మనో తొలిసారి రజనీకి డబ్బింగ్‌ చెప్పిన చిత్రమదే!
close

తాజా వార్తలు

Published : 16/09/2020 01:29 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మనో తొలిసారి రజనీకి డబ్బింగ్‌ చెప్పిన చిత్రమదే!

ఇంటర్నెట్‌డెస్క్‌: అగ్ర కథానాయకుడు రజనీకాంత్‌ సినిమా వస్తుందంటే తమిళంతో పాటు తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తారు. ఆయన స్టైల్‌, డైలాగ్‌ డెలివరీ విధానం విశేషంగా ఆకట్టుకుంటాయి. గతంలో రజనీ నటించి తమిళ చిత్రాలకు తెలుగులో పలువురు డబ్బింగ్‌ చెప్పారు. అయితే, గాయకుడు మనో డబ్బింగ్‌ స్టైల్‌ తెలుగులో రజనీకాంత్‌ చిత్రాలకు సరికొత్త వన్నె తెచ్చింది. రజనీ స్టైల్‌కు సరిపోయేలా మనో డైలాగ్‌ పలికే విధానం ఇక్కడ ప్రేక్షకులను అలరిస్తోంది. అసలు తొలిసారి మనో.. రజనీ నటించిన ఏ చిత్రానికి డబ్బింగ్‌ చెప్పారో తెలుసా? ‘ముత్తు’. ఆ సినిమాకు డబ్బింగ్‌ చెప్పే అవకాశం రావడం వెనుక ఉన్న కథను మనో ఓ సందర్భంలో పంచుకున్నారు.

‘‘రజనీకాంత్‌గారికి రెండు సీన్లకు డబ్బింగ్‌ చెప్పినా సరదాగా ఉంటుంది. ‘ముత్తు’ సినిమాలో ముసలి రజనీకాంత్ పాత్రకు డబ్బింగ్‌ చెప్పమని అడిగారు. నేనూ సరేనన్నా. కేవలం రెండు సీన్లకు మాత్రమే డబ్బింగ్‌ చెప్పా. అది విని రజనీగారి ఆఫీస్‌ నుంచి ఫోన్‌ వచ్చింది. ‘ఎప్పటి నుంచి పూర్తిగా డబ్బింగ్‌ చెబుతారు’ అని అడిగారు. ‘సర్‌కు నచ్చిందా’ అన్నాను. ‘ఆయన చాలా సంతోషపడ్డారు. మీ డైలాగ్‌ డెలివరీలో షార్ప్‌నెస్‌ ఆయనకు నచ్చింది’ అన్నారు. అలా రెండు పాత్రలకు 10రోజులు డబ్బింగ్‌ చెప్పా. అది సూపర్‌ డూపర్‌ హిట్‌ అయింది. అక్కడి నుంచి దాదాపు రజనీ సినిమాలకు నేను డబ్బింగ్‌ చెబుతూ వచ్చాను. ‘శివాజీ’లో నేను డబ్బింగ్‌ చెప్పిన తర్వాత రజనీ ఫోన్‌ చేసి మరీ అభినందించారు’’ అని మనో చెప్పుకొచ్చారు.

‘ప్రేమికుడు’లో ముక్కాలా పాటకు అదే స్ఫూర్తి!

ఇక శంకర్‌-ప్రభుదేవా కాంబినేషన్‌లో వచ్చిన ‘ప్రేమికుడు’ చిత్రానికి ఏఆర్‌ రెహమాన్‌ స్వరాలు సమకూర్చారు. అందులోని అన్ని పాటలూ సూపర్‌హిట్‌. వీటిలో ‘ముక్కాలా.. ముక్కాబులా’ పాట వెనుకా ఓ కథ ఉంది. ‘‘ఒకరోజు రెహమాన్‌ నుంచి ఫోన్‌ వచ్చింది. పాట పాడాలని అడిగారు. నేను ఉదయమంతా వేరే స్టూడియోల్లో పాటలు పాడి అలసిపోయాను. రెహమాన్‌ ఉదయం పూట నిద్రపోయి రాత్రి స్టూడియోకు వస్తారు. ఆయన స్టైల్‌ అది. ఆ రోజు నేను రాత్రి 11గంటలకు స్టూడియోకు వెళ్లా. అప్పటికి లిరిక్స్‌ రాస్తున్నారు. నన్ను వెయిట్‌ చేయమన్నారు. నేను స్టూడియో దగ్గరిలో ఉన్న హోటల్‌కు వెళ్లి, పరోటా తిని వచ్చి సోఫాలో కూర్చొన్నా. నిద్ర పట్టేసింది. అర్ధరాత్రి 1.45కు రెహమాన్‌ పిలిచారంటూ కుర్రాడు వచ్చాడు. నేను నిద్రమత్తులో ఉన్నా. కళ్లు తుడుచుకుని స్టూడియోలోకి వెళ్లా. మెక్సికన్‌ స్టైల్‌లో పాట ఉంటుందని చెప్పారు. విభిన్నంగా పాడాలని నన్ను అడిగారు. ఎన్ని విధాలా పాడిన ఆయనకు నచ్చలేదు. ఘంటసాల, టి.ఎన్‌.సౌందరాజన్‌ ఇలా చాలా మంది స్టైల్‌లో పాడాను. ఎవరిదీ నచ్చలేదు. ‘మీరు అరిచినట్లు ఉండాలి. అలాగే అరిచినట్లు ఉండకూడదు’ అని రెహమాన్‌ అన్నారు. ‘సర్.. నాకు కొంచెం టైమ్‌ ఇవ్వండి. కిందకు వెళ్లి టీ తాగి వస్తా’ అని చెప్పా. బయటకు వచ్చి టీ తాగుతుంటే బయట ఎక్కడి నుంచో ‘మెహబూబా.. మెహబూబా’ అంటూ ఆర్డీ బర్మన్‌ పాడిన పాట వినిపించింది. సగం టీ తాగి, పైకి వెళ్లి ఆర్డీ బర్మన్‌ స్టైల్‌లో గొంతుమార్చి పాడాను. ఆయనకు నచ్చి, మొత్తం పాట పాడించారు. మ్యూజిక్‌ లేకుండా 20 నిమిషాల్లో పాట పాడేశాను. 10 రోజుల తర్వాత నేను పాడిన పాట వింటే అద్భుతంగా ఉంది. రెహమాన్‌ నిజంగా మేజిక్‌ చేశారు’’ అని మనో ఆనాటి సంగతులను గుర్తు చేసుకున్నారు.
Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని