close

తాజా వార్తలు

Updated : 25/08/2020 09:44 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

నాన్నను కలిశా.. గుర్తుపట్టారు: ఎస్పీ చరణ్‌

త్వరలోనే మనముందుకు వస్తారు

చెన్నై: ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం వెంటిలేటర్‌పై చికిత్సపొందుతున్నారని.. ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్టు ఆయన తనయుడు ఎస్పీ చరణ్‌ వెల్లడించారు. ఈ రోజే ఆస్పత్రికి వెళ్లి తన తండ్రిని కలిసినట్టు వెల్లడించారు. త్వరలోనే ఆయన క్షేమంగా మనందరి ముందుకు వస్తారని విశ్వాసం వ్యక్తంచేస్తూ ఓ వీడియోను విడుదల చేశారు.

‘‘దాదాపు రెండు వారాల తర్వాత నాన్నను నేను కలిశా. నన్ను చూసి గుర్తు పట్టారు. నాతో కొంచెం మాట్లాడారు. ఎలా ఉన్నారని అడిగాను. ఆయన కోలుకోవాలంటూ అందరూ చేస్తున్న ప్రార్థనల గురించి తెలిపాను. సాధ్యమైనంత త్వరగా కోలుకొని రావాలని కోరుకుంటున్నారని చెప్పాను. బొటన వేలిని పైకి ఎత్తి సంకేతాలు ఇచ్చారు. నేను ఎలా ఉన్నానో అడిగారు? అమ్మ ఎలా ఉన్నారని సంజ్ఞలతోనే అడిగారు. గదిలో ఏర్పాటు చేసిన సంగీతానికి కూడా స్పందిస్తున్నారు. నాన్నను చూసినందుకు ఎంతో సంతోషంగా ఉంది. నన్ను చూసినందుకు ఆయన కూడా సంతోషపడి ఉంటారని అనుకుంటున్నా. ఇకపై తరచుగా వెళ్లి కలుస్తా. నాన్న త్వరగా కోలుకోవాలని ప్రార్థించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు. మా కుటుంబం పట్ల మీ ప్రేమాభిమానాలకు కృతజ్ఞులమై ఉంటాం. నాన్న కచ్చితంగా మన వద్దకు వస్తారు. త్వరలోనే అందరినీ చూస్తారు. ఎంజీఎం ఆస్పత్రి సిబ్బందికి, ఆయన్ను జాగ్రత్తగా చూసుకుంటున్న వైద్య బృందానికి కృతజ్ఞతలు’’ అని తెలిపారు.

మరోవైపు, కరోనాతో పోరాడుతూ చెన్నై ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యం నిలకడగా ఉందని ఎంజీఎం ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ఈ మేరకు హెల్త్‌బులిటెన్‌ విడుదల చేశాయి. ‘‘కరోనాతో బాధపడుతూ ఎంజీఎం హెల్త్‌కేర్‌లో చేరిన ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం ఇంకా వెంటిలేటర్‌, ఎక్మో సహాయంతో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతానికి ఆయన ఐసీయూలోనే ఉన్నారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది. వైద్య నిపుణుల బృందం నిరంతరం ఆయన ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తోంది’’ అని ఎంజీఎం ఆస్పత్రి వెల్లడించింది.



Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

చిత్ర వార్తలు

మరిన్ని

దేవతార్చన