
తాజా వార్తలు
చైనా టీకా: ఇప్పటికే 10లక్షల మందికి పంపిణీ!
తుదిదశ ప్రయోగాలు పూర్తికాకముందే..
అత్యవసర వినియోగం కింద భారీ సంఖ్యలో టీకాలు
బీజింగ్: కరోనా వ్యాక్సిన్ కోసం ప్రపంచ దేశాలు ఎదురుచూస్తున్న వేళ..చైనా మాత్రం ఈ విషయంలో దూసుకెళ్తోంది. ఇప్పటికే అక్కడ దాదాపు పదిలక్షల మందికి కరోనా టీకా ఇచ్చినట్లు చైనా నేషనల్ ఫార్మా గ్రూప్(సినోఫార్మ్) వెల్లడించింది. వ్యాక్సిన్ అత్యవసర వినియోగం కింద భారీ ఎత్తున టీకా పంపిణీ చేపట్టినట్లు సినోఫార్మ్ తెలిపింది.
యావత్ ప్రపంచాన్ని పట్టిపీడిస్తోన్న కరోనా మహమ్మారిని ఎదుర్కొనే టీకా కోసం విశ్వవ్యాప్తంగా ముమ్మర కృషి జరుగుతోంది. ఇప్పటికే చాలా వ్యాక్సిన్లు తుది ప్రయోగదశకు చేరుకున్నాయి. చైనాలోనూ మూడు వ్యాక్సిన్లు తుది దశ క్లినికల్ ట్రయల్స్‌లో నిమగ్నమయ్యాయి. ఇలా ప్రయోగాలు కొనసాగుతున్న సమయంలోనే అత్యవసర వినియోగం కింద అత్యవసర పనులకు వెళ్లే వారితోపాటు మరికొన్ని గ్రూపులకు ప్రయోగ టీకాలను అందిస్తోంది. జులై నెలలోనే ప్రారంభించిన ఈ పంపిణీ కార్యక్రమం ద్వారా ఇప్పటివరకు పదిలక్షల మందికి టీకా ఇచ్చినట్లు సినోఫార్మ్ వెల్లడించింది.
అయితే, ప్రయోగదశలో ఉన్న వ్యాక్సిన్ సమర్థత, సురక్షితంపై పూర్తిస్థాయి సమాచారం లేకుండానే భారీస్థాయిలో టీకా పంపిణీ చేపట్టడంపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. తాజాగా దీనిపై సినోఫార్మ్ స్పందించింది. తుది దశ ప్రయోగాలు పూర్తికానప్పటికీ, అత్యవసర వినియోగం కింద ఇప్పటివరకు వ్యాక్సిన్ తీసుకున్నవారిలో ఎవరికీ తీవ్ర అనారోగ్య సమస్యలు తలెత్తలేదని సినోఫార్మ్ ఛైర్మన్ లియూ జింగ్సేన్ అభిప్రాయపడ్డారు.
మూడోదశ క్లినికల్ ట్రయల్స్‌లో ఉన్న ఈ వ్యాక్సిన్లను దాదాపు 60వేల మంది వాలంటీర్లపై ప్రయోగిస్తున్నట్లు సినోఫార్మ్ తెలిపింది. వీరికి టీకాలను రెండు డోసుల్లో ఇస్తున్నారు. ఇలా ఇప్పటివరకు రెండో డోసు తీసుకున్న 40వేల మందికిపైగా రక్త నమూనాలను సేకరించినట్లు సినోఫార్మ్ ఛైర్మన్ వెల్లడించారు. టీకా తీసుకున్న అనంతరం విదేశాలకు వెళ్లిన నిర్మాణ సంస్థల ఉద్యోగులు, దౌత్యాధికారులు, విద్యార్థులు ఎవ్వరు కూడా వైరస్ బారినపడలేదని ఆయన స్పష్టంచేశారు.
చైనా నేషనల్ బయోటెక్ గ్రూపునకు చెందిన సినోఫార్మ్ ఇప్పటికే రెండు వ్యాక్సిన్లను అభివృద్ధిచేసింది. ఇక మరో సంస్థ సినోవాక్ బయోటెక్ తయారుచేసిన వ్యాక్సిన్‌ను కూడా అత్యవసర వినియోగం కింద చైనాలో పంపిణీ చేస్తున్నారు. అయితే, టీకా ప్రభావాన్ని అంచనా వేసే ప్రయోగ ఫలితాల సమాచారం లేకుండానే అత్యవసర వినియోగం కింద భారీస్థాయిలో టీకా పంపిణీ చేయడంపై నిపుణులు హెచ్చరిస్తున్నారు.