
తాజా వార్తలు
25లోగా స్లిప్పుల పంపిణీ పూర్తవ్వాలి: ఎస్ఈసీ
హైదరాబాద్: ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులు, సిబ్బందితోపాటు అభ్యర్థుల ఏజెంట్లు పూర్తి స్థాయిలో గోప్యత పాటించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఎన్నికల విధుల్లో గోప్యత విషయమై రాష్ట్ర ఎన్నికల సంఘం పలు ఆదేశాలు జారీ చేసింది. ఓటు హక్కు వినియోగించుకున్న తర్వాత ఓటరు కూడా బ్యాలెట్ పత్రాన్ని ఎవరికీ చూపరాదని, గోప్యంగా ఉంచాలని తెలిపింది. రాష్ట్రంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో కొందరు బ్యాలెట్ పత్రాలను ఫొటోలు తీసిన నేపథ్యంలో పోలింగ్ కేంద్రాల్లోకి సెల్ఫోన్లను అనుమతించరాదని ఎస్ఈసీ స్పష్టం చేసింది. ఎవరైనా ఓటు గోప్యత విషయంలో ఉల్లంఘనకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకోవడమే కాకుండా, మూడు నెలల వరకు జైలు శిక్ష విధించే అవకాశం ఉందని హెచ్చరించింది. జీహెచ్ఎంసీ ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులు, వారి తరఫున ఉండే పోలింగ్ ఏజెంట్ల సంతకాలను సేకరించాలని రిటర్నింగ్ అధికారులను ఎస్ఈసీ ఆదేశించింది. ఈ మేరకు సేకరించిన సంతకాలను ప్రిసైడింగ్ అధికారులకు పంపించాలని.. తద్వారా వారి సంతకాల ధ్రువీకరణ సమస్య ఉత్పన్నం కాదని ఎస్ఈసీ పేర్కొంది.
జీహెచ్ఎంసీ ఎన్నికలకు సంబంధించి ఓటరు స్లిప్పుల పంపిణీని ఈనెల 25లోపు పూర్తి చేయాలని ఎస్ఈసీ ఆదేశాలు జారీ చేసింది. స్లిప్పుల పంపిణీకి డిప్యూటీ కమిషనర్లు, జోనల్ కమిషనర్లు చర్యలు చేపట్టాలని వివరించింది. 100 శాతం ఓటింగ్ స్లిప్పులు పంపిణీ చేయాలని ఎస్ఈసీ సూచించింది. ఓటరు అవగాహన కార్యక్రమాలు చేపట్టినా 2009, 2016 ఎన్నికల్లో పోలింగ్ 50 శాతం మించలేదని గుర్తు చేసింది. ఓటరు స్లిప్పులు సరిగా పంపిణీ జరగనందునే పోలింగ్ శాతం పెరగలేదని ఎస్ఈసీ అభిప్రాయపడింది.
జోనల్, డిప్యూటీ కమిషనర్లు ప్రత్యేకంగా పర్యవేక్షించాలి
ఓటరు స్లిప్పుల పంపిణీని జోనల్, డిప్యూటీ కమిషనర్లు ప్రత్యేకంగా పర్యవేక్షించాలని స్పష్టం చేసింది. డిప్యూటీ మున్సిపల్ కమిషనర్లు తమ పరిధిలోని కనీసం 30శాతం ఇళ్లను, జోనల్ కమిషనర్లు తమ పరిధిలోని కనీసం పదిశాతం ఇళ్లను సందర్శించి ఓటరు స్లిప్పుల పంపిణీ జరిగిందా లేదా అన్న విషయాన్ని ధ్రువీకరించాలని తెలిపింది. ప్రతి వార్డుకు ఒక ఉద్యోగిని కేటాయించి మహిళా సంఘాలు, ఇళ్ల యజమానులను ఫోన్లో సంప్రదించి పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని సూచించింది. ఎక్కడైనా లోపాలు ఉంటే వాటిని గుర్తించి 27వ తేదీలోగా ఆయా ప్రాంతాల్లో ఓటరు స్లిప్పుల పంపిణీ పూర్తి చేయాలని ఆదేశించింది. అధికారులు, పరిశీలకులు ఓటరు స్లిప్పుల పంపిణీని పర్యవేక్షిస్తారని, ఎక్కడైనా నిర్లక్ష్యం వహిస్తే బాధ్యులపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని ఎస్ఈసీ హెచ్చరించింది.