
తాజా వార్తలు
పాన్ ఇండియా మూవీ: ఎవరెక్కడ?
పాన్ ఇండియా. గత కొంతకాలంగా చిత్ర పరిశ్రమలో వినిపిస్తున్న మాట. ఒకట్రెండు భాషల్లో ఏకకాలంలో నిర్మించిన చిత్రాన్ని మిగిలిన భాషల్లోకి అనువదించినంత మాత్రాన పాన్ ఇండియా సినిమా అయిపోదు. కథ, కథనం, నటీనటులు ఇలా సినిమాకు సంబంధించిన ప్రతి విభాగం ఆ స్థాయిలో ఉన్నప్పుడు మాత్రమే అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకోగలదు. ప్రస్తుతం దక్షిణాదిన అగ్ర కథానాయకుల చిత్రాలు పాన్ ఇండియాను దృష్టిలో పెట్టుకునే తెరకెక్కుతున్నాయి. హీరోలు సైతం అలాంటి కథలను చేసేందుకే ఇష్టపడుతున్నారు. ప్రస్తుతం టాలీవుడ్లో ఏ హీరో ఏ ర్యాంకులో ఉన్నాడో ఓసారి చూస్తే...
మొదటి స్థానం ప్రభాస్‌దే!
పాన్ ఇండియా సినిమా విషయంలో అందరికంటే ముందు వరుసలో ఉన్నాడు ప్రభాస్. ఆయన నటించిన ‘బాహుబలి: ది బిగినింగ్’, ‘బాహుబలి: ది కన్‌క్లూజన్’ చిత్రాల అంతర్జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు తెచ్చాయి. ఇక ఆ తర్వాత నటించిన ‘సాహో’ బాలీవుడ్ ప్రేక్షకులకు తెగ నచ్చేసింది. యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లనే రాబట్టింది. ఇదంతా గతం. ఇప్పుడు ప్రభాస్ నటిస్తున్న చిత్రాలన్నీ పాన్ ఇండియా మూవీలే. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో నటిస్తున్న ‘రాధేశ్యామ్’ వింటేజ్ లవ్ స్టోరీగా తెరకెక్కుతోంది. ఇది కూడా అన్ని భాషల్లో విడుదల కానుంది. ఆ తర్వాత ఓం రౌత్ దర్శకత్వంలో ‘ఆది పురుష్’, నాగ్ అశ్విన్ డైరెక్షన్లో మరో సినిమా చేస్తున్నారు ప్రభాస్. ఈ రెండూ చిత్రాలు భారీ బడ్జెట్ చిత్రాలే. దీంతో ప్రభాస్ పాన్ ఇండియా మూవీ చిత్రాల విభాగంలో టాప్‌లో ఉన్నారు.
రామరాజు-కొమురం భీమ్ కలిస్తే..
అగ్ర దర్శకుడు రాజమౌళి తెరకెక్కిన ప్రతిష్టాత్మక చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. ఎన్టీఆర్, రామ్‌చరణ్ కథానాయకులుగా భారీ బడ్జెట్‌తో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇప్పటికే 70శాతానికి పైగా చిత్రీకరణ పూర్తి చేసుకుంది. అన్ని అనుకూలిస్తే వచ్చే ఏడాది సంక్రాంతికి రావాల్సిన చిత్రం కరోనా కారణంగా వాయిదా పడింది. ఈ నేపథ్యంలో అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్, కొమురం భీమ్‌గా ఎన్టీఆర్ పాత్రలను పరిచయం చేసి సినిమాపై భారీ అంచనాలు పెంచారు జక్కన్న. చారిత్రక పాత్రలకు కల్పితగాథను జోడించి రాజమౌళి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. వచ్చే ఏడాది వేసవినాటికి సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. ఈ చిత్రంలో ఇద్దరు కథానాయకులు జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకోవడం ఖాయమనే టాక్ వినిపిస్తోంది. అయితే, చరణ్ ఇప్పటికే బాలీవుడ్లో ఓ సినిమా చేసినా, అది బాక్సాఫీస్ వద్ద ఆశించినంత మేర విజయం సాధించలేదు. దీంతో చెర్రీ ఆశలన్నీ ‘ఆర్ఆర్ఆర్’పైనే ఉన్నాయి.
దీని తర్వాత కూడా ఇద్దరు కథానాయకులు పాన్ ఇండియా కథలపైనే దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కూడా ఎన్టీఆర్ కోసం పాన్ ఇండియా స్థాయి కథను సిద్ధం చేశారు. ఆ తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలోనూ ఆ స్థాయి కథతోనే తారక్ నటించనున్నట్లు టాక్. ఈ చిత్రాలతో పాన్ ఇండియా కథల ఎంపికలో తారక్ జోరు చూపిస్తున్నట్లు అర్థమవుతోంది
‘పుష్ప’తో బన్ని..!
అల్లు అర్జున్ కథానాయకుడిగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘పుష్ప’. ఒక్క పోస్టర్‌తో సినిమాపై ఆసక్తిని పెంచారు సుక్కు. ఇందులో బన్ని లారీ డ్రైవర్ పుష్పరాజ్‌గా నటిస్తున్నట్లు సమాచారం. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. తెలుగుతో పాటు, మలయాళంలో అల్లు అర్జున్ చిత్రాలకు మంచి క్రేజ్ ఉంది. ఇప్పుడు ‘పుష్ప’ను ఐదు భాషల్లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే బన్ని నటించిన తెలుగు చిత్రాలు యూట్యూబ్ హిందీలో డబ్ అయి అక్కడి ప్రేక్షకులను విశేషంగా అలరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పుష్పతో బన్నికి జాతీయస్థాయి గుర్తింపు లభిస్తుందని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ఒక్క చిత్రం కోసం యావత్ దేశం
‘కె.జి.యఫ్’. కన్నడ చిత్రంగా విడుదలై పాన్ ఇండియా మూవీగా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. దీనికి కొనసాగింపుగా రానున్న ‘కేజీయఫ్2’ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాతో యశ్‌కు జాతీయ స్థాయి గుర్తింపు వచ్చింది. ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ సినిమా కూడా పాన్ ఇండియా మూవీగా విడుదల కానుంది. ఇప్పటికే ‘కేజీయఫ్2’పై భారీ అంచనాలు ఉన్నాయి. దీని తర్వాతా యశ్ భారీ కథలపైనే దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.
‘ఫైటర్’తో విజయ్ దేవరకొండ కూడా..!
‘వరల్డ్ ఫేమస్ లవర్’ చిత్రం తర్వాత ‘ఇక ప్రేమ కథలు చేయను’ అని సంచలన ప్రకటన చేశారు యూత్ ఐకాన్ విజయ్ దేవరకొండ. అందుకు తగినట్లుగానే కథలను ఎంచుకుంటున్నారాయన. మాస్ దర్శకుడు పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ నటిస్తున్న చిత్రం ‘ఫైటర్’(వర్కింగ్ టైటిల్). దీంతో విజయ్ పాన్ ఇండియా హీరోగా పరిచయం కానున్నాడు. ‘అర్జున్‌రెడ్డి’తో అందరినీ కట్టిపడేసిన విజయ్‌కు.. ఈ సినిమా జాతీయస్థాయిలో గుర్తింపు ఇస్తుందని ఆయన అభిమానులు ఆశిస్తున్నారు.
వీరే కాదు, చాలా మంది యువ కథానాయకులు పాన్ ఇండియ కథలతో తెరకెక్కే చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు రావాలని ఉవ్విళ్లూరుతున్నారు. ఇప్పటికే నటుడు రానా పలు హిందీ చిత్రాల్లో తళుక్కున మెరిశాయి. మరి భవిష్యత్‌లో ఎవరెవరు పాన్ ఇండియా స్టార్లుగా మారతారో వేచి చూడాలి.