close

తాజా వార్తలు

Published : 13/02/2020 00:31 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

కన్నీరూ మంచిదే!

ఇస్లాం సందేశం

రెండు కన్నీటి బిందువుల విలువకు ఈ ప్రపంచంలో ఏదీ సరితూగలేదంటారు. కన్నీళ్లు మాట్లాడతాయి, కానీ భాషలేదు. ఆ ఆవేదనాశ్రువుల గొంతును పరమ ప్రభువు అయిన అల్లాహ్‌ మాత్రమే వినగలుగుతాడు. అందుకే దుఃఖాన్ని ప్రార్థనతో పోల్చారు. ‘ఎవరినీ కష్టపెట్టకండి, ఎవరినీ కన్నీరు పెట్టించకండి... ఎందుకంటే వారి ఆవేదన మీకు శాపంగా మారుతుంది. భరించలేనంత దుఃఖంతో మీ గుండె, నీటి పొరలతో మీ కళ్లు నిండిపోతే ప్రభువుతో మాట్లాడండి. అల్లాహ్‌కు నీ కష్టాల గురించి తెలుసు కానీ మననోటి నుంచి వినాలనుకుంటాడు.’ అంటారు ఉలమాలు. రెండు బొట్లు అల్లాహ్‌కు ఎంతో ప్రీతికరమైనవి. మొదటిది పాపభీతితో కార్చే కన్నీటి బొట్టు... రెండోది  ధర్మమార్గంలో కార్చే రక్తపు బొట్టు. చెంపలపైనుంచి జాలువారే ఆ కన్నీరు భగభగమండే నరకాగ్నికీలల్ని చల్లారుస్తుందంటారు ప్రవక్త మహనీయులు. అల్లాహ్‌ భీతితో ఏ నేత్రాలైతే కన్నీళ్లు కార్చుతాయో అలాంటి వ్యక్తిని నరకాగ్ని నీడకూడా తాకలేదని చెబుతారు ప్రవక్త.
*మనం చేసే పాపాల వల్ల హృదయానికి తుప్పుపడుతుంది. దాన్ని వదిలించే గుణం కేవలం కన్నీళ్లకే ఉంటుందంటారు హజ్రత్‌ సయ్యద్‌ నా సాలెహ్‌ మురీద్‌. గుండెను ప్రక్షాళనం చేసే మందు కేవలం కన్నీరే అంటారాయన. మనిషి *పాపాల వల్ల మనసు మలినమవుతుంది. పాపం చేసిన ప్రతిసారీ హృదయంలో నల్లని మచ్చ ఏర్పడుతుంది. పాపాలు మితిమీరిపోతే హృదయమంతా నల్లబారిపోతుంది. అప్పుడు గుండెను ప్రక్షాళన చేయడం కేవలం పశ్చాత్తాపంతో రాల్చే కన్నీటిబొట్లకే సాధ్యమవుతుంది.
* ఏ పరిస్థితిలోనైనా. మన కన్నీళ్లను మనమే తుడుచుకుంటే దృఢసంకల్పం అలవడుతుందని పండితులు చెబుతారు. మన కన్నీళ్లను ఎదుటివారితో తుడిపించడం బలహీనతకు నిదర్శనం. కేవలం అల్లాహ్‌ ముందు మాత్రమే కన్నీరుమున్నీరవ్వండి అని వారు చెబుతారు.
* ప్రవక్త కాలంలో ఆయన (స) సహచరులు ఖురాన్‌ పఠించినప్పుడల్లా తీవ్రంగా రోదించేవారు. దుఆ మధ్యలో కన్నీటిబొట్లు రాలాయంటే ఆ వేడుకోలు అల్లాహ్‌ స్వీకృతి పొందిందనడానికి నిదర్శనమని చెబుతారు. అందుకే అల్లాహ్‌ ముందు రోదించడానికి మొహమాటపడకూడదు.
* ఇతరుల కష్టాలను చూసి కార్చే కన్నీటి బిందువులు వజ్రవైఢూర్యాలకన్నా విలువైనవని ప్రవక్త చెప్పారు. ప్రాపంచిక అవసరాలు తీరలేదని ప్రభువుకు మొరపెట్టుకుని ఏడవడంలో గొప్పదనమేమీలేదు. కానీ మన కర్మలచిట్టాలో సత్కార్యాలు లేవనే ఆందోళనతో రోదించడమే అసలైన గొప్పతనం. మనం చేసిన మంచిపనులు అల్లాహ్‌ స్వీకృతి పొందుతున్నాయో లేదో అనే ఆందోళనతో రోదించడమూ విశేషమే. అల్లాహ్‌ మీద ప్రేమతో కన్నీళ్లు కార్చడం, పాపభీతితో  రోదించడం, అల్లాహ్‌ ఆజ్ఞలు భంగపర్చినందుకు భయంతో ఏడ్వడం, దైవారాధనలు, మంచిపనులు చేసి ఆనందభాష్పాలు రాల్చడం ఇవన్నీ దైవప్రేమకు ఆనవాళ్లు.
అందుకే ఎంతో విలువైన ఆ కన్నీటిబొట్లకోసం విశ్వప్రయత్నాలు చేయాలి. మక్కాలో కాబాగృహం దగ్గర నమాజు చదివించే ఇమాములు రోదిస్తూ ఖుర్‌ఆన్‌ పారాయణం చేస్తారంటే కన్నీళ్లు ఎంత విలువైనవో అర్థం చేసుకోవచ్చు.

-  ఖైరున్నీసాబేగంTags :
జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని