
తాజా వార్తలు
ధోనీ ఇలా చేస్తే.. వచ్చే సీజన్లో మెరుస్తాడు..
వచ్చే సీజన్‌పై సునీల్ గావస్కర్
ఇంటర్నెట్‌డెస్క్: యూఏఈలో జరుగుతున్న టీ20 మెగా క్రికెట్ లీగ్‌లో చెన్నై కథ ముగిసింది. ఇక ఆ జట్టు తదుపరి సీజన్లోనే కనపడనుంది. టోర్నీ ఆరంభం నుంచీ ధోనీసేన ఎన్నడూ ఇలా ప్లేఆఫ్స్‌కు చేరకుండా ఇంటిముఖం పట్టలేదు. ఈసారి కెప్టెన్ ధోనీ సైతం ఫామ్‌లో లేకపోవడం చెన్నైకి నిరాశ కలిగించే అంశం. అయితే, ఇటీవల అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన మహీ దేశవాళీ క్రికెట్లో ఆడాలని దిగ్గజ బ్యాట్స్‌మన్ సునీల్ గావస్కర్ అభిప్రాయపడ్డాడు. వచ్చే సీజన్లో చెన్నై సారథి బ్యాటింగ్‌లో మెరవాలంటే నెట్స్‌లో సాధన ఒక్కటే సరిపోదని, మైదానంలోకి దిగి మ్యాచ్‌లు ఆడితేనే ఒత్తిడిని జయించి రాణించగలడని గావస్కర్ పేర్కొన్నాడు.
ఆదివారం పంజాబ్‌తో చెన్నై చివరి మ్యాచ్ సందర్భంగా టాస్ వేసే సమయంలో వ్యాఖ్యాత డానీ మోరిసన్ ఇదే మీ చివరి సీజనా అని ధోనీని అడిగాడు. అందుకు స్పందించిన అతడు కచ్చితంగా కాదని స్పష్టం చేశాడు. దాంతో చెన్నై అభిమానులకు ఊరట కలిగించాడు. ఇదే విషయంపై స్పందించిన గావస్కర్.. ధోనీ ఆడటం తనకు కూడా సంతోషమని, అతడో ఆకట్టుకునే క్రికెటర్ అని కొనియాడాడు. తన బ్యాటింగ్, కీపింగ్‌తో పాటు నాయకత్వ లక్షణాలతో మహీ మైమరపిస్తాడని చెప్పాడు. ఆన్ ఫీల్డ్, ఆఫ్ ఫీల్డ్ ఎక్కడైనా ధోనీ ఆదర్శంగా ఉంటాడని మెచ్చుకున్నాడు.
‘ధోనీ కచ్చితంగా ఆడాలి. సంగక్కర కూడా ఇంతకుముందే ఇదే విషయం చెప్పాడు. ధోనీ దేశవాళీ క్రికెట్ ఆడాలి. నెట్స్‌లో సాధన చేస్తే సరిపోతుంది కానీ, నిజంగా క్రికెట్ ఆడితేనే బాగుంటుంది. ఎందుకంటే అతడి వయసు ప్రభావం కారణంగా ఆటలో మెరుపు కోల్పోయే ప్రమాదం ఉంది. వయసు పైబడే కొద్ది టైమింగ్‌లో తేడా వస్తుంది. అద్దంలో చూసుకుంటే అంతా బాగున్నట్లే అనిపిస్తుంది. కానీ కాస్త బరువు తగ్గొచ్చు. జిమ్‌కి వెళ్లి ఎంత దృఢంగా మారినా ఆడేటప్పుడు షాట్ల టైమింగ్‌లో తేడా ఉంటుంది. ఇప్పుడు ధోనీ కొన్ని విషయాల్లో జాగ్రత్త పడాలి. అతడు దేశవాళీ క్రికెట్ ఆడాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో అది సాధ్యం కాకపోవచ్చు. దాంతో మనం చేసేదేం లేదు. అతడు క్రికెట్ ఆడితేనే బాగుంటుంది. నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తే ఒత్తిడి ఉండదు. మ్యాచ్‌లు ఆడితేనే ఒత్తిడిని తట్టుకొని రాణిస్తాడు. నిజంగా అలా చేస్తే వచ్చే సీజన్లో 400 పరుగులు చేయడానికి సిద్ధంగా ఉంటాడు’ అని గావస్కర్ అభిప్రాయపడ్డాడు.