
తాజా వార్తలు
పాక్‌కు రహస్యాల చేరవేత
దేవేందర్‌పై అభియోగపత్రంలో పేర్కొన్న ఎన్ఐఏ
దిల్లీ: ఉగ్రవాద కార్యకలాపాలతో సంబంధముందన్న ఆరోపణలతో సస్పెండైన జమ్మూ-కశ్మీర్ డీఎస్పీ దేవేందర్ సింగ్ పాకిస్థాన్ హైకమిషన్‌కు సున్నితమైన, రహస్య సమాచారం చేరవేసినట్లు అధికారులు ఆదివారమిక్కడ తెలిపారు. ప్రస్తుతం జమ్మూ-కశ్మీర్ జైలులో ఉన్న అతడిపై ఎన్ఐఏ ఇటీవల అభియోగపత్రం నమోదుచేసింది. మరోవైపు, ఈ కేసుపై దర్యాప్తు చేస్తున్న జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అధికారులు దేవేందర్ సామాజిక అనుసంధాన వేదికల ఖాతాల పాస్‌వర్డ్‌లను ఛేదించారు. అనంతరం ఆ ఖాతాలను పరిశీలించగా.. పాకిస్థాన్ హైకమిషన్ సిబ్బందితో సంప్రదింపులు జరిపినట్లు వెల్లడైంది. దేశానికి సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని పొందడానికే పాక్ అధికారులు అతడిని ఉచ్చులోకి లాగారని అభియోగపంత్రలో వెల్లడించారు. పాకిస్థాన్ హైకమిషన్‌లో పనిచేసే షాకత్‌తో దేవేందర్ సన్నిహితంగా ఉండేవాడని, అతనికే సున్నిత సమాచారాన్ని చేరవేశాడని అధికారులు తెలిపారు. ఏం సమాచారం అందజేశాడన్న వివరాలు వెల్లడించేందుకు నిరాకరించారు. దిల్లీలో గూఢచర్యానికి పాల్పడుతున్నారన్న ఆరోపణలపై ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పాక్ హైకమిషన్ ఉద్యోగులు ఇద్దరిని దేశం వీడి వెళ్లాలని ఆదేశించింది. దాంతోపాటు హైకమిషన్ సిబ్బందిని 50 శాతం మేర తగ్గించుకోవాలని పొరుగు దేశాన్ని కోరింది. ఈ మేరకు వారంతా గత నెల్లో పాకిస్థాన్‌కు వెళ్లిపోయారు.