నెలలో 19లక్షల ఉద్యోగాలు ఇవ్వాలి: తేజస్వీ
close

తాజా వార్తలు

Published : 24/11/2020 01:35 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నెలలో 19లక్షల ఉద్యోగాలు ఇవ్వాలి: తేజస్వీ

పట్నా: బిహార్‌లో ఎన్డీయే సర్కారు హామీ ఇచ్చిన విధంగా మొదటి నెలలో 19లక్షల ఉద్యోగాలకు ప్రకటన ఇవ్వాలని ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌ డిమాండ్‌ చేశారు. లేదంటే ప్రజలతో కలిసి రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపడతామని హెచ్చరించారు. ఈ మేరకు ఆయన సోమవారం ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేసిన అనంతరం మీడియాతో మాట్లాడారు. ‘బిహార్‌ దేశంలో నిరుద్యోగుల రాజధానిగా తయారైంది. ఉద్యోగాల కోసం ప్రజలు ఎక్కువ కాలం ఎదురుచూడలేదు. ఎన్డీయే సర్కారు మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం మొదటి నెలలోపు 19లక్షల ఉద్యోగాల భర్తీకి ఏర్పాట్లు చేయకపోతే.. మేం రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలతో కలిసి నిరసనలు చేపడతాం. ఉద్యోగాలు, ఆరోగ్యం, విద్య, నీటిపారుదల సమస్యలపై 1.56కోట్ల మంది ఓటర్లు మాపై విశ్వాసం ఉంచారు. వారి నమ్మకాల్ని మేం వమ్ము చేయం. ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా సరే తప్పనిసరిగా మేం ఆ సమస్యలపై ఉద్యమిస్తాం’ అని తేజస్వీ తెలిపారు.  

ముఖ్యమంత్రి నీతీశ్‌కుమార్‌ను ఉద్దేశిస్తూ.. ‘రాష్ట్రంలో మూడో అతిపెద్ద పార్టీకి చెందిన వ్యక్తి సీఎం పదవి చేపట్టడం ఇప్పుడే తొలిసారి చూస్తున్నా. నీతీశ్‌కుమార్‌ కుంభకోణాల్లో నిందితుడిగా ఉన్న వ్యక్తికి ఆయన విద్యాశాఖ మంత్రి పదవి ఇచ్చారు. నేను ప్రతిపక్ష నాయకుడిగా బాధ్యతలు చేపట్టకముందే అధికార పార్టీ సభ్యులు నన్ను రాజీనామా చేయాలని కోరుతున్నారు. నేను ఉపముఖ్యమంత్రి పదవి కూడా చేపట్టా.. అప్పట్లో మరి నాపై ఏవైనా అవినీతి ఆరోపణలు ఉన్నాయేమో నిరూపించాలి’ అని తేజస్వీ తీవ్ర విమర్శలు చేశారు. 

బిహార్‌లో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 125 స్థానాలు గెలిచి ఎన్డీయే కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ముఖ్యమంత్రి నవంబర్‌ 16న సీఎంగా నీతీశ్‌కుమార్‌ ప్రమాణ స్వీకారం చేశారు. భాజపా 74, జేడీయూ 46 గెలవగా.. ప్రతిపక్ష పార్టీ ఆర్జేడీ 75 స్థానాల్లో గెలిచి రాష్ట్రంలో అతిపెద్ద పార్టీగా అవతరించింది. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని