close

తాజా వార్తలు

Updated : 29/10/2020 18:05 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ప్రపంచానికి పాఠాలు నేర్పుతోన్న తైవాన్..!

200 రోజుల్లో ఒక్క కేసు నమోదు కాలేదన్న ప్రభుత్వం

ఇంటర్నెట్‌ డెస్క్‌: కరోనా వైరస్ మహమ్మారి విజృంభణతో ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయి. ఓవైపు ఉత్తర, దక్షిణ అమెరికా దేశాలు కరోనా కట్టడిలో విఫలమవుతుండగా యూరప్ దేశాలు మరోసారి లాక్‌డౌన్‌ వైపు అడుగులు వేస్తున్నాయి. నిత్యం వేల సంఖ్యలో కేసులతో ప్రపంచ దేశాలు రికార్డులు నమోదు చేస్తుంటే.. తైవాన్‌ మాత్రం మరో కొత్త రికార్డు నమోదు చేసింది. గడిచిన 200 రోజుల్లో స్థానికంగా ఒక్క కేసు కూడా నమోదు కాలేదని పేర్కొంది. 2.3కోట్ల జనాభా కలిగిన తైవాన్‌లో ఇప్పటివరకు కేవలం 550 కేసులు మాత్రమే నమోదుకాగా, వీరిలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. కరోనా వ్యాప్తిని అరికట్టడంలో కఠినంగా వ్యవహరించిన తైవాన్‌, ప్రపంచదేశాలకు ఆదర్శంగా నిలుస్తోంది.

తైవాన్‌ మాదిరిగానే సింగపూర్, జపాన్ దేశాలు తొలుత వైరస్ వ్యాప్తిని నిరోధించగలిగినప్పటికీ అనంతరం అక్కడ కేసుల సంఖ్య భారీగా పెరిగింది. కానీ తైవాన్‌లో మాత్రం స్థానికంగా ఒక్కకేసు కూడా నమోదు కాలేదు. కేవలం విదేశాల నుంచి వచ్చిన వారిలోనే వైరస్‌ బయటపడుతున్నట్లు అధికారులు వెల్లడించారు. తాజాగా గడిచిన రెండు వారాల్లో ఫిలిప్పైన్స్, అమెరికా, ఇండోనేషియా దేశాల నుంచి వచ్చిన 20మందిలో వైరస్ గుర్తించామని వెల్లడించారు. అనంతరం వారిని క్వారంటైన్‌లో ఉంచారు.

కరోనా కట్టడిలో తైవాన్‌ తీసుకున్న చర్యలే సత్ఫలితాలిచ్చినట్లు అంతర్జాతీయ నిపుణులు అంచనా వేస్తున్నారు. సరిహద్దులు మూసివేయడం, కచ్చితమైన కాంటాక్ట్ ట్రేసింగ్, సాంకేతికత సాయంతో క్వారంటైన్‌లో ఉన్నవారిని పర్యవేక్షించడం, ప్రతిఒక్కరు మాస్క్ ధరించేలా తీసుకున్న చర్యలు కరోనా కట్టడిలో కీలక అంశాలుగా నిలిచాయని అంటున్నారు. ఇలా, కరోనా వైరస్ సామాజిక వ్యాప్తిని నిర్మూలించిన ప్రపంచంలో ఏకైక దేశంగా తైవాన్ నిలిచిందని ఆస్ట్రేలియన్ నేషనల్ యూనివర్సిటీ మెడికల్ స్కూల్‌కు చెందిన ప్రొఫెసర్ పీటర్ కొలీగ్నాన్ స్పష్టం చేశారు. కరోనా వ్యాప్తిని అరికట్టడంలో తైవాన్ ప్రపంచంలోనే ఉత్తమ ఫలితాలు సాధించిందని ఆయన అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా ఆర్థికంగానూ తైవాన్‌ దూసుకెళ్తోందని చెప్పుకొచ్చారు. ఇక, కఠినమైన కాంటాక్ట్‌ ట్రేసింగ్‌, క్వారంటైన్‌ చర్యలు చేపట్టని ఏ దేశం కూడా కరోనా కట్టడిలో సఫలం కావని తైవాన్‌ మాజీ ఉపాధ్యక్షుడు, ప్రముఖ ఎపిడమాలజిస్ట్‌ చెన్‌ చైయిన్‌-జెన్‌ స్పష్టంచేశారు. ప్రజలకు క్వారంటైన్‌లో ఉంచడం కూడా అంత తేలికైన విషయం కాదని.. వారికి సరైన భోజనం, నిత్యావసర వస్తువులు అందించడంతోపాటు సాంకేతికత సాయంతో ప్రతిక్షణం వారిని పర్యవేక్షించడం ఎంతో ముఖ్యమన్నారు.

సరిహద్దులు కట్టడి..

కరోనా వైరస్‌ బయటపడ్డ వెంటనే అప్రమత్తమైన తైవాన్‌, ముందుగా సరిహద్దుల వద్ద ఆంక్షలు విధించింది. దేశంలోకి వచ్చే వారికి ఆరోగ్య పరీక్షలు నిర్వహించడంతోపాటు వారి మొబైల్‌ సిగ్నల్‌ ద్వారా 14రోజుల పాటు క్వారంటైన్‌లో ఉంచి పర్యవేక్షించింది. తద్వారా ముందస్తుగానే వైరస్‌ ఉన్న వ్యక్తులను దేశంలోకి రాకుండా జాగ్రత్తపడింది.

మాస్కుల పంపిణీ..

కరోనాపై విజయంలో తైవాన్‌ చేపట్టిన మాస్కుల పంపిణీ భారీ సత్ఫలితాలిచ్చిందనే చెప్పవచ్చు. వైరస్‌ వ్యాప్తి ప్రారంభమైన వెంటనే మాస్కుల ఎగుమతులపై ఆంక్షలు విధించింది. అంతేకాకుండా స్థానికంగా వాటి ఉత్పత్తిని భారీగా పెంచింది. వాటిని దేశవ్యాప్తంగా పంపిణీ చేసింది. దీంతో ప్రజలు మాస్కుల కోసం ఇబ్బంది పడాల్సిన అవసరం తప్పింది.

కాంటాక్ట్‌ ట్రేసింగ్‌..క్వారంటైన్‌..!

కాంటాక్ట్‌ ట్రేసింగ్‌ విషయంలో తైవాన్‌ కఠినంగా వ్యవహరించింది. వైరస్‌ సోకిన వ్యక్తికి సన్నిహితంగా మెలిగిన 20 నుంచి 30 మందిని గుర్తించి పరీక్షలు నిర్వహించింది. ఒకనొక సమయంలో ఒక్క పాజిటివ్‌ కేసు విషయంలో 150మందిని పరీక్షించింది. వారందరినీ 14రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండేలా చర్యలు తీసుకుంది. ఇలా ఇప్పటివరకు 3,40,000 మందిని క్వారంటైన్‌లో ఉంచినట్లు అక్కడి ప్రభుత్వం వెల్లడించింది. నిబంధనలు ఉల్లంఘించిన వెయ్యి మందికి జరిమానా కూడా విధించింది.

సార్స్‌ నేర్పిన పాఠాలతో..

2003 సంవత్సరంలో సార్స్‌ విజృంభణ నుంచి తైవాన్‌ పాఠాలు నేర్చుకుంది. అప్పుడు వందల మంది సార్స్‌ బారినపడగా 73మంది మృత్యువాతపడ్డారు. అప్పట్లో ప్రపంచంలో సార్స్‌ తీవ్రత ఎక్కువగా ఉన్న దేశాల్లో తైవాన్‌ మూడో స్థానంలో ఉంది. అంతేకాకుండా బర్డ్‌ ఫ్లూ, ఇన్ఫ్లూయెంజా వంటి వైరస్‌లను ఎదుర్కొన్న తీరును కూడా తైవాన్‌ పరిగణనలోకి తీసుకుంది. వాటి అనుభవాల నుంచి కరోనా వైరస్‌ విషయంలో ఎలా వ్యవహరించాలో ముందస్తుగానే అంచనా వేసింది. ప్రజలు కూడా ఇలాంటి వైరస్‌ల పట్ల ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే దానిపై అవగాహన కలిగి ఉండటం, ముఖ్యంగా చేతులు శుభ్రం చేసుకోవడం, మాస్కులు ధరించడం వంటి చర్యల వల్ల కరోనా వైరస్‌ను సాధ్యమైనంత వరకు అరికట్టగలిగారు. ఇలా కరోనా మహమ్మారిని ఎదుర్కోవడంలో ప్రపంచ దేశాలు చేతులెత్తేస్తున్న వేళ.. తైవాన్ మాత్రం వైరస్ వ్యాప్తిని నియంత్రించడంలో ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తోంది.


Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు

చిత్ర వార్తలు

సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.