుంది. ఇక రెండో టోర్నీలో బుసానన్ ఒంగ్బమ్రంగ్ఫన్ (థాయ్)తో సింధు, రచనోక్ ఇంతానన్‌తో సైనా తలపడాల్సి వస్తోంది.
పురుషుల సింగిల్స్‌కు వస్తే మాజీ ప్రపంచ నంబర్‌వన్ కిదాంబి శ్రీకాంత్, సాయిప్రణీత్, లక్ష్యసేన్ రెండు టోర్నీల్లో పాల్గొంటున్నారు. మొదట శ్రీకాంత్ తన సహచరుడైన సౌరభ్వర్మను ఎదుర్కోనుండటం గమనార్హం. లక్ష్యసేన్ ఇండోనేసియా షెసర్ హరెన్ రుస్తవిటొతో తలపడనున్నాడు. ఇక ప్రణీత్ స్థానిక ఆటగాడు కంటఫోన్ వాంగ్చరోన్తో ఆడనున్నాడు. మలేసియా షట్లర్ లీ జి జియాతో ప్రణయ్, జపాన్ ఆటగాడు కెంటా నిషిమోటోతో పారుపల్లి కశ్యప్, షెసర్ హరెన్తో సమీర్ వర్మ పోటీపడనున్నారు. రెండో టోర్నీలో సిత్తికోమ్ తమ్మసిన్తో శ్రీకాంత్, డారెన్ లియూతో ప్రణీత్, చౌ టీన్ చెన్‌తో లక్ష్యసేన్ తలపడనున్నారు.
ఇవీ చదవండి
రోహిత్ వచ్చేశాడు! మరి జట్టులో మార్పులేంటి?
ఆసీస్ జట్టులో భారీ మార్పులు