close

తాజా వార్తలు

Published : 14/10/2020 20:56 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టాప్‌ 10 న్యూస్‌ @ 9 PM

1. సామాన్యుల దీపావళి మీ చేతుల్లోనే: సుప్రీం

కరోనా సంక్షోభంలో రుణగ్రహీతలకు ఇచ్చిన మారటోరియం కాలంలో విధించిన చక్రవడ్డీ మాఫీ విషయంపై సుప్రీంకోర్టులో మరోసారి విచారణ జరిగింది. రూ.2 కోట్ల వరకు ఉన్న రుణాలపై చక్రవడ్డీ మాఫీ అమలు ఏమైందని జస్టిస్‌ అశోక్‌ భూషణ్‌ ధర్మాసనం కేంద్రాన్ని ప్రశ్నించింది. చక్రవడ్డీ మాఫీపై నిర్ణయం తీసుకున్నామని.. అయితే ఇంకా అమలు చేయలేదని సోలిసిటరీ జనరల్‌ తుషార్‌ మెహతా కోర్టుకు తెలిపారు. మరోవైపు రూ.2 కోట్ల వరకు ఉన్న రుణాలపై చక్రవడ్డీ మాఫీ చేస్తామని బ్యాంకుల తరఫు న్యాయవాది హరీష్‌ సాల్వే కూడా కోర్టుకు తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. పూర్తి అప్రమత్తంగా ఉండండి: జగన్‌

వరద ప్రభావిత ప్రాంతాల శిబిరాల్లో ఉన్నవారిపట్ల మానవతా దృక్పథంతో వ్యవహరించాలని.. వారికి రూ.500 చొప్పున ఆర్థికసాయం అందించాలని సీఎం జగన్‌ అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో వరద సహాయక చర్యలను మరింత ముమ్మరం చేయాలని.. అన్ని చోట్ల విద్యుత్‌ సరఫరాను పునరుద్ధరించాలని సూచించారు. రాష్ట్రంలో వరద పరిస్థితి, సహాయ కార్యక్రమాలపై జిల్లాల వారీగా అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. రోడ్లపై గుంతలు పూడ్చి అవసరమైన మరమ్మతులు చేయాలని దిశానిర్దేశం చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. ఏపీలో కరోనా.. కొత్తగా 3,892 కేసులు

ఏపీలో కరోనా కేసుల తగ్గుముఖం కొనసాగుతోంది. ఒక్కరోజు వ్యవధిలో 69,463 నమూనాలను పరీక్షించగా 3,892 మందికి కరోనా నిర్ధారణ అయినట్లు వైద్యఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో నమోదైన కొవిడ్‌ కేసుల సంఖ్య 7,67,465కి చేరింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం బులెటిన్‌ విడుదల చేసింది. 24 గంటల వ్యవధిలో కరోనాతో చికిత్స పొందుతూ 28 మంది మృతిచెందారు. దీంతో రాష్ట్రంలో కరోనాతో మృతిచెందిన వారి సంఖ్య 6,319కి చేరింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. ఆ వదంతులు నమ్మొద్దు: మెట్రో ఎండీ

నగరంలోని మెట్రో పిల్లర్లపై వస్తున్న వదంతులను నమ్మవద్దని హైదరాబాద్‌ మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి స్పష్టం చేశారు. గత రెండు రోజులుగా హైదరాబాద్‌లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు మూసాపేట మెట్రో స్టేషన్‌ కింద రహదారి కుంగిపోయింది. పక్కనే ఉన్న మెట్రో పిల్లర్‌ వద్ద కూడా భూమి కుంగి ఆ గుంతల్లోకి నీరు చేరింది. ఈ నేపథ్యంలో ఎన్వీఎస్‌ రెడ్డి స్పందించారు. కూకట్‌పల్లి ఐడీఎల్‌ చెరువుతో పాటు రోడ్లపై ప్రవహిస్తున్న వరదనీటితో మెట్రో పిల్లర్‌ చుట్టూ ఉన్న మట్టి కొట్టుకుపోయిందన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. కరోనాపై పోరు: 5 నెలలకు పైగా యాంటీబాడీలు!

కరోనా వైరస్‌ సోకినప్పుడు విడుదలయ్యే యాంటీబాడీస్‌ అనే ప్రత్యేక ప్రొటీన్లు.. ఐదు నుంచి ఏడు నెలల అనంతరం కూడా ఆ వ్యాధి సోకకుండా కాపాడతాయని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. భారతీయ మూలాలున్న దీప్తా భట్టాచార్య నేతృత్వంలో అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్‌ అరిజోనా శాస్త్రవేత్తలు.. సుమారు 6000 కొవిడ్‌-19 బాధితుల నుంచి సేకరించిన నమూనాలపై ఈ పరిశోధనలు జరిపారు. వీటి ఫలితాలు ఇమ్యూనిటీ అనే జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. ఐదు టన్నుల బాంబుని నీళ్లలో పేల్చేశారు..!

రెండో ప్రపంచం యుద్ధం నాటి ఓ బాంబును తాజాగా పోలాండ్‌ అధికారులు నీళ్లలో ముంచి పేల్చేశారు. 1945లో నాజీ యుద్ధనౌకపై రాయల్‌ ఎయిర్‌ఫోర్స్‌ ఈ బాంబును విసిరిందట. కానీ, అది పేలకుండా కింద పడిపోయింది. స్వినోవిస్యా ప్రాంతంలోని ఓడరేవు వద్ద భూమిలో 12 మీటర్ల లోతులో పాతుకుపోయిన ఐదు టన్నుల బరువున్న బాంబును.. అధికారులు గతేడాది గుర్తించారు. 2.4 టన్నుల పేలుడు పదార్థాలు ఉన్న ఈ బాంబుకు ‘టాల్‌ బాయ్‌’ అని పేరు పెట్టారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. ఈ ఐఫోన్ల ధరలు తగ్గాయ్‌.. కానీ!

ఐఫోన్‌ వినియోగదారులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐఫోన్‌ 12 వచ్చింది. ఐఫోన్‌ 12, ఐఫోన్‌ 12 ప్రొ, ఐఫోన్‌ 12 ప్రొ మ్యాక్స్, ఐఫోన్‌ 12 మినీని యాపిల్‌ మంగళవారం విడుదల చేసింది. 30 నుంచి భారత్‌లో వీటి విక్రయాలు ప్రారంభం కానున్నాయి. దీంతో ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ఐఫోన్ల ధరలను కంపెనీ తగ్గించింది. ఐఫోన్‌ ఎక్స్‌ఆర్‌, ఐఫోన్‌ ఎస్‌ఈ, ఐఫోన్‌ 11 ఎంఆర్‌పీ ధరలను సవరించి.. కొత్త ధరల వివరాలను యాపిల్ ఇండియా తమ ఆన్‌లైన్‌ స్టోర్‌లో ఉంచింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. ట్రంప్‌కు భారతీయ అమెరికన్ల షాక్‌!

అమెరికాలో 26 లక్షలకు పైగా ఉన్న భారతీయ అమెరికన్ ఓటర్లకు గతంలో ఎప్పుడూ లేనంతగా 2020 అధ్యక్ష ఎన్నికల్లో ఎక్కువ ప్రాధాన్యం లభిస్తోంది. 12 రాష్ట్రాల్లో వీరి మొగ్గును బట్టి ఎన్నికల ఫలితాలు అతి స్వల్ప మెజారిటీతో మారిపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ ఫలితాలు కాబోయే అధ్యక్షుడు ఎవరనేదీ నిర్ణయించడంలో కీలకం కాగలవని పరిశీలకులు అంటున్నారు. ఈ నేపథ్యంలో భారతీయ అమెరికన్లపై జాన్‌ హాప్కిన్స్‌ విశ్వవిద్యాలయంతో సహా పలు సంస్థలు ఓ సంయుక్త సర్వేను చేపట్టాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. వర్ష బీభత్సం.. గోడకూలి ఆరుగురి మృతి

మహారాష్ట్రలో విషాద ఘటన చోటుచేసుకుంది. భారీ వర్షాల నేపథ్యంలో షోలాపూర్‌ జిల్లాలోని పండర్‌పూర్‌ పట్టణంలో ఓ గోడ కూలిపోయింది. ఈ ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. చంద్రభాగ నది ఒడ్డున ఉన్న ఈ గోడ మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో కూలిపోయినట్టు అధికారులు వెల్లడించారు. మృతుల్లో ఒకే కుటుంబానికి చెందిన వారు నలుగురు కాగా..  భారీ వర్షంతో అక్కడికి చేరుకున్న మరో ఇద్దరు ప్రాణాలు కోల్పోయినట్టు షోలాపూర్‌ ఎస్పీ వెల్లడించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. సోషల్‌ లుక్‌: రష్మిక ఆమ్లెట్‌.. అనసూయ ట్రీట్‌

కథానాయిక రష్మికకు ఆమ్లెట్‌ అంటే చాలా ఇష్టమట. ప్రతిరోజూ తన భోజనంలో అది కచ్చితంగా ఉంటుందని ఆమె తెలిపారు. తన స్టైల్‌లో స్వయంగా ఆమ్లెట్‌ చేసి.. ఇలా ప్రయత్నించండని వీడియో షేర్‌ చేశారు. బాలీవుడ్‌ కథానాయిక కంగనా రనౌత్‌ బరువు తగ్గే పనిలో పడ్డారు. ‘తలైవి’ సినిమా కోసం 20 కిలోల బరువు పెరిగిన ఆమె ఇప్పుడు తగ్గుతున్నట్లు చెప్పారు. ‘మళ్లీ నాజూకుగా తయారు కావాల్సిన అవసరం వచ్చింది.. ఉదయాన్నే నిద్రలేచి వాకింగ్‌కు వెళ్లా..’ అంటూ వ్యాయామం చేస్తున్న ఫొటోను షేర్‌ చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

చిత్ర వార్తలు

సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.