close
Array ( ) 1

తాజా వార్తలు

మా సందేశం మీ కోసం!

లక్ష్య సాధనకు క్రికెటర్లు చెబుతున్న గుణ పాఠాలు

నేర్చుకోవాలన్న తపన ఉండాలే గానీ ఈ సృష్టిలోని ప్రతిదీ ఏదో ఒకటి నేర్పిస్తూనే ఉంటుంది. చీమను చూసి క్రమశిక్షణ, చెట్టును చూసి తిరిగి ఆశించని గుణం, సింహాన్ని చూసి గురి, పర్వతాన్ని చూసి నిరాడంబరత అలవరుచుకోవచ్చు. అందుకే నా జీవితమే నా సందేశమని గాంధీ మహాత్ముడు అన్నది.

ఇతరుల నడవడికను చూసి ఎన్నెన్నో పాఠాలు, గుణపాఠాలు నేర్వొచ్చు. జీవితంలో ముందుకు సాగిపోవచ్చు. టీమిండియా క్రికెటర్లు సైతం తమ ఆటతో అలాంటి సందేశాలే ఇస్తున్నారు. కోటి ఆశలతో కొత్త ఏడాదిలోకి అడుగుపెట్టిన సందర్భంగా మన లక్ష్య సాధనకు అవెలా ఉపయోగపడతాయో చూద్దామా!!


నిలకడే ‘రారాజు’

భారత క్రికెట్లో రారాజుగా వెలుగొందుతున్నాడు విరాట్‌ కోహ్లీ. ప్రత్యర్థి ఎంతటి బలవంతుడైనా జట్టును ధైర్యంగా ముందుకు నడిపిస్తున్నాడు. 2014 ఇంగ్లాండ్‌ పర్యటనలో తన పనైపోయిందని భావించిన విరాట్‌ అంచెలంచెలుగా ఎదిగాడు. దేహదారుఢ్యం పెంచుకున్నాడు. తన ఆట సాధారణమే అయినా అసాధారణమైన పట్టుదలతో అబ్బురపరిచే నిలకడ సాధించాడు. అందుకే ఇన్నిన్ని శతకాలు. లక్ష్య సాధనకు ‘నిలకడ ఎంతో అవసరం’ అన్నది కోహ్లీ సందేశం.


సింహంలా గురి 

ఒకప్పుడు ప్రపంచకప్‌ ప్రణాళికల్లోనే లేని వ్యక్తి రోహిత్‌ శర్మ. ‘రేపు సూర్యుడు ఉదయించక మానడు’ ప్రేరణతో ముందుకు సాగిపోయాడు. దిగ్గజాల నీడలో ఆడుతూనే వెలుగులోకి వచ్చాడు. కోహ్లీకి సమవుజ్జీ అయ్యాడు. ఓపెనింగ్‌లో కుదురుకోవడానికి ఎక్కువ బంతులు తీసుకుంటాడు. ఆపై 150+ చేసేస్తాడు. ‘సింహం నాలుగు అడుగులు వెనక్కి వేసేది వంద అడుగులు ముందుకు వేసేందుకే’ అన్నది అతడి నుంచి నేర్చుకోవచ్చు.


సిద్ధాంతమే శిరోధార్యం

ముక్కుసూటిగా ముందుకుపోయే ఆటగాడు అంబటి రాయుడు. అన్నీ నిజాయతీగా జరగాలన్నది అతడి తత్వం. ప్రపంచకప్‌ వరకు అతడితో ‘నాలుగు’ స్తంభాలాట ఆడారు! ఆశలెన్నో కల్పించి ఆఖరుకు మొండిచేయి చూపించారు. వివాదం ముదరడంతో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. ‘నమ్మిన సిద్ధాంతం కోసం మంటల్లోకైనా దూకేయాలి’ అన్నది అంబటి ఇచ్చే సందేశం. కొన్నిసార్లు ‘మరీ ముక్కుసూటి తనం పనికిరాదు’ అనీ చెబుతున్నాడు.


నిజాయతీతో ‘ష్రమి’స్తే

జీవిత భాగస్వామితో విభేదాలు, ఫిట్‌నెస్‌ లేమితో జట్టులో చోటు కోల్పోయిన పేసర్‌ మహ్మద్‌ షమి. తన ఇబ్బందులతో మానసికంగా కుంగిపోయాడు. ఉక్కిరిబిక్కిరి చేస్తున్న ఆలోచనల నుంచి స్పష్టతవైపు పయనించాడు. క్రికెట్టే తన జీవితంగా భావించాడు. ఫిట్‌నెస్‌పై దృష్టిపెట్టి బరువు తగ్గాడు. ఇప్పుడు ప్రపంచంలోనే అత్యుత్తమ పేసర్లలో ఒకడిగా అవతరించాడు. ‘జీవితంలో కష్టాలు తప్పవు. నిజాయతీ, స్పష్టతతో శ్రమిస్తే శుభం కలుగుతుంది’ అన్నది షమి సందేశం.


కర్తవ్య దీక్ష

ఒకటి..రెండు.. కాదు ఎన్నోసార్లు మయాంక్‌ అగర్వాల్‌కు సెలక్టర్లు మొండిచేయి చూపించారు. అందుకు అతడేమీ కుంగిపోలేదు. దేశవాళీల్లో మరింత కఠోరంగా శ్రమించాడు. పరుగుల వరద పారించాడు. తనను ఎంపిక చేయక తప్పని పరిస్థితిని కల్పించాడు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. నెల రోజుల్లోనే రెండు ద్విశతకాలు బాదేసి సంచలనం సృష్టించాడు. ‘నీ కర్తవ్యం నువ్వు నిర్వర్తించు. ఫలితం భగవంతుడే ఇస్తాడు’ అని అతడిని చూసి నేర్చుకోవచ్చు.


సాధన కీలకం

అంతర్జాతీయ క్రికెట్లోనే అత్యుత్తమ వికెట్‌ కీపర్‌ ఎంఎస్‌ ధోనీ. అతడి స్థానాన్ని భర్తీ చేయడం ఆషామాషీ కాదు. మహీ నెలకొల్పిన కఠిన ప్రమాణాలు పాటించడం సులువేం కాదు. అందుకే అంచనాలు అందుకోవడంలో విఫలమయ్యాడు రిషభ్‌ పంత్‌. విదేశాల్లో సుదీర్ఘ ఫార్మాట్లో సత్తా చాటిన అతడు స్వదేశంలో ప్రభావం చూపలేదు. తన బలమైన పరిమిత ఓవర్ల క్రికెట్లో వికెట్ల ముందు, వెనకాల రాణించలేదు. ‘సరైన సాధన, సన్నాహకం లేకుంటే శిఖరపుటంచుల్లో నిలబడటం కష్టం’ అని పంత్‌ నేర్పిస్తున్న సత్యం.


మాట తూలితే

టీమిండియాలో అతుక్కుపోయినట్టుండే ఇద్దరు మిత్రులు కేఎల్‌ రాహుల్‌, హార్దిక్‌ పాండ్య. అద్భుతమైన టెక్నిక్‌, సొగసరి స్ట్రోక్‌ప్లే రాహుల్‌ సొంతం. బ్యాటు, బంతితో జట్టుకు సమతూకం తెస్తాడు పాండ్య. తక్కువ కాలంలోనే పై స్థాయికి చేరుకున్నారు. కాఫీ విత్‌ కరణ్‌ షోలో మహిళలపై పాండ్య అనుచిత వ్యాఖ్యలు చేయడంతో ఇద్దరూ అభాసుపాలయ్యారు. ‘సమాజంలో ఉన్నత స్థితిలో ఉన్న వ్యక్తులు తెలియక పొరపాటు చేసినా కష్టాలు అనుభవించక తప్పదు. మాట్లాడేటప్పుడు జాగ్రత్త!’ అని వీరిస్తున్న సందేశం.


సానుకూలమే సరి

అతనాడుతోంటే టీమిండియాకు ధైర్యం. ప్రత్యర్థికి విసుగు. సంప్రదాయ క్రికెట్‌ షాట్లు, అడ్డంగా బ్యాటుతో ఆడగల దిట్ట అజింక్య రహానె. పరిమిత ఓవర్ల క్రికెట్‌కు దూరమవ్వడం అతడి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసింది. సుదీర్ఘ ఫార్మాట్లోనూ ఫామ్‌ కోల్పోయాడు. నిలకడకు మారుపేరైన అతడికి ఒకానొక దశలో జట్టులో చోటు దక్కని పరిస్థితి. సానుకూల దృక్పథం నుంచి ‘నాకే ఎందుకిలా’ వంటి ఆలోచనలతో సతమతం అయ్యాడు. ఆఖరికి ఒకనాడు ఇంగ్లాండ్‌లో ఒంటరిగా నడుస్తుండగా ‘నిన్ను నువ్వు నమ్ము. నీ దారినే అనుసరించు’ అనే ఆలోచన తట్టింది. చివరికి 17 నెలల తర్వాత శతకం బాది ఫామ్‌లోకి వచ్చాడు. ‘మానసిక అవరోధాలను పట్టించుకోకుండా నీ బలంపై నువ్వు దృష్టిపెట్టు’ అని జింక్స్‌ చెప్తున్నాడు.


డీలా పడొద్దు

ఈ దశాబ్దంలోనే అన్ని ఫార్మాట్లలో కలిపి ఎక్కువ వికెట్లు తీసింది రవిచంద్రన్‌ అశ్విన్‌. మణికట్టు మాంత్రికుల రాకతో పరిమిత ఓవర్ల క్రికెట్‌కు దూరమయ్యాడు. సుదీర్ఘ ఫార్మాట్లో గాయాల బారిన పడ్డాడు. మెరుగైన రికార్డున్న విండీస్‌పై జట్టులో చోటే దక్కలేదు. టీఎన్‌పీఎల్‌, ఐపీఎల్‌, దేశవాళీల్లో సరికొత్త అస్త్రాలను సముపార్జిస్తూ ముందుకు సాగుతున్నాడు. నిరాశను దరిచేరనీయడం లేదు. ‘కొన్నిసార్లు సాధించిన విజయాలకు సరైన ఘనత దక్కకపోవచ్చు. అయినా డీలా పడొద్దు’ అన్నది యాష్ చెబుతున్న పాఠం.


కాలంతో మారకుంటే

రెండోసారి ఐదు వికెట్ల ఘనత అందుకోవడానికి 12 ఏళ్లు తీసుకున్నాడు ఇషాంత్‌ శర్మ. కొత్త కుర్రాళ్లు అదరగొడుతోంటే స్పెల్స్‌ మధ్య వారికి విశ్రాంతినిచ్చే పేసర్‌గా మారిపోయాడు. ఇంగ్లాండ్లో కౌంటీలు ఆడుతూ, టీమిండియా బౌలింగ్‌ కోచ్‌ల సలహాలు తీసుకుంటూ ప్రయోగాలు చేయడం మొదలుపెట్టాడు. కఠోరంగా శ్రమించాడు. ఆడక తప్పని పరిస్థితి కల్పించి వికెట్లు తీస్తున్నాడు. ‘ఎంత అనుభవం ఉన్నా కాలంతో పాటు మారకుంటే, సాంకేతికత అందిపుచ్చుకోకుంటే కష్టం’ అన్నది లంబూ నేర్పే గుణపాఠం.

- ఇంటర్నెట్‌డెస్క్‌, హైదరాబాద్‌


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.