పోలీసుల నిర్లక్ష్య వైఖరివల్లే సుశాంత్ మరణం
close

తాజా వార్తలు

Updated : 12/08/2020 20:59 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పోలీసుల నిర్లక్ష్య వైఖరివల్లే సుశాంత్ మరణం

9 పేజీల లేఖ విడుదల చేసిన సుశాంత్‌ కుటుంబం

ముంబయి/పట్నా: బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పూత్‌ ఆత్మహత్యకు కారణం పోలీసుల నిర్లక్ష్య వైఖరేనని ఆయన కుటుంబ సభ్యులు ఆరోపించారు. తమ ఫిర్యాదుపై చర్యలు తీసుకొని ఉంటే ఇంతటి ఘోరం జరిగుండేది కాదన్నారు. సుశాంత్‌కు తన తండ్రితో సరైన సంబంధాలు లేవని కొద్ది రోజుల క్రితం శివసేన ఎంపీ సంజయ్‌రౌత్ ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సుశాంత్ కుటుంబసభ్యులు తొమ్మిది పేజీల లేఖను విడుదల చేశారు. ఆ లేఖలో సుశాంత్‌ కుటుంబ అనుబంధాన్ని వివరిస్తూనే.. పోలీసుల వైఖరిని తప్పుబట్టారు.

‘‘కొద్ది సంవత్సరాల క్రితం సుశాంత్ గురించి ఎవరికీ తెలియదు. ప్రస్తుతం మా కుటుంబం గురించి దేశం మొత్తం మాట్లాడుకుంటోంది. సాధారణ మధ్యతరగతి తల్లిదండ్రుల్లానే పిల్లలకు అవసరమైన వసతులు సమకూర్చడం కోసం ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నాం. పిల్లల కలలకు మేం ఎప్పుడూ అడ్డుచెప్పలేదు. కష్టపడి పనిచేస్తే విజయం తప్పక లభిస్తుందనే సిద్ధాంతాన్నే పిల్లలకు నేర్పాం. సుశాంత్ తల్లి మరణం తర్వాత కుటుంబ పరిస్థితులు మారిపోయాయి. నటుడు కావాలని నిర్ణయించుకొని సుశాంత్ ముంబయి చేరుకున్నాడు. తన కలలకు అనుగుణంగా మంచి నటుడిగా ఎదిగాడు. కానీ సుశాంత్ చుట్టూ అత్యాశపరులు చేరి అతడి జీవితాన్ని నాశనం చేశారు’’ అని కుటుంబ సభ్యులు ఆరోపించారు. సుశాంత్‌కు రక్షణ కల్పించాలని పోలీసులను కోరినప్పటికీ తమ ఫిర్యాదును ఎవరూ పట్టించుకోలేదని, నాలుగు నెలల తర్వాత తాము ఊహించినట్లుగానే సుశాంత్ చనిపోయాడని కుటుంబ సభ్యులు తెలిపారు. పోలీసులు దాన్ని ఆత్మహత్య అని, ఇలాంటివి సాధారణమని తమతో వ్యాఖ్యానించినట్లు పేర్కొన్నారు.

‘‘సుశాంత్ మరణంపై విచారణ చేయాల్సిన వారే అతడి శవాన్ని ప్రదర్శనకు ఉంచి, ఒక్కగానొక్క కొడుకుకి సంతాపం తెలిపే సమయం కూడా ఇవ్వలేదు. కేవలం పోలీసుల నిర్లక్ష్యం వల్లే సుశాంత్ చనిపోయాడు. అతడి మరణం తర్వాత కొందరు సుశాంత్‌ జ్ఞాపకాలను చెరిపేసే ప్రయత్నం చేశారు. మరణంపై మొసలి కన్నీరు కార్చారు’’ అంటూ రియా చక్రవర్తిని ఉద్దేశించి పరోక్షంగా ప్రస్తావించారు. సుశాంత్ కేసు విచారణలో పోలీసులు కొందరికి మద్దతుగా ఎందుకు వ్యవహరిస్తున్నారని, నిజాన్ని పేరున్న న్యాయవాదులు ఆత్మహత్య పేరుతో చంపేసే ప్రయత్నం చేస్తున్నారని లేఖలో పేర్కొన్నారు. ఈ కేసుకు సంబంధించి ఆయన సోదరి, తండ్రికి బెదిరింపులు వచ్చాయని తెలిపారు. అలానే సుశాంత్‌తో తమ అనుబంధం గురించి, తమ వ్యక్తిత్వం గురించి తప్పుగా మాట్లాడుతున్నారని పరోక్షంగా సంజయ్‌ రౌత్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. కేవలం సీబీఐ విచారణ నుంచి దృష్టి మరల్చేందుకే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని