close

తాజా వార్తలు

Published : 06/07/2020 01:40 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

కరోనా కట్టడిలో ప్రభుత్వం వైఫల్యం : సంజయ్‌

హైదరాబాద్‌: రాష్ట్రంలో కరోనా కట్టడిలో ప్రభుత్వం విఫలమైందని తెలంగాణ భాజపా అధ్యక్షుడు బండి సంజయ్‌ ఆరోపించారు. ఇతర రాష్ట్రాల్లో ఐసీఎంఆర్‌ నిబంధనలకు అనుగుణంగా పరీక్షలు చేస్తున్నప్పటికీ తెలంగాణలో మాత్రం అలా జరగడం లేదని  ఆన్నారు. కరోనా పరీక్షల సంఖ్యను పెంచాలని ఎన్నో సార్లు విజ్ఞప్తి చేశామని, దానిని రాజకీయ విమర్శగా భావించారే తప్ప, పరిగణనలోకి తీసుకోలేదని వాపోయారు. కరోనా సోకిన పేద ప్రజలు సరైన సమయంలో చికిత్స అందక ప్రాణాలు కోల్పోతున్నారని చెప్పారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ధన్వి హెల్త్‌ కేర్‌ ఆధ్వర్యంలో కరోనాపై మీడియాకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సంజయ్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా దాదాపు రెండు వందల మంది మీడియా ప్రతినిధులకు కళ్లజోడు, విటమిన్‌-సి, విటమిన్‌-డి మాత్రలు, టూత్‌ పేస్టులు, గొడుగులతో కూడిన కిట్లు పంపిణీ చేశారు.

‘‘ప్రైవేటు ప్రయోగశాలలకు ఐసీఎంఆర్‌ అనుమతిచ్చినా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయలేదు. రాష్ట్ర ప్రభుత్వం కేసుల సంఖ్య పెరగకూడదని భావిస్తోంది . కానీ, విస్తృతంగా పరీక్షలు నిర్వహించి, ప్రజల ప్రాణాలు కాపాడి...కేసుల సంఖ్య పెరగకుండా చూసుకోవాలి. ఇప్పటికైనా ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేయాల్సిన అవసరం ఉంది.  మరోవైపు గాంధీ ఆస్పత్రిలో వైద్యులు కూడా రోడ్డెక్కే పరిస్థితి ఉంది.  అక్కడ వైద్యులకు సరైన సౌకర్యాలు లేవు’’ అని సంజయ్‌ విమర్శించారు. హైదరాబాద్‌లో కరోనా కేసులు పెరుగుదలకు ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని మండిపడ్డారు.

పాత్రికేయులను కాపాడుకోవాలి

ప్రజలను చైతన్యవంతుల్ని చేయడంలో, క్లిష్ట పరిస్థితుల్లో జనాలను అప్రమత్తం చేయడంలో మీడియా కీలక పాత్ర పోషిస్తోందని సంజయ్‌ కొనియాడారు. కుటుంబాలను పక్కన పెట్టి, వృత్తిని నమ్ముకుని పని చేయడం సంతోషకరమని, అయితే ప్రాణాలకు తెగించి విధులు నిర్వర్తించడం బాధ కలిగిస్తోందని అన్నారు. ‘‘మనోజ్‌ అనే పాత్రికేయుడు మృతి చెందినా...కెమెరాలు కాని, పాత్రికేయులుకాని ఎక్కడ ఆగడం లేదు.
ఈ పరిస్థితుల్లో ...పాత్రికేయులను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది’’ అని సంజయ్‌ తెలిపారు.



Tags :

రాజకీయం

జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని