close

తాజా వార్తలు

ఓటింగ్‌లోనూ నాటకమాడారు: చంద్రబాబు

అమరావతి: మండలి రద్దుకు శాసనసభ తీర్మానం చేయడం విచారకరమని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తు్న్నట్లు చెప్పారు. మూడు రాజధానుల బిల్లును మండలి ఛైర్మన్‌ సెలెక్ట్‌ కమిటీకి పంపారనే ఆక్రోశంతో శాసన మండలి రద్దుకు తీర్మానం చేసి పంపడం దురదృష్టకరమన్నారు. మంగళగిరిలోని తెదేపా కార్యాలయంలో చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. దేశంలో లోక్‌సభకు ఎన్ని అధికారాలు ఉన్నాయో.. రాజ్యసభకూ అలాగే ఉంటాయన్నారు. బిల్లుల విషయంలో ఎవరు రాజకీయాలు చేశారో చెప్పాలని ఆయన డిమాండ్‌ చేశారు. 

వైకాపా ఎమ్మెల్యేలంతా నేరస్థుల ముఠా అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. వైకాపా ఎమ్మెల్యేల్లో 86 మందిపై వివిధ రకాల కేసులు ఉన్నాయని వివరించారు. ఆ నేరస్థుల ముఠాను మేధావులు అనే స్థితికి తీసుకొచ్చారని ఆయన దుయ్యబట్టారు. మాట తప్పను.. మడమ తిప్పను అని చెప్పే సీఎంకు.. ఎమ్మెల్యేల కేసులపై సమాధానం చెప్పే ధైర్యముందా? అని ప్రశ్నించారు. చివరికి తీర్మానంపై ఓటింగ్‌ సమయంలోనూ నాటకం ఆడారని చంద్రబాబు ఆరోపించారు. సభలో 121 మంది ఉన్నారని చెప్పి.. ఆఖరికి 133 మంది ఉన్నారని ప్రకటించడమేంటని ఆయన ప్రశ్నించారు.

కమిటీల పేరుతో అడుగడుగునా అబద్ధాలు..

‘‘ఇటీవల 10 రాష్ట్రాలు శాసన మండలిని పునరుద్ధరించాలని కోరాయి. మా హయాంలో మండలిలో బీసీ వర్గాలకు అవకాశం ఇచ్చాం. మండలిలో ఉపాధ్యాయులు, పట్టభద్రులు, స్థానిక సంస్థల ఎమ్మెల్సీలు ఉన్నారు. పరిస్థితులకు అనుగుణంగా సిద్ధాంతాలు మారతాయి. మండలి నిర్వహణకు ఏటా రూ.60కోట్లు ఖర్చు అవుతుందని చెప్పడం సరికాదు. ఏటా 40 రోజుల కంటే సభలు నడవడం లేదు. ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ తెచ్చింది మేమే. ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ బిల్లుపై సవరణలు మాత్రమే పెట్టాం. ఆంగ్లమాధ్యమాన్ని మేం వ్యతిరేకించలేదు.. మాతృభాషను కాపాడుకోవాలని మాత్రమే చెప్పాం. విమర్శలు చేయడం పత్రికల బాధ్యత. అది వారికి రాజ్యాంగం ఇచ్చిన హక్కు. ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌పై ఆరోపణలపై ఆధారాలుంటే ఎందుకు బయటపెట్టలేదు? కమిటీల పేరుతో అడుగడుగునా అబద్ధాలు చెప్పారు. విశాఖ అభివృద్ధికి తెదేపా అనుకూలం. విశాఖను ఆర్థిక రాజధాని, టెక్నాలజీ హబ్‌, ఫార్మా, పర్యాటక కేంద్రం చేయాలనుకున్నాం. కడప జిల్లాకు ఇచ్చిన రూ.1400 కోట్లు.. శ్రీకాకుళం జిల్లాకు ఎందుకు ఇవ్వలేదు? శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు ఏదైనా చేసి అప్పుడు మాట్లాడాలి’’ అని చంద్రబాబు ధ్వజమెత్తారు. 

బ్లాంక్‌ చెక్కులిస్తామన్నా మా ఎమ్మెల్సీలు లొంగలేదు

‘‘కేసులు, ఆర్థిక ఇబ్బందులతో ఉన్న ఇద్దరు తెదేపా ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టిన మీరు.. ఇప్పుడు విలువల గురించి మాట్లాడుతున్నారు. ఎమ్మెల్సీలు పోతుల సునీత, శివనాథ్‌రెడ్డి, డొక్కా మాణిక్యవరప్రసాద్‌లను ప్రలోభపెట్టడంలో మీ చొరవ లేదా?ఇది ఆకర్ష కాదా? తెదేపా ఎమ్మెల్సీల్లో చాలా మందికి రూ.20కోట్లు ఇస్తామన్నారు. మండలిలో వికేంద్రీకరణ బిల్లు ఆమోదం పొందాలని అన్ని ప్రయత్నాలూ చేశారు. 22 మంది మంత్రులు మండలిలో ఉండి ఎన్ని అడ్డదారులు తొక్కాలో తొక్కారు. ఛైర్మన్‌ షరీఫ్‌ను అన్ని విధాలా ఇబ్బంది పెట్టారు. మీ ప్రలోభాలకు లొంగకుండా ఉన్న మా ఎమ్మెల్సీలను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. నీతికి, నిజాయతీకి మారు పేరుగా పనిచేశారు. ఐదుకోట్ల ప్రజల తరఫున వారిని అభినందిస్తున్నా. రాష్ట్ర ప్రయోజనాలు, భావి తరాల భవిష్యత్తు కోసం వారు నిలబడ్డారు. మా ఎమ్మెల్సీ బీటీ నాయుడు ఇంటిపై దాడి చేశారు. ఛైర్మన్‌ షరీఫ్‌ను మతం పేరుతో బండబూతులు తిట్టారు. చిత్తశుద్ధి ఉండి ఉంటే అప్పుడే సభలో ఎందుకు తీర్మానం పెట్టలేదు. మండలిని రద్దు చేస్తామని చెప్పి ఎమ్మెల్సీలను ప్రలోభపెట్టేందుకే నాలుగు రోజుల సమయం ఇచ్చారు. మా ఎమ్మెల్సీలకు బ్లాంక్‌ చెక్కులిస్తామన్నా వారు లొంగలేదు. రాష్ట్ర ప్రజల భవిష్యత్‌ కోసం పదవులను త్యాగం చేశారు. ఈ సందర్భంగా మండలిపై గతంలో వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి, జగన్‌ చేసిన వ్యాఖ్యల వీడియోలను మీడియా సమావేశంలో ప్రదర్శించారు.



Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.