
తాజా వార్తలు
పుణెలో స్పుత్నిక్ టీకా ప్రయోగాలు
పుణె: భారత్‌లో కరోనా వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఇప్పటికే ఆస్ట్రాజెనెకాతో పాటు స్వదేశీ వ్యాక్సిన్ల ప్రయోగాలు తుదిదశకు చేరుకున్నాయి. రష్యాకు చెందిన స్పుత్నిక్-వి వ్యాక్సిన్ ప్రయోగాలు కూడా భారత్‌లో నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా పుణె నగరంలోని నోబెల్ ఆసుపత్రిలో వీటి ప్రయోగాలను ఈ మధ్యే ప్రారంభించారు. గత మూడు రోజులుగా 17 వాలంటీర్లకు కొవిడ్ వ్యాక్సిన్‌ను అందించిన అధికారులు, వారి ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. అయితే, ప్రస్తుతం రెండో దశ ప్రయోగాలు జరుగుతున్నాయని ఆసుపత్రి డైరెక్టర్ డాక్టర్ హెచ్‌కే సాలే వెల్లడించారు. రెండో దశలోనూ వాలంటీర్లకు రెండు డోసుల వ్యాక్సిన్‌ను అందిస్తామని తెలిపారు.
రష్యా తయారు చేసిన స్పుత్నిక్-వి వ్యాక్సిన్‌ను భారత్‌లో సరఫరా చేసేందుకు డాక్టర్ రెడ్డీస్ ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే. అయితే, భారత్‌లో ఏదైనా వ్యాక్సిన్ అందుబాటులోకి తీసుకురావాలంటే, వ్యాక్సిన్‌కు సంబంధించి రెండు, మూడో దశ ప్రయోగాలను ఇక్కడ కూడా నిర్వహించాల్సి ఉంటుంది. ఇందులో భాగంగానే డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ స్పుత్నిక్-వి క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తోంది. అంతేకాకుండా ప్రయోగాల అనంతరం పది కోట్ల డోసులను భారత్‌లో సరఫరా చేసేందుకు రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్టిమెంట్ ఫండ్ (ఆర్డీఐఎఫ్)తో డాక్టర్ రెడ్డీస్ ఒప్పందం కుదుర్చుకుంది. ఇక మరో సంస్థ హెటెరోతోనూ ఏటా పదికోట్ల డోసుల ఉత్పత్తికి స్పుత్నిక్ ఒప్పందం చేసుకుంది. భారత్‌లో స్పుత్నిక్-వి ప్రయోగాలు జరుగుతున్నప్పటికీ.. వీటిని రష్యాలో ఇప్పటికే వేల మందిపై ప్రయోగించారు. క్లినికల్ ట్రయల్స్ ఫలితాల విశ్లేషణలో వ్యాక్సిన్ దాదాపు 92 శాతానికి పైగా సమర్థత కలిగినట్లు రష్యా ఆరోగ్యశాఖ వెల్లడించింది.
ఇవీ చదవండి..
టీకా కోసం తొక్కిసలాట జరగొచ్చు: WHO
భారత్‌లో టీకా వినియోగానికి ఫైజర్ దరఖాస్తు