
తాజా వార్తలు
మన క్రికెటర్లూ ఆహార ప్రియులే..!
చిత్రం: అధికారిక ట్విటర్ ఖాతా నుంచి..
ఇంటర్నెట్ డెస్క్: ఫిట్‌గా ఉండాలంటే క్రమం తప్పక వ్యాయామం చేయాలి. ఆహార నియమాలు పాటించాలి. అందులోనూ ఓ క్రికెటర్ అయితే.. ప్రత్యేక డైట్ పాటించాల్సిందే. కసరత్తులు చేస్తూ ఫిట్‌గా తయారవ్వాల్సిందే. కానీ ఎంత ఫిట్‌గా తయారైనా.. ఎంతటి డైట్ పాటించినా.. వీలుచిక్కినపుడు డైట్‌కి కాస్త కామా పెట్టి నచ్చింది లాగించేస్తారు. అలా మన భారత క్రికెట్ జట్టు సభ్యులు ఇష్టపడే ఆహారం ఏంటి? వారు మెచ్చిన ఆహార పదార్థాలేంటి? ఓ లుక్కేయండి.
విరాట్ కోహ్లీ
భారత జట్టులో ఫిట్నెస్కి కేరాఫ్ అడ్రస్ కెప్టెన్ కోహ్లీ. ఎంతో మంది యువ క్రికెటర్లు విరాట్‌ని చూసి ఫిట్‌నెస్‌లో ప్రేరణ పొందుతుంటారు. చిన్నతనంలో నూడుల్స్, పఫ్స్ వంటి చిరుతిళ్లు ఇష్టంగా తినే ఈ దిల్లీ కుర్రాడు గత ఎనిమిదేళ్లుగా వాటన్నిటినీ తినడం తగ్గించాడు. రోజూ రెండు గంటలు జిమ్, ప్రత్యేక డైట్ ఫాలో అవుతున్నాడు. కానీ విరాట్‌కి జపనీస్ ఆహారమంటే ఎంతో ఇష్టం. ముఖ్యంగా ‘సుశి’ అనే వంటకాన్ని వీలు చిక్కినప్పుడల్లా లాగించేస్తాడు. ‘ఆలూ పరాఠా, చోలే భటూరే’ తదితర పంజాబీ వంటకాలన్నా తనకి మహా ఇష్టం.
ఎం.ఎస్ ధోనీ
బేసిక్‌గా మన మాజీ భారత క్రికెట్ జట్టు సారథి ఆహార ప్రియుడు. సమయం దొరికితే చాలు డైట్ కాస్త పక్కన పెట్టి నచ్చిన ఆహారం లాగిస్తాడు. ధోనీకి చికెన్‌తో చేసిన వంటకాలంటే చాలా ఇష్టం. చికెన్ కబాబ్స్, చికెన్ బటర్ మసాలా, చికెన్ టిక్కా పిజ్జా.. ఇలా చికెన్‌తో తయారైన ఏ వంటనైనా ఇష్టంగా తింటాడంటారు. ఓసారి ధోనీ ట్విటర్ బయోపై ఓ లుక్కేయండి. ఎప్పటికీ ‘హంగ్రీ ఫర్ చికెన్ బటర్ మసాలా’ అని రాసుకొచ్చాడు. హల్వా, కీర్ వంటి తియ్యని పదార్థాలనీ ఇష్టంగా తింటాడు.
రోహిత్ శర్మ
ఈ ముంబయి ఇండియన్సు కెప్టెన్‌కి వడపావ్, పావ్‌భాజీ అంటే చాలా ఇష్టం. రోహిత్ ఏం తీసుకుంటావ్... అని ఎవరైనా అడిగితే చటుక్కున ‘ఆలూ పరాఠా... ఆలూ పరాఠా’ అని బదులిస్తాడు. చైనీస్ వంటకాలపైనా మక్కువ చూపుతాడు. తన డైట్లో భాగంగా కోడిగుడ్లను ఎక్కువగా తీసుకుంటాడు.
కే.ఎల్ రాహుల్
ఒక్కసారి క్రీజులో నిలదొక్కుకుంటే చాలు, పరుగుల వరద పారించే యువ క్రికెటర్ కే.ఎల్ రాహుల్. ఫిట్నెస్కి చాలా ప్రాధ్యానం ఇస్తాడీ కర్ణాటక కుర్రాడు. చిరుతిళ్లు, ఆరోగ్యాన్ని పాడు చేసే ఆహార పదార్థాల వైపు అసలే చూడడు. కానీ జపనీస్ ఫుడ్ అంటే చాలా ఇష్టం. తీరిక దొరికితే రుచిరుచిగా ఉండే జపనీస్ ఫుడ్ తినేందుకు ఉవ్విళ్లూరుతాడు. చేపలు, పీతల వంటి సీఫుడ్ అంటే ఇష్టపడతాడు. రకరకాల రుచుల్లోని దోశలన్నా తనకిష్టమే.
రిషబ్ పంత్
యుజ్వేంద్ర చాహల్ మాటల ప్రకారం భారత క్రికెట్ జట్టులో అత్యధిక ఆహార ప్రియుడు రిషబ్ పంత్. ముందుంది శాకాహారమైనా, మాంసాహారమైనా ఇష్టంగా లాగించేయడమే పంత్ పనంట. టేబుల్ మీద పది వంటకాలుంటే అన్నింటినీ రుచి చూసేవరకు టేబుల్‌పై నుంచి కదలడట పంత్. ఆలూ పరాఠ అంటే పంత్కి చాలా ఇష్టమంటా. చోలే భటూరే అనే ఆహారాన్ని ఇష్టంగా లాగించేస్తాడంట ఈ యువ వికెట్ కీపర్. ఎన్ని ఆహార పదార్థాలు తిన్నా.. చివరికి ఐస్క్రీంని రుచి చూడనిదే టేబుల్ నుంచి కదలడంట ఈ డైనమిక్ ప్లేయర్.
యుజ్వేంద్ర చాహల్
స్పిన్ అస్త్రాలు సంధిస్తూ, చిచ్చర పిడుగులా వికెట్లు తీస్తూ... ఎప్పుడూ ఉల్లాసంగా ఉండే చాహల్ ఆహారానికి అధిక పాధాన్యతనిస్తాడు. బటర్ చికెన్ అంటే తనకెంతో ఇష్టం. దేశీయ వంటకాలన్నా మక్కువ ఎక్కువ. ముఖ్యంగా ఉత్తర భారత వంటకాలని చాలా ఇష్టంగా ఆరగిస్తాడు. చోలే కుల్చే, పానీ పూరీ, దాల్ తడ్కా, రాజ్మా చావల్ వంటి ఆహార పదార్థాలని ఇష్టంగా లాగించేస్తాడు. గ్రీన్ చట్నీ అంటే చాహల్‌కి చాలా ఇష్టం.
జస్ప్రీత్ బుమ్రా
మెరుపు వేగంతో యార్కర్లు వేసే బుమ్రా ఫిట్నెస్ ప్రియుడు. బయటి ఆహారం, చిరుతిళ్ల జోలికి పోడు. ఖాళీ సమయాల్లోనూ తనదైన ప్రొటీన్‌తో కూడిన డైట్‌నే పాటిస్తాడు. ఎక్కువగా ఇంట్లో వండిన ఆహారానికే ప్రాధాన్యతనిస్తాడు. గుజరాతీ వంటకం ధోక్లా తన ఫేవరిట్. సోన్‌పాపిడీ, గులాబ్‌జామ్ ఇష్టంగా తింటాడు. చికెన్‌తో చేసిన వంటకాలన్నా ఇష్టపడతాడు. చికెన్ బటర్ మసాలా, చికెన్ టిక్కా పిజ్జా, కబాబ్‌తో పాటు చేపలని ఇష్టంగా లాగించేస్తాడు.
భువనేశ్వర్ కుమార్
భువనేశ్వర్‌కి తీపి పదార్థాలంటే మక్కువ. ‘నాకు తీపి దంతాలు కూడా ఉన్నాయండీ’ అంటాడు ఈ పేస్ వీరుడు. కొన్ని సంవత్సరాల క్రితం వరకూ అసలు డైటే పాటించని భువి ప్రస్తుతం తనకంటూ ప్రత్యేక డైట్‌ని ఫాలో అవుతున్నాడు. ఫిట్నెస్కి అధిక ప్రాధాన్యం ఇస్తున్నాడు. భోజనంలో ఎక్కువగా ప్రొటీన్లు, పిండి పదార్థాలు, ఫైబర్, విటమిన్లు ఉండేలా చూసుకుంటాడు. ఇంటి వంటకే ప్రాధాన్యతనిస్తాడు. ‘కది చావల్’ అంటే భువికి చాలా ఇష్టం.