
తాజా వార్తలు
తరుణ్ గొగొయి కన్నుమూత
గువాహటి: అసోం మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత తరుణ్ గొగొయి (84) కన్నుమూశారు. తీవ్ర అనారోగ్యంతో గువాహటిలోని ఓ ఆసుపత్రిలో చికిత్సపొందుతూ తుదిశ్వాస విడిచారు. గత నెలలో కరోనా బారిన పడిన ఆయన.. ఈ మహమ్మారి నుంచి కోలుకున్నప్పటికీ ఇతర అనారోగ్య సమస్యలు చుట్టుముట్టాయి. దీంతో శరీరంలోని అవయవాల పనితీరు క్షీణించడంతో వెంటిలేటర్‌పైనే ఉన్నారు. ఆరోగ్య పరిస్థితి తీవ్రంగా విషమించడంతో సోమవారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. తన 50 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో తరుణ్ గొగొయి మూడు పర్యాయాలు అసోం సీఎంగా, ఆరు సార్లు ఎంపీగా సేవలందించారు.
హ్యాట్రిక్ సీఎం రికార్డు..
తరుణ్ గొగొయి 1936, ఏప్రిల్ 1న జోర్హాట్ జిల్లాలోని రంగజన్ టీ ఎస్టేట్ వద్ద జన్మించారు. ఆయన తండ్రి డాక్టర్ కమలేశ్వర్ గొగొయి వైద్యరంగంలో నిపుణులు కాగా.. ఆయన తల్లి ఉషా గొగొయి కవితా సంకలనానికి ప్రసిద్ధిగాంచారు. ప్రాథమిక విద్యతో పాటు గ్రాడ్యుయేషన్ వ రకు జోర్హాట్ జిల్లాలోనే సాగగా.. గువాహటి విశ్వవిద్యాలయం నుంచి ఆయన ఎల్ఎల్బీ పట్టా అందుకున్నారు. అనంతరం రాజకీయాల్లోకి ప్రవేశించిన ఆయన.. కాంగ్రెస్‌లో సుదీర్ఘకాలం పాటు వివిధ హోదాల్లో సేవలందించారు. తొలిసారి 1971లో తొలిసారి పార్లమెంట్‌కు ఎన్నికైన ఆయన.. ఆ తర్వాత వరుసగా ఆరు పర్యాయాలు లోక్‌సభకు ఎన్నికై రాజకీయాల్లో తనదైన ముద్రను వేశారు. 1976లో ఏఐసీసీ సంయుక్త కార్యదర్శిగా నియమితులైన గొగొయి.. 1986-91 మధ్యకాలంలో అసోం పీసీసీ అధ్యక్షుడిగానూ పనిచేశారు.
పీవీ నరసింహారావు హయాంలో (1991-95) గొగొయి కేంద్ర మంత్రి (స్వతంత్ర హోదా)గా పనిచేశారు. ఆ సమయంలో గొగొయి కేంద్ర ఫుడ్ ప్రాసిసింగ్ శాఖ సహాయ మంత్రిగా సేవలందించారు. అసోంలో వరుసగా 2001, 2006, 2011లలో వరుసగా మూడు పర్యాయాలు అసోం సీఎంగా ఎన్నికై రికార్టు సృష్టించారు. అసోంలో అత్యధిక కాలం పాటు (15ఏళ్లు) ముఖ్యమంత్రిగా పనిచేసిన అరుదైన నేతగా ప్రసిద్ధిగాంచారు.