close
Array ( ) 1

తాజా వార్తలు

Published : 01/06/2020 20:57 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టాప్‌ 10 న్యూస్‌ @ 9 PM

1. ఏడాది పాలనలో అందరికీ వేదనే: చంద్రబాబు

ఏడాది పాలనలో బడుగు వర్గాలకు నామినేటెడ్ పదవులు ఇవ్వకపోగా.. గౌరవ ప్రదమైన పదవుల్లో ఉన్నవారిని వైకాపా ప్రభుత్వం అవమానించిందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు మండిపడ్డారు. మండలి ఛైర్మన్‌, షరీఫ్, డాక్టర్ సుధాకర్ ఘటనలే ఇందుకు నిదర్శనమన్నారు. ‘చేతకాని పాలన- అందరికీ వేదన’ పేరిట మరో వీడియోను చంద్రబాబు తన ట్విటర్‌ ఖాతాలో విడుదల చేశారు. ఇకనైనా ప్రభుత్వం తన పద్ధతి మార్చుకుని సమసమాజ స్థాపనకు కృషిచేయాలని హితువు పలికారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే వ్యక్తిగత విమర్శలా: ఉత్తమ్‌

సీఎం కేసీఆర్‌కు, ఆయన కేబినెట్‌ మంత్రులకు గత ఆరేళ్లుగా అబద్ధాలు మాట్లాడుతూ దబాయించడం అలవాటైందని తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి మండిపడ్డారు. ప్రతి విషయంలోనూ తెరాస నేతలు బూటకపు మాటలు చెప్తూ వస్తున్నారని దుయ్యబట్టారు. నిన్న నల్గొండలో తాను ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే మంత్రి జగదీశ్ రెడ్డి తనపై వ్యక్తిగత విమర్శలు చేశారని ఉత్తమ్ ఆక్షేపించారు. రుణమాఫీపై ప్రస్తావిస్తే అడ్డగోలుగా మాట్లాడారని విమర్శించారు.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. నిమ్మగడ్డ వ్యవహారం.. సుప్రీంలో పిటిషన్‌

ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ వ్యవహారంలో ఏపీ ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్‌ చేస్తూ సుప్రీం కోర్టులో స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ను దాఖలు చేసింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ పదవీ కాలం కుదిస్తూ ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌, జీవోలను ఇటీవల హైకోర్టు కొట్టివేసిన సంగతి తెలిసిందే. అలాగే నిమ్మగడ్డను మళ్లీ ఎస్‌ఈసీగా నియమించాలంటూ ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. తెలంగాణలో కరోనాతో మరో ఆరుగురి మృతి

తెలంగాణలో కరోనా మహమ్మారి కారణంగా మరో ఆరుగురు మృత్యువాత పడ్డారు. దీంతో ఇప్పటి వరకు మృతిచెందిన వారి సంఖ్య 88కి చేరింది. కొత్తగా ఇవాళ 94 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇవాళ నమోదైనవన్నీ తెలంగాణలో పరిధిలోనివే కావడం గమనార్హం. ఒక్క జీహెచ్‌ఎంసీ పరిధిలో 79 కేసులు వెలుగుచూశాయి. మొత్తం కేసుల సంఖ్య 2,792కి చేరింది. ఇప్పటి వరకు 1492 మంది ఈ మహమ్మారి నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. అమెరికాపై ఎదురుదాడికి దిగిన చైనా!

హాంగ్‌కాంగ్‌ విషయంలో జోక్యం చేసుకుంటున్న అమెరికాపై తాజాగా చైనా ఎదురుదాడికి దిగింది. హాంగ్‌కాంగ్‌లో జాతీయ భద్రతా చట్టాన్ని అమలుచేయాలని ప్రయత్నిస్తున్న చైనాపై చర్యలు తప్పవని ఈ మధ్యే ట్రంప్‌ స్పష్టం చేశారు. హాంగ్‌కాంగ్‌కు ఎంతోకాలంగా గర్వకారణంగా ఉన్న హోదాను చైనా ప్రభుత్వం అణచివేసిందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ అభిప్రాయపడ్డారు. దీనిలో భాగంగా చైనా విద్యార్థులపై ఆంక్షలు విధిస్తామని ట్రంప్‌ ప్రకటించారు. దీనిపై తాజాగా చైనా ఆగ్రహం వ్యక్తం చేస్తూ..ఇది ఇరువైపుల హానికలిగించే చర్యగా పేర్కొంది. చైనా ప్రయోజనాలకు హానికలిగించే ఎలాంటి చర్యలు, మాటలున్నా తీవ్ర ప్రతిఘటన ఉంటుందని చైనా విదేశాంగశాఖ అధికార ప్రతినిధి ఝావో లిజియన్‌ హెచ్చరించారు.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* అమెరికాకు అదో వ్యసనం: చైనా

6. బండి దొంగతనం చేసి..తిరిగి పంపాడు..

లాక్‌డౌన్‌ నేపథ్యంలో కుటుంబంతో సహా ఇంటికి వెళ్లడం కోసం ద్విచక్రవాహనాన్ని దొంగతనం చేసి, తిరిగి దాన్ని యజమానికి పార్శిల్ చేసిన సంఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. తమిళనాడులోని కోయంబత్తూర్‌ జిల్లాలో సురేశ్ కుమార్ అనే వ్యక్తికి ఇంజనీరింగ్ టూల్స్‌ తయారు చేసే కంపెనీ ఉంది. రెండు వారాల క్రితం అతడి ద్విచక్రవాహనం దొంగతనానికి గురైంది. దానిపై అతడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వారు ఒకవైపు విచారణ చేస్తుండగా.. అతడికి బండి పార్శిల్ వచ్చిందంటూ డెలివరీ సంస్థ నుంచి సమాచారం అందింది. వెళ్లి చూడగా కనిపించకుండా పోయిన వాహనం ఉండటంతో ఆశ్చర్యపోవడం అతడివంతైంది.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. భారత్‌కు మరో తుపాను ముప్పు...

భారత్‌కు మరో తుపాను ముప్పు పొంచి ఉన్నట్లు వాతావరణ పరిశోధనాశాఖ ఈ ఉదయం ప్రకటించింది. ఆగ్నేయ అరేబియా సముద్రంలో ఆదివారం అల్పపీడనం ఏర్పడినట్టు ఆ శాఖ శాస్త్రవేత్తలు వివరించారు. ఈ అల్పపీడనం గోవాలోని పాంజిమ్‌కు నైరుతి దిశగా 370 కి.మీ, ముంబయికి దక్షణ నైరుతి దిశగా 690 కి.మీ దూరంలో, గుజరాత్‌లోని సూరత్‌కు దక్షణ నైరుతి దిశలో 920 కి.మీ దూరంలో కేంద్రీకృతమైనట్టు తెలిపింది. కాగా ఇది సోమవారం నాటికి వాయుగుండంగా, అనంతరం తుపానుగా మారే అవకాశం ఉందని వారు అంచనా వేస్తున్నారు.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* అంపన్, నిసర్గ తుపాన్లు.. ఆ పేర్లెలా పెడతారు?

8. రవితేజ ఫ్యామిలీ టైమ్‌.. ప్రగతి డ్యాన్స్‌..!

లాక్‌డౌన్‌లో మన తారలు సోషల్‌మీడియా వేదికగా అభిమానులకు మరింత దగ్గరయ్యారు అనడంలో అతిశయోక్తి లేదు. ఎప్పుడూ షూటింగ్‌లతో బిజీగా ఉండే నటీనటులు గత కొన్నాళ్లుగా ఇంట్లోనే ఉంటున్నారు. దీంతో సోషల్‌మీడియా వేదికగా తమ అభిప్రాయాల్ని, ఇంట్లో చేస్తున్న పనుల్ని పంచుకుంటున్నారు. తాజాగా స్టార్స్‌ ఏం షేర్‌ చేశారో చూడిండి.. మిల్కీబ్యూటీ తమన్నా అమ్మ చేతి పరాటాను ఇష్టంగా లాగించారు. మాస్‌ మహారాజా రవితేజ కుటుంబంతో కలిసి విలువైన సమయం గడుపుతున్నారు. కథానాయకుడు వరుణ్‌తేజ్‌ తన తర్వాతి సినిమా కోసం సిద్ధమౌతున్నారు.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. అఫ్రిది×గంభీర్‌: వివేకంగా ప్రవర్తించడయ్యా!

టీమ్‌ఇండియా మాజీ ఓపెనర్‌ గౌతమ్ గంభీర్‌, పాక్‌ మాజీ క్రికెటర్‌ షాహిద్‌ అఫ్రిది సామాజిక మాధ్యమాల్లో పరుష సంభాషణలు కట్టిపెట్టాలని పాక్‌ కోచ్‌ వకార్‌ యూనిస్‌ అన్నాడు. కాస్త వివేకంతో వ్యాఖ్యలు చేయాలని వారిద్దరికీ సూచించాడు. గంభీర్‌, అఫ్రిది మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత శత్రుత్వం ఉన్న సంగతి తెలిసిందే! భారత్‌ రాజకీయాలు, కశ్మీర్‌ అంశాలపై అఫ్రిది విపరీతంగా మాట్లాడితే గౌతీ అదే స్థాయిలో ప్రతిస్పందిస్తాడు. ఈ క్రమంలో కాస్త కటువైన మాటలనూ వినియోగిస్తారు. వ్యక్తిగత విమర్శలూ చేసుకున్నారు.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. IN PICS: ‘చిత్రం’ చెప్పే విశేషాలు

లాక్‌డౌన్‌తో దేశవ్యాప్తంగా జిమ్‌లు, ఫిట్‌నెస్‌ కేంద్రాలు మూతపడ్డాయి. వీటిని తిరిగి తెరవాలని కోరుతూ కోల్‌కతాలో బాడీ బిల్డర్లు, ఫిట్‌నెస్‌ బోధకులు నిరసన ప్రదర్శన నిర్వహించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.