close
Array ( ) 1

తాజా వార్తలు

టాప్‌ 10 న్యూస్‌ @ 9 PM

1. ‘లాక్‌డౌన్‌ పొడిగింపుపై ఆ వార్తలు నమ్మొద్దు’

లాక్‌డౌన్‌ను పొడిగించాలని రాష్ట్రాలు కోరుతున్నాయనీ.. వారి ప్రతిపాదనలపై ఆలోచిస్తున్నట్టు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్‌ అగర్వాల్‌ తెలిపారు. దేశంలో కరోనా పరిస్థితిపై దిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. లాక్‌డౌన్ పొడిగింపుపై ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని లవ్ అగర్వాల్‌ స్పష్టం చేశారు. దీనిపై సామాజిక మాధ్యమాల్లో వచ్చే వార్తలను నమ్మొద్దని చెప్పారు. పేదలపై ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేక దృష్టిసారించారని చెప్పారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు లక్ష మందికి కరోనా పరీక్షలు చేయించామన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. 23 రోజుల పసికందుకు కరోనా పాజిటివ్‌

మహబూబ్‌నగర్‌లో మరో మూడు పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. తాజాగా నమోదైన ఈ కేసుల్లో 23 రోజుల పసికందుకు సైతం కరోనా వైరస్‌ సోకినట్లు జిల్లా కలెక్టర్‌ వెంకట్‌రావు తెలిపారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. రెండు రోజుల క్ర్రితం పసికందు తండ్రితో పాటు నాయనమ్మకు కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. తాజాగా ఆ కుటుంబంలో చిన్నారికి వైరస్‌ సోకింది. మెరుగైన చికిత్స కోసం పసికందును సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* లక్షణాలు లేవు.. అయినా ఇద్దరికి పాజిటివ్‌

3. వచ్చే వారంరోజులు అత్యంత కీలకం: ఉపరాష్ట్రపతి

వచ్చే వారం రోజులు లాక్‌డౌన్‌లో అత్యంత కీలకమని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు మంగళవారం అన్నారు. ఈ వారంలో ఉండే కరోనా తీవ్రతను బట్టి లాక్‌డౌన్‌ను మరికొన్ని రోజులు పొడిగించాలా, వద్దా అనే ప్రభుత్వం తీసుకునే నిర్ణయం ఆధారపడి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. మార్చి 24న ప్రధాని మోదీ మూడువారాల లాక్‌డౌన్‌ ప్రకటించాక మొదటి రెండు వారాలు ప్రజలంతా బలమైన సంకల్పంతో కరోనాపై పోరాటం చేశారని హర్షం వ్యక్తం చేశారు. ప్రస్తుతం మూడో వారంలోకి చేరుకున్న క్రమంలో ఏప్రిల్‌ 14 తర్వాత ప్రధాని మోదీ ఏ నిర్ణయం తీసుకున్నా ఇప్పటి మాదిరిగానే దేశప్రజలంతా ప్రభుత్వానికి సహరించి కరోనాను పూర్తిగా అంతం చేయాలని పిలుపునిచ్చారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. 30 రోజుల్లో ఒకర్నుంచి 406 మందికి వైరస్‌

లాక్‌డౌన్‌, వ్యక్తిగత దూరం వంటి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోకుంటే కొవిడ్‌-19 సోకిన వ్యక్తి 30 రోజుల్లో 406 మందికి వైరస్‌ను సంక్రమింపజేస్తాడని ఐసీఎంఆర్‌ అధ్యయనంలో తేలిందని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడం వల్ల బాధితుడి నుంచి 30 రోజుల్లో సగటుగా కేవలం 2.5 మందికి మాత్రమే వైరస్‌ సోకుతుందని ఆ శాఖ సంయుక్త కార్యదర్శి లవ్‌ అగర్వాల్‌ తెలిపారు. ఐసీఎంఆర్‌ ప్రకారం కరోనా వైరస్‌ ‘R0’ (ఆర్‌ నాట్‌) 1.5 నుంచి 4 మధ్యలో ఉంటుందని ఆయన వెల్లడించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. ప్రతిపక్షంతో ఎందుకు సంప్రదించరు?:రేవంత్‌

రాష్ట్రంలో లాక్‌డౌన్‌ కొనసాగించాలనుకుంటే అందుకు తగినట్లు యంత్రాంగాన్ని సిద్ధం చేయాలని.. లేదంటే ప్రజల్లో అసహనం పెరుగుతుందని కాంగ్రెస్‌ ఎంపీ రేవంత్‌ రెడ్డి అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలోని పేదలు, బస్తీవాసులు, వలస కూలీలకు నిత్యావసరాలను పంపిణీ చేసే ప్రక్రియలో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోన్న తీరు సరిగా లేదని ఆయన మండిపడ్డారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. లాక్‌డౌన్‌పై సీఎం కేసీఆర్‌ పూటకో మాట మాట్లాడుతున్నారని రేవంత్‌ వ్యాఖ్యానించారు. కరోనాపై ప్రతిరోజూ ప్రధాని మోదీతో మాట్లాడున్నట్లు సీఎం చెప్పారని.. మరి రాష్ట్రంలోని ప్రధాన ప్రతిపక్షంతో ఎందుకు సంప్రదింపులు జరపడం లేదని ప్రశ్నించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* నిజామాబాద్‌లో మరో10 కరోనా కేసుల నమోదు

6. కరోనా లేదు..లాక్‌డౌన్‌ ఎత్తేస్తాం

కరోనా వైరస్‌ కారణంగా భారత్‌లోని చాలా రాష్ట్రాలు ఆందోళనకర పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. కొన్ని రాష్ట్రాలు అయితే లాక్‌డౌన్‌ను పొడిగించాలంటూ కేంద్రాన్ని విజ్ఞప్తి కూడా చేశాయి. అయితే ఈశాన్య భారతంలోని మేఘాలయ మాత్రం ఇందుకు భిన్నంగా వ్యవహరించింది. లాక్‌డౌన్‌ను పాక్షికంగా ఎత్తివేయాలని నిర్ణయించుకుంది. దీనిపై అక్కడి ప్రభుత్వం అధికారిక ప్రకటన కూడా చేసింది. అందుకు కారణం అక్కడ ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాకపోవడమే. ‘ఏప్రిల్ 15 నుంచి అన్ని ప్రభుత్వ కార్యాలయాలు పనిచేస్తాయి. పాఠశాలలను మాత్రం ఏప్రిల్ 30 వరకు మూసి ఉంచుతాం. ఆరోగ్య శాఖ చేసిన సూచనలను అనుసరించి గ్రామీణ ప్రాంతాల్లోని మార్కెట్లు తెరవడానికి, రైతులు పొలాలకు వెళ్లడానికి అనుమతిస్తాం’ అని ఆ ప్రకటనలో ప్రభుత్వం పేర్కొంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. కరోనా: ఆశాజనకంగా ప్లాస్మా థెరపి

 దక్షిణ కొరియాలో ఇద్దరు వృద్ధులు ‘ప్లాస్మా థెరపి’తో కరోనా వైరస్‌ నుంచి విముక్తి పొందారు. కొవిడ్‌-19 నుంచి కోలుకున్న వారి ప్లాస్మాతో చికిత్స చేయగా తీవ్రమైన న్యూమోనియా లక్షణాల నుంచి వీరు బయటపడ్డారని పరిశోధకులు తెలియజేశారు. ప్రపంచాన్ని వణికిస్తున్న మహమ్మారిని ఎదుర్కోవడానికి ‘ప్లాస్మా థెరపి’ ఆశాజనకంగా కనిపిస్తోందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. రక్తంలో కలిసుండే జిగురులాంటి పారదర్శక పదార్థమే ప్లాస్మా. కరోనా వైరస్‌ సోకి కోలుకున్నవారిలో యాంటీ బాడీస్‌ తయారవుతాయి. వాటిని ఉపయోగించే తాము చికిత్స చేశామని పరిశోధకులు తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. ఉద్యోగుల్ని తొలగించం..ఇంక్రిమెంట్లు వేస్తాం: డీఎల్‌ఎఫ్‌

లాక్‌డౌన్‌తో స్థిరాస్తి రంగం దెబ్బతిన్నప్పటికీ ఉద్యోగులను తొలగించబోమని డీఎల్‌ఎఫ్‌ సంస్థ తెలిపింది. కొన్ని స్థాయిల వరకు ఉద్యోగులకు వార్షిక వేతన పెంపు చేపడతామని వెల్లడించింది. ‘ఎవరినీ తొలగించం. ఎల్‌ 3 స్థాయి వరకు డీఎల్‌ఎఫ్‌ ఉద్యోగులకు వార్షిక వేతన పెంపు చేపడతాం’ అని ఆ సంస్థ ప్రకటించింది. ఉద్యోగులు అందరికీ, డీఎల్‌ఎఫ్‌లో ప్రత్యక్ష్యంగా పనిచేస్తున్న రోజువారీ కూలీలు, కాంట్రాక్టర్లకు మార్చి నెల వేతనాలు చెల్లించామని డీఎల్‌ఎఫ్‌ తెలిపింది. ఏప్రిల్‌ నెల జీతాలూ చెల్లిస్తామని హామీ ఇచ్చింది. డీఎల్‌ఎఫ్‌ ఫౌండేషన్‌ తరఫున కొవిడ్‌-19 నియంత్రణ కోసం హరియాణా ప్రభుత్వానికి రూ.5 కోట్లను విరాళంగా ప్రకటించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* వడ్డీరేటు తగ్గించిన ఎస్‌బీఐ

9. 8 గ్రామాల్ని దత్తత తీసుకున్న మోహన్‌బాబు

ప్రముఖ నటుడు మోహన్‌బాబు, ఆయన కుమారుడు మంచు విష్ణు కలిసి ఎనిమిది గ్రామాల్ని దత్తత తీసుకున్నారు. చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలోని ఎనిమిది గ్రామాల ప్రజలకు వీరు అండగా నిలిచారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో అక్కడ ఉన్న పేద కుటుంబాలకు రోజుకు రెండు పూటల ఆహారం సరఫరా చేస్తున్నారు. లాక్‌డౌన్‌ను తొలగించే వరకూ ఇలా ఆహారం పంపిణీ చేయబోతున్నారు. ఇది కాకుండా రోజుకు ఎనిమిది టన్నుల కూరగాయల్ని ఉచితంగా సరఫరా చేస్తున్నారు. దీంతో నెటిజన్లు వీరిని మెచ్చుకుంటున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. ఐపీఎల్‌తో ఆసీస్‌ క్రికెటర్ల నోర్లు మూతపడ్డాయ్‌

 ఒకప్పుడు స్లెడ్జింగ్‌కు మారుపేరైన ఆస్ట్రేలియా క్రికెటర్లు ఇప్పుడు భారత జట్టును, కెప్టెన్‌ విరాట్‌కోహ్లీని పల్లెత్తుమాట అనడానికి భయపడుతున్నారని ఆసీస్‌ మాజీ బ్యాట్స్‌మన్‌ మైఖేల్‌క్లార్క్‌ అన్నాడు. ఐపీఎల్‌తో కంగారూల నోర్లు మూతపడ్డాయని అభిప్రాయపడ్డాడు. ‘క్రికెట్‌లో భారత్‌ ఆర్థికంగా ఎంత బలమైందో అందరికీ తెలిసిందే. అంతర్జాతీయ క్రికెటైనా, దేశవాళీ ఐపీఎల్‌ అయినా ఆటగాళ్లు భారీగానే ఆర్జిస్తారు. గతకొన్నేళ్లుగా ఆస్ట్రేలియాతో పాటు దాదాపు అన్ని జట్లూ భారత్‌కు దాసోహం అయిపోయాయి. వాళ్లంతా ఇప్పుడు భారత జట్టును, కెప్టెన్‌ విరాట్‌కోహ్లీని స్లెడ్జింగ్‌ చేయడానికి భయపడుతున్నారు. ఐపీఎల్‌లో టీమ్‌ఇండియా ఆటగాళ్లతో కలిసి ఆడాల్సి వస్తుందనే స్లెడ్జింగ్‌ జోలికి వెళ్లట్లేదు’ అని క్లార్క్‌ పేర్కొన్నట్లు క్రిక్‌బజ్‌ రాసుకొచ్చింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.