
తాజా వార్తలు
ఛిద్రమైన నా జీవితంలో వెలుగు నింపిన వ్యక్తి: సునీత
ఎస్పీబీ మృతి పట్ల గాయకుల ఆవేదన
హైదరాబాద్: గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఎంతో మంది సంగీత కళాకారులకు మార్గం చూపించారని, ఆయన మరణం తీవ్రంగా బాధిస్తోందని సినీ గాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ‘పాడుతా తీయగా..’ కార్యక్రమం ద్వారా తమను వెలుగులోకి తీసుకొచ్చిన ఘనత బాలుదేనని గుర్తు చేసుకున్నారు. ‘ఛిద్రమైన నా జీవితంలో వెలుగులు నింపిన వ్యక్తి. నాకు పాట మీద ప్రేమ కలిగించి, పాడాలనే తపన పెంచి, నా బాగోగులు గమనిస్తూ.. నాకు బాసటగా నిలుస్తూ.. జీవితం మీద మమకారం పెంచిన నా ఆత్మ బంధువు. నా మావయ్య. భౌతికంగా లేరు అంతే...’ అని గాయని సునీత ఫేస్బుక్లో పోస్ట్ చేశారు.
‘బాలు గారు నా జీవితంలో చాలా ముఖ్యమైన పాత్ర పోషించారు. కొత్త గాయకుల్ని చిత్ర పరిశ్రమకు పరిచయం చేయాలనే ఉద్దేశంతో ‘పాడుతా తీయగా’ లాంటి వేదికను ఏర్పాటు చేశారు. దాని ద్వారా నాలాంటి ఎంతో మందిని పరిచయం చేశారు. ఆయన నా కెరీర్‌ను ఎంతో ప్రభావితం చేశారు. గొప్ప గాయకుడే కాదు.. వ్యక్తి కూడా. ఆయన మనల్ని వదిలి.. ఎక్కడికో వెళ్లిపోయారని నేను అనుకోవడం లేదు. ఆయన ఎప్పుడూ మనతోనే ఉంటారు’- స్మిత, గాయని
‘మా గాయ కులానికి పెద్ద దిక్కు ఆయన. తెలుగు భాష కోసం ఎంతో పాటుపడేవారు. ఆయన అంకితభావంతో మాలో స్ఫూర్తి నింపారు. అవన్నీ ఇవాళ జ్ఞాపకం వస్తున్నాయి. నా కూతుర్ని ఎత్తుకుని.. ‘పాపను కూడా ‘పాడుతా తీయగా..’కు పంపు. తను కూడా గాయని అవుతుంది’ అన్న మాటలు ఎప్పటికీ మర్చిపోలేను. ఈ చేదు వార్తను టీవీలో చూసినా.. నమ్మాలి అనిపించడం లేదు’- మాళవిక, గాయని
‘ఆయన పాటే కాదు.. మాటలో కూడా చెప్పలేనంత ఆప్యాయత ఉంటుంది. అలాంటి వ్యక్తిని ఇవాళ మిస్ అయ్యాం. ఆయన పుట్టిన శకంలో మనం పుట్టడం, ఆయన పాట వినడం, మాట వినడం అదృష్టం. ఆయన లైవ్‌లో పాడటం, ఆయనతో వేదిక పంచుకోవడం నా జన్మజన్మల అదృష్టం’- అంజనా సౌమ్య, గాయని
‘బాలుకు మరణం లేదు. ఆయన కుటుంబంలో మేమంతా భాగం అయినందుకు దేవుడికి ధన్యవాదాలు చెప్పాలి. పాట గురించి పక్కన పెడితే.. తోటి వ్యక్తిని ఎలా పలకరించాలి, ఎలా మాట్లాడాలి.. ఇవన్నీ బాలు గారి దగ్గర నేర్చుకున్నాం’- శ్రీకృష్ణ, గాయకుడు
‘తెలుగు సినిమా పాట అంటే గుర్తొచ్చే గాయకులు బాలు గారు. అలాంటి ఆయన ఇప్పుడు మన దగ్గర లేరు. ఆయన ఎన్నో వేల పాటలకు ప్రాణం పోసి, మన మధ్యకు తీసుకొచ్చారు. ఆయన ఏ లోకంలో ఉన్నా.. మనల్ని ఆశీర్వదిస్తూనే ఉంటారు’- కృష్ణ చైతన్య, గాయకుడు
‘50 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణం. 40 వేల పాటలు, 16 భాషల్లో పాడటం ఒక్క బాలు గారికే సాధ్యమైంది. 35 ఏళ్లుగా ఆయనతో కలిసి ప్రయాణం చేస్తున్నా. ఇవాళ ఆయన మరణవార్త నన్నెంతో కలచివేసింది’- వందేమాతరం శ్రీనివాస్, గాయకుడు
సినిమా
రాజకీయం
జనరల్
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
చిత్ర వార్తలు
సినిమా
- ఆప్త నేస్తాలు.. ఆఖరి మజిలీ!
- ‘నా మృతదేహాన్ని వాటికి ఆహారంగా వేయండి’
- క్షమించు నాన్నా..నిను వదిలి వెళ్తున్నా!
- రోహిత్‌ను సరదాగా ట్రోల్ చేసిన డీకే
- కన్నీటి పర్యంతమైన మోదీ
- చరిత్ర సృష్టించిన నయా యార్కర్ కింగ్
- సికింద్రాబాద్‌లో భారీగా బంగారం చోరీ
- కంగారూను పట్టలేక..
- ప్రధాని సూచన మేరకే ఆ నిర్ణయం: కేటీఆర్
- రెరా మధ్యే మార్గం
ఎక్కువ మంది చదివినవి (Most Read)
